Share News

సొమ్ములొచ్చేశాయి..!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:50 AM

హమాలీ చార్జీల కోసం మూడున్నర నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు సొమ్ములు వచ్చాయి.

సొమ్ములొచ్చేశాయి..!

70,965 మందికి హమాలీ చార్జీలు

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): హమాలీ చార్జీల కోసం మూడున్నర నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు సొమ్ములు వచ్చాయి. జిల్లాలో 70,965 మంది రైతుల ఖాతాల్లో రూ.10.68 కోట్లు జమ అయ్యాయి. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సొమ్ములైతే 24 గంటల్లోపు రైతుల ఖాతాలో జమ య్యాయి.కానీ హమాలీ సొమ్ముల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 17న హామాలీ చార్జీలు ఏవీ? అనే కథనం ప్రచురిత మైంది. ప్రస్తుతం హామాలీ చార్జీలు జమయ్యాయని రవాణా భత్యం పెంపుదల చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ వేసి ధర నిర్ణయించి అది కూడా చెల్లిస్తామని జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం మహ్మద్‌ ఇబ్రహీం తెలిపారు.

గతంలో రవాణా భత్యం ఇలా

గతంలో రైతులే ధాన్యం రైస్‌ మిల్లులకు తరలించేవారు. రవాణా భత్యం రైతు కల్లం నుంచి 8 కిలోమీటర్ల లోపు దూరంలో రైస్‌మిల్‌ ఉంటే రవాణా చార్జీల కింద టన్ను ధాన్యానికి రూ.324 జమ చేసేవారు. 8 కిలోమీటర్లుు దాటితే రూ.600 ఇచ్చేవారు. ఇది సరిపోవడం లేదనే వినతుల నేపథ్యంలోనే రవాణా భత్యం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రస్థాయి కమిటీ వేసి రవాణా చార్జీలు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నారు. రవాణా భత్యం పెంచిన మరుక్షణం ఏప్రిల్‌ మొదటి వారంలో చెల్లించే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:50 AM