ఆదివాసీ హక్కుల సాధనలో ముందుంటా..
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:17 AM
‘ఆదివాసీల హక్కుల సాధనలో జరిగే ఆందోళలు, ఉద్యమాల్లో అవసరమైతే నేను కూడా ముందువరసలో ఉంటా. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు మాసుకుని కూర్చునే వ్యక్తిని కాదు’ అంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు.
1/70 చట్టాన్ని సవరించే దమ్ము ఎవరికీ లేదు
సీఎం దృష్టికి జీవో నెం.3 రద్దు, తరగతుల కుదింపు అంశాలు
ఎమ్మెల్యే బాలరాజు.. ఘనంగా ఆదివాసీ దినోత్సవం
బుట్టాయగూడెం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):‘ఆదివాసీల హక్కుల సాధనలో జరిగే ఆందోళలు, ఉద్యమాల్లో అవసరమైతే నేను కూడా ముందువరసలో ఉంటా. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే నోరు మాసుకుని కూర్చునే వ్యక్తిని కాదు’ అంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ జెండాను, ఆదివాసీ జెండాలను ఎమ్మెల్యే ఎగుర వేశారు. అనంతరం మాట్లాడుతూ జీవో నంబరు 3ను గత ప్రభుత్వం హయాంలో కొట్టివేశారని కనీసం రిట్ పిటిషన్ వేయలేదన్నారు. జీవో 3 రద్దుతో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం చూపాలని కోరానన్నారు. 1/70 చట్టాన్ని సవరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఏజెన్సీలోని పాఠశాలల్లో తరగతుల కుదింపు కారణంగా పిల్లలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి, పీవో రాములు నాయక్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో 10వ తరగతిలో నూరుశాతం ఉత్తర్ణత సాధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. వెలుగు పథకంలో డ్వాక్రా సంఘాలకు రూ.75.56 కోట్ల చెక్కును అందజేశారు. గిరిజన చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, పీవో రాములు నాయక్ సంప్రదాయ నృత్యాలు చేశారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి, ఎస్టీ కమీషన్ మెంబరు కాకి లక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ పొట్టా రామారావు, ఏపీడీ అనిత, డీడీ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.