కరువు కాలంలో కల్పతరువు పట్టిసీమ
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:28 AM
పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కల్పతరువులా మారి కృష్ణా డెల్టాకు ఊపిరిపోసిందని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఎత్తిపోతల నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం, జూలై 8(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కల్పతరువులా మారి కృష్ణా డెల్టాకు ఊపిరిపోసిందని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల వద్ద బుధవారం ఉదయం శాస్ర్తోక్తంగా పూజలు చేసి ఎత్తిపోతల పథకాల మోటార్లను స్విచాన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇటుకలకోట సమీపం లోని పట్టిసీమ డెలివరీ ఛానల్ వద్ద గోదావరికి జలహారతి నిర్వహించి మాట్లాడారు. ‘70 ఏళ్ల చరిత్రలో జూలై 5వ తేదీ నాటికి గోదావరికి జలకళ లేకపోవడం ఇదే తొలిసారి. మంగళవారం నాటికి 56 వేల క్యూసెక్కుల వరద జలాలు ప్రాజెక్టులోకి వచ్చాయి. వాటిలో ఎనిమిది వేల క్యూసెక్కులు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు పంపించాం. తొలుత తాగు నీటికి తర్వాత సాగనీటికి ప్రాధాన్యత ఇస్తాం’ అని తెలిపారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌గౌడ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, పట్టిసీమ ఎస్‌ఈ యేసుబాబు, మంగిన కొండ, కరిబండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.