కరువు మండలాలపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:57 PM
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఇటీవల గుర్తించిన కరువు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన రైతులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
అవినీతి,అక్రమాలపై ఉక్కుపాదం
పీ–4లో మార్గదర్శకుల భాగస్వామ్యం పెంచాలి..
12 నుంచి రైతుబజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు
పనులు చేయని కాంట్రాక్టర్లు బ్లాక్‌లిస్టులో..
డీఆర్‌సీలో మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు,అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఇటీవల గుర్తించిన కరువు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన రైతులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టరేట్ గురువారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్‌సీ)లో మంత్రి కరువు మండలాల్లో ప్రత్యేక చర్యలు, విద్యుత్, రోడ్లు, గ్రామీణ నీటిసరఫరా, పీ–4 తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. డీఆర్‌సీ సమావేశంలో వర్షాభావ మండలాల్లో రైతులు లక్ష మందికి పీఎండీఎస్ కిట్ల (భూసారం పెంపు,ఇతర అవసరాలకు) పంపిణీపై వ్యవ సాయశాఖ జేడీ హబీబ్ బాషా నుంచి మంత్రి నాదెండ్ల ఆరా తీయగా 94,300 మందికి పంపి ణీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానం సాధించడంపై జేడీని మంత్రి అభినందించారు. ప్రకృతి సేద్యం కింద పండించిన పంటలను, ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడానికి ప్రత్యేక స్టాల్స్‌ను విస్తరిం చడంలో కలెక్టర్ తీసుకున్న చర్యలు భేష్ అని మంత్రి కొనియాడారు. ఏలూరు రైతు సంపద యాప్ తీరును ప్రజంటేషన్ ద్వారా జేడీ వివరిం చారు. కొబ్బరి రైతులకు ఇటీవల 800 హెక్టార్లకు రూ.42 వేలు విలువైన బయో ఫెర్టిలైజర్ కింద ఎరువులను అందించిన కార్య క్రమాన్ని రెండేళ్ల వరకు చేపడతామని ఉద్యాన శాఖ డీడీ షాజా నాయక్ వివరించగా, జిల్లా అంతటికి విస్తరించాలని మంత్రిని చింతమనేని కోరారు. కోకోసిటీ ఏర్పాటుకు మూడు ప్రాంతా లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం
జిల్లాలో ఆప్షన్–3 కింద ఇళ్ల కాలనీల నిర్మా ణంలో ఇళ్లు పూర్తి చేయకుండా మధ్యలో వది లేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు విషయంలో అలక్ష్యం చేయడంపై మంత్రి అధికారులను నిలదీశారు. తన మండలంలోనే అధికారులు నిధులు దుర్వినియోగం చేశారని వారి ఆస్తుల నుంచి ఆ సొమ్ము కక్కించాలని ఎమ్మెల్యే చింత మనేని డిమాండ్ చేశారు. ఏలూరులోను ఇంకా పురోగతి లేదని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రెండురోజుల్లో సమగ్ర చర్యలు తీసుకొని, రెవెన్యూ రికవరీ యాక్టు కింద వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మంత్రికి వివరించారు. బాధ్యులను సస్పెండ్ చేశామని, కేసులన్నీ పురోగతిలో ఉన్నాయని హౌసింగ్ పీడీ సత్యనారాయణ వివరించారు. ఏలూరు కార్పొరేషన్‌లో రూ.1.34 కోట్ల నిధు లను డ్రా చేయడంలో బాధ్యులపై తీసుకున్న చర్యలపై కమిషనర్ భానుప్రతాప్‌ను మంత్రి ప్రశ్నించారు. నలుగురిపై చర్యలు తీసుకున్నా మని, షరాబు నుంచి సొమ్ములు రికవరీ చేయాల్సి ఉందన్నారు. అవినీతి చేసే వారిని ఊపే క్షించవద్దని కార్పొరేషన్ ప్రత్యేకా ధికారి, జేసీ అభిషేక్ గౌడను మంత్రి ఆదేశించారు.
పీ–4పై అలక్ష్యం వద్దు ..
పీ–4 కింద పేద వర్గాలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విష యంలో మార్గదర్శకులు బంగారు కుటుంబాల దత్తత తక్కువగా ఉన్న ఏలూరు, నూజి వీడుల్లోని అధికారుల తీరుపై మంత్రి అసం తృప్తి వ్యక్తం చేశారు. వారంలో మార్గదర్శకు లను పెంచాలని సీపీవో శ్రీనివాస్‌ను మంత్రి ఆదేశించారు.
