Share News

మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు సహకారం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:34 AM

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారిని స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పి.నారాయణ అన్నారు.

మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు సహకారం
తృప్తి క్యాంటీన్‌లో అల్పాహారం రుచి చూస్తున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే చంటి, మేయర్‌ నూర్జహాన్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ నారాయణ

ఏలూరు టూటౌన్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారిని స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పి.నారాయణ అన్నారు. ఏలూరులో ఏర్పాటు చేసి తృప్తి క్యాంటీన్‌ను శనివారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అర్బన్‌ ప్రాంతాల్లో 28 లక్షల మంది మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 8 పట్టణాల్లో తృప్తి క్యాంటీన్‌లు స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రారంభించాం. మరో 8 ప్రాంతాల్లో ఏర్పా టు చేయనున్నా’మని తెలిపారు. తృప్తి క్యాంటీన్‌లో వంటకాలను రుచి చూసి బాగున్నాయంటూ ప్రశంసించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లా డుతూ ఏలూరు నగరంలో 11 లక్షలతో నలుగురు డ్వాక్రా మహిళలతో తృప్తి క్యాంటీన్‌ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరొకటి ఏర్పాటు చేస్తామన్నారు.

ఫ నగరంలో ఎంఐజీ లేఅవుట్‌ను అభివృద్ధి పరిచి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నారాయణ తెలిపారు. శనివారపు పేటలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌ను మంత్రి పరిశీలించి మౌలిక సదుపాయాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈడా మౌలిక సదుపాయాల కోసం రూ.57 కోట్లు

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (ఈడా) పరిధిలో ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.57 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఈడా అభివృద్ధి పనులపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘ఈడా పరిధిలో 15 నియోజకవర్గాల పరిధిలో 10 పురపాలక సంఘాలున్నా యి. వీటిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు పని చేయాలి. లేఅవుట్లకు నిబంధనలు అనుసరించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాల’న్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మౌలికసదుపాయాలు, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెట్రిసెల్వి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, జేసీ అభిషేక్‌గౌడ, కమిషనర్‌ భాను ప్రతాప్‌, మెప్మా పీడీ రాజాబాబు, కోఅప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు ఈడా చైర్మన్‌ శివప్రసాద్‌, ప్లానింగ్‌ అధికారి సురేఖ, ఇంజనీరింగ్‌ చీఫ్‌ ప్రభాకరరావు, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్డీ నాగనరసింహారావు, ఈడా చైర్మన్‌ పి.శివప్రసాద్‌, మునిసిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:34 AM