ఎమ్మెల్యే బాలరాజుపై సీరియస్
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:15 AM
ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలి, ఒంటెద్దు పోకడలపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి, ఒంటెద్దు పోకడలపై జనసేన అధినేత వవన్ ఆగ్రహం
ఇసుక, మట్టి తోలకాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీల్లో భారీగా వసూళ్లు
క్యాడర్‌ను విస్మరించడంతో రెండు వర్గాలుగా చీలిన పార్టీ
ప్రైవేటు స్కూల్ ఏర్పాటు, మద్యం దుకాణాలపైనా వివాదాలు
పార్టీ ఉన్నతస్థాయి కమిటీ విచారణ
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలి, ఒంటెద్దు పోకడలపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై వస్తున్న అవినీతి ఆరోపణలు, క్యాడర్‌ను విస్మరించడం, కుటుంబ వివాదాలు రచ్చ కెక్కడం తదితర అంశాలను పార్టీ అధిష్ఠానం సీరి యస్‌గా పరిగణించింది. ఈ వివాదాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు శుక్రవారం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధా రంగా బాలరాజుపై తదుపరి చర్యలు తీసుకునే అవ కాశం ఉందని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఒంటెద్దు పోకడలతో క్యాడర్ దూరం
నియోజకవర్గంలో పార్టీ విజయానికి కష్టపడిన నాయ కులు, క్యాడర్‌ను విస్మరించి ఎమ్మెల్యే బాలరాజు ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే విమర్శలున్నాయి. స్వప్రయోజ నాల కోసం పట్టు లేని వారికి, కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రగులుకుంది. దీంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు ఆయనకు దూరమ య్యారు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇటీవల నామినేటెడ్ పదవుల దరఖాస్తుల స్వీకరణ కోసం పార్టీ పరిశీలకులు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఏలూరులో కార్యక్రమం చేపట్టారు. దీనికి నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షులు, ముఖ్య నేతలు కొయ్యలగూడెం వై.జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి దరఖాస్తులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలరాజు హాజరుకాలేదు. మరుసటి రోజు ఆయన తన వర్గీయులతో కలిసి కార్ల ర్యాలీగా ఏలూరు వెళ్లి దరఖాస్తులు ఇప్పించారు. వెళ్లే ముందు జంగారెడ్డి గూడెం సెంటర్‌లో ఆయన ఆవేశంగా మాట్లాడిన తీరుపై క్యాడర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో కమీషన్లు
పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గిరిజనేతరు లకు ప్రభుత్వం కేటాయించే భూములకు సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు దళారులుగా అవతరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్యాకేజీ లబ్ధిదారుల నుంచి కమీషన్ల కోసం ముందుగానే ఖాళీ చెక్కులు, ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లు విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, జీలుగుమిల్లి–బుట్టాయ గూడెం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు మంచి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ పేరుతో ఏజెంట్ల ద్వారా ముందుగానే నగదు వసూలు చేసినట్లు సమాచారం.
ఇసుక, మట్టి మాఫియాతో కుమ్మక్కు
మట్టి, ఇసుక తోలకాల్లోనూ ఎమ్మెల్యే అనుచరులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చుట్టుముట్టా యి. ఇటీవల కొయ్యలగూడెం మండలం రాజవరం, గంగవరం తదితర గ్రామాల చెరువుల నుంచి మట్టి తరలించేందుకు రోజుకు రూ.పది వేలు చొప్పున ఎమ్మెల్యే సన్నిహితురాలికి చెల్లించాలనే నిబంధన పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికోసం అధికారులతో కుమ్మక్కయ్యారు. గత వేసవిలోనూ ఆయన అనుచరుల మధ్య డబ్బుల పంపకాల్లో గొడవలు జరిగి వీధిన పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే సర్దుబాటు చేస్తూ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే, అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వాహ నాలను ఎమ్మెల్యే విడిపించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు బినామీ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తూ, బెల్టు షాపుల ద్వారా ఏటా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
వివాదాస్పదంగా ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు
ఎమ్మెల్యే తన ఇంటికి సమీపంలో ఒక ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటుచేసి, జంగారెడ్డిగూడెంలోని ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత వివాదం తలెత్తి అది రద్దయింది. ఆపై జీలుగుమిల్లిలో ఉన్న మరో ప్రైవేట్ స్కూల్‌ను బెదిరించి స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణ లున్నాయి. ఏపీ గిరిజన బాలుర గురుకుల పాఠశాల పక్కనే ఈ ప్రైవేట్ స్కూల్‌ను ప్రోత్సహించడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
విసుగుచెందిన అధిష్ఠానం
గతంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, పార్టీ వివాదాలపై అధిష్ఠానం బాలరాజును పిలిపించి మందలించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. నెల రోజుల్లో తన పద్ధతి మార్చుకుంటానని ఆయన అంగీకరించారు. గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైనందున పారదర్శక పాలన అందించాలని పవన్ కల్యాణ్ సూచించినా ఆయన తీరు మారలేదు. ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోపాటు ఆరోపణలు పెచ్చుమీరడంతో అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది.