Share News

మిర్చి..అదుర్స్‌!

ABN , Publish Date - May 03 , 2026 | 11:35 PM

మిర్చి సాగు ఈ ఏడాది రైతులకు లాభాల పంట పండించింది. ఆశించిన దిగుబడి, గిట్టుబాటు ధరల లభించడంతో ఆర్థికంగా కలిసొచ్చింది.

 మిర్చి..అదుర్స్‌!

ఆశించిన దిగుబడి.. గిట్టుబాటు ధర

ఈ ఏడాది రైతులకు లాభాల పంట

క్వింటా మిర్చి రూ.25 వేలు

పెరిగిన భూమి కౌలు ధరలు

పెరగనున్న సాగు విస్తీర్ణం

కుక్కునూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): మిర్చి సాగు ఈ ఏడాది రైతులకు లాభాల పంట పండించింది. ఆశించిన దిగుబడి, గిట్టుబాటు ధరల లభించడంతో ఆర్థికంగా కలిసొచ్చింది. ప్రస్తుతం క్వింటా మిర్చి ధర రూ.21 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. దీంతో రైతాంగం మిర్చి సాగు వైపు ఆసక్తి చూపుతు న్నారు. భూములు కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడుతుండడంతో కౌలు ధరలు పెరిగాయి. కాగా రాబోయే సీజన్‌లో మిర్చి విస్తీర్ణం పెరగనుంది.

గోదావరి తీర ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నల్లరేగడి భూము ల్లో మిర్చి, పత్తి నాణ్యమైన పంటలకు ప్రసిద్ధి. రైతాంగం పండించిన మిర్చిని ఆంధ్రాలోని గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌, ఛత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి వ్యాపార స్తులు వచ్చి మిర్చి కొనుగోలు చేసి ఎగుమ తులు చేస్తుంటారు. వాతావరణం, గిట్టుబాటు ధర అనుకూలించక గత మూడేళ్లుగా మిర్చి రైతాంగం ఆర్థికంగా నష్టపోయి ఢీలాపడ్డారు.

ఈ ఏడాది కలిసొచ్చిన కాలం

ఈ ఏడాది కుక్కునూరు, వేలేరుపాడు మండ ాల్లో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గతంతో పోలిస్తే విస్తీర్ణం తగ్గింది. దీనికి ప్రధాన కారణం గత మూడేళ్లుగా రైతులు నష్ట పోవడమే. 2023లో క్వింటా మిర్చి ధర క్వింటా రూ.20 వేలు పలికినప్పటికి పంటపై నల్లి ప్రభావంతో దిగుబడిరాక నష్టపోయారు. 2024లో క్వింటా మిర్చి ధర రూ.12 వేలు పలకగా, 2025లో క్వింటా మిర్చి రూ.6 వేలనుంచి రూ.7వేలు పలికింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మిర్చి సాగు వైపు ఆసక్తి తగ్గింది. అయితే ఈ ఏడాది వాతావరణం మిర్చిసాగుకు అనుకూలంగా మారింది. గోదావరి పరివాహాక ప్రాంతంలో గోదావరి ముంపు కారణంగా పంట వేయడం ఆలస్యమైంది. అయినప్పటికి ఎకరానికి 20 – 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. లావులు మిర్చిరకం క్వింటా రూ.22 వేలు – రూ.25 వేలు, సన్నాలు రకం రూ.21వేలు – రూ.22వేలు ధర పలుకుతోంది. దీంతో ఎకరం మిర్చిసాగు చేస్తే రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు లాభాలు వచ్చాయి. ఈ క్రమంలో కొంతమంది రైతులు పంటపై నల్లిప్రభావం చూపటంతో ఆశించిన దిగుబడిరాక నష్టపోయారు. ఎక్కువ శాతం మంది రైతులు ఈ ఏడాది మిర్చి పంటపై లాభాలు ఆర్జించారు. ఈ క్రమంలో మళ్లీ అందరి చూపు మిర్చిసాగుపై పడింది. వచ్చే సీజన్‌కు భూములు కౌలుకు తీసుకోవడానికి రైతులు పోటీ పడుతున్నారు. దామరచర్ల, గొమ్ము గూడెం ప్రాంతాల్లో ఎకరం కౌలు ధర రూ.40 వేలు – రూ.50 వేలు పలుకుతోంది. దీంతో రాబోయే సీజన్‌లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మిర్చి విస్తీర్ణం పెరగనుంది.

మూడేళ్ల తర్వాత లాభాలు

గుర్రం శ్రీనివాస్‌, రైతు, దామరచర్ల

మూడేళ్లుగా మిర్చిసాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. నల్లిప్రభావం పంట పై పడటంతో దిగుబడులు లేక, గిట్టుబాటు ధరలేక నష్టపోయారు. ఈ ఏడాది కాలం కలిసి రావడంతో ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధర ఉండడంతో రైతాంగం లాభాలు పొందారు.

Updated Date - May 03 , 2026 | 11:35 PM