అయ్యో..ఎంత ఘోరం..!
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:38 AM
బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నాం.. కొంచెం ఇల్లు చూస్తూ ఉండండి... అంటూ పక్కింటి వారికి చెప్పి వెళ్లిన ఆ కుటుంబం రైలు ప్రమాదంలో మృతి చెందింది.. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతులది తాడేపల్లిగూడెం..
రైల్వే పోలీసులు కేసు నమోదు .. దర్యాప్తు
ఆర్థిక,అనారోగ్య సమస్యలే కారణమా..?
నిడమర్రు/తాడేపల్లిగూడెం రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నాం.. కొంచెం ఇల్లు చూస్తూ ఉండండి... అంటూ పక్కింటి వారికి చెప్పి వెళ్లిన ఆ కుటుంబం రైలు ప్రమాదంలో మృతి చెందింది.. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మామిడి తోటలో షేక్ చాంద్ బాషా (50) కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. భార్య షేక్ హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీర (20) ఉన్నారు. చిన్నపాటి దుకాణంలో కళ్ళజోళ్లు బాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఊరు వెళ్తున్నట్టు చుట్టుపక్కల వారికి చెప్పి శనివారం సాయంత్రం బయలుదేరారు. తాడేపల్లిగూడెం బస్టాండ్‌లో 6.30 నిమిషాలకు మోటారుసైకిల్ పార్కు చేసి ఏలూరు వెళ్లే బస్సు ఎక్కి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ బస్టాప్ వద్ద దిగారు. అక్కడ టిఫిన్ పొట్లాలు కట్టించుకుని హైవే వైపు నుంచి రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ పాయింట్ ప్లాట్‌ఫారానికి వచ్చారు. రాత్రి 8:40 నిమిషాలకు ట్రాక్ దాటుతున్న వారిని చల్లపల్లి– షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మృతి చెందారు. ట్రాక్‌పై ఒక్కసారిగా దిగడంతో హారన్ వేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిందని రైలు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనతో రైలు అరగంట పాటు నిలిచిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో తాడేపల్లిగూడెం రైల్వేపోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అప్పారావు సిబ్బందితో కలసి ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వీరు బలవన్మర ణానికి పాల్పడ్డారా, లేదా ప్రమాదవశాత్తు మృతి చెందారా అనే విషయంపై విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతులు ఉంటున్న ఇంటిని భీమవరం రైల్వే లైన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై అప్పారావు సిబ్బంది పరిశీలించి స్థానికులను విచారించారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
ప్రమాదమా.. బలవన్మరణమా ?
చాంద్ బాషా స్వస్థలం గుడివాడ కాగా 25 ఏళ్ల కిందట తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడినట్టు స్థానికులు చెబుతున్నారు. అందరితో కలిసిమెలసి ఉండేవాడని ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడని చెబుతున్నారు. కళ్లజోళ్ల షాపు లాభసాటిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవాడని, అద్దె చెల్లించలేక షాపు ఖాళీ చేసినట్టు స్థానికులు చెప్పారు. కొద్దిరోజుల కిందట బాషాకు గుండెపోటు రావడంతో స్టంట్ వేశారు. పెద్ద కుమార్తె షర్మిల తాడేపల్లిగూడెంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఆమె అనారోగ్యంతో ఉండడంతో చిన్న కుమార్తె సమీరకు వివాహం చేశారు. అయితే నాలుగు నెలల క్రితం భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చి ఉంటోంది. కొన్నాళ్లుగా ఇంటిదగ్గరే ఉంటోంది. ఒకపక్క పెద్ద కుమార్తె అనారోగ్య సమస్య, చిన్న కుమార్తె భర్తతో గొడవలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి వారిని ఆత్మహత్య చేసుకునేలా పురి గొల్పాయా ? అన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. వాస్తవాలు వెల్లడి కావాల్సి వుంది.