రోడ్లపై ప్రత్యేక సమావేశం
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పరంగా రోడ్లు అభివృద్ధి, గుంతలను పూడ్చటం ఇతర అంశా లపై ప్రత్యేకంగా డిసెంబరులో డీఆర్‌సీ సమా వేశంలో చర్చించడానికి చర్యలు చేపట్టాలని అఽధికారులను మంత్రి
ఆదేశించారు. తారు కొరత సమస్యపై ఎస్‌ఈ విజయరత్నం వివరించగా, ఈ కొరతను అధిగమించేందుకు ఆయా కంపెనీలతో స్వయంగా మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్దేశిత పనులను చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మంత్రి ఆదేశించారు.
రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు
జిల్లాలోని నాలుగు రైతు బజార్లలోను ఈ నెల 12 నుంచి సబ్సిడీపై కిలోకు రూ.35లకే ఉల్లిపాయల పంపిణీ చర్యలు తీసుకోవాలని మంత్రి పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. కిలో రూ.52కే నాణ్యమైన బియ్యం విక్రయాలు 1500 మెట్రిక్ టన్నులే అమ్మకం చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
22ఏ జాబితా నుంచి తొలగిస్తూ పత్రాలు
జిల్లాలో 22ఏ కింద 5,937 మందికి చెందిన 507 ఎకరాలకు ఇటీవల విముక్తి కల్పించారని, డీఆర్‌సీ సమావేశాల ద్వారా ఇప్పటి వరకు 640 మంది ప్రయోజనం కల్పించామన్నారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తూ పలువురు రైతులకు ఎండార్సుమెంట్ పత్రాలను మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు అందజేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం చేయడానికి పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, దీనిపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నామని, 15 రోజుల్లో బాధితుల నుంచి వివరాల సేకరణను బోర్డు పూర్తి చేయాల్సి ఉంటుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి సూచించారు. సమావేశంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ(చిన్న), డీఆర్వో ముక్కంటి, సెట్వెల్ సీఈవో ప్రభాకర్‌రావులు పాల్గొన్నారు.
కొల్లేరుకు మోక్షం కలుగుతుంది : పాకా సత్యనారాయణ,రాజ్యసభ సభ్యుడు
కొల్లేరు అభయారణ్యం చిత్తడి నేలల చట్టం కింద నమోదు కావడం వల్ల రైతులకు, అక్కడ జిరాయితీ దారులకు న్యాయం జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం జిరాయితీ, పట్టాదారులకు 20వేల ఎకరాల మినహాయింపు పొందే అవకాశం ఉంది. కొల్లేరు ప్రక్షాళనకు రెగ్యులేటర్ నిర్మాణం అవసరం.
ఆక్వా రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: బడేటి చంటి, ఏలూరు ఎమ్మెల్యే
ఆక్వా రైతులకు యూరియా, డీఏపీ అందడం లేదు. వరి రైతులకు మాదిరిగానే యాప్ ద్వారా పంపిణీ చేయాలి.వంగాయగూడెం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఆగిన రోడ్డును పూర్తి చేయాలి. ఆశ్రం ఆసుపత్రి నుంచి పోణంగి పుంత మీదుగా కైకలూరు వెళ్లేందుకు మాదేపల్లిని కలిపేలా రోడ్డు ప్రతిపాదనలకు మోక్షం కల్పించండి.
కొబ్బరి రైతులకు మొక్కలు అందించాలి : చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే
జిల్లాలో కొబ్బరి రైతులకు నాణ్యమైన కొబ్బరి మొక్కలు అందించేలా విత్తన తయారీ కేంద్రం అంబాజీపేట మాదిరిగానే మా నియోజకవర్గంలో ఉత్పత్తి చేసేలా 80 ఎకరాల స్థలంలో చర్యలు చేపట్టాలి. కోతుల కారణంగా పంటలను రైతులు నష్టపోతున్నారు. వాటిని పట్టించి అడవుల్లో వదిలేలా ఉద్యానశాఖ నుంచి బడ్జెట్ కేటాయింపులు చేయాలి.
జల్‌జీవన్ మిషన్ పనులకు స్థలాలు కొరత : పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే
మా నియోజకవర్గంలో మంచినీటి పథకాల నిర్మాణాలకు జల్‌జీవన్ పథకం రూ.55 కోట్లు మంజూర య్యాయి. ఇందులో రూ.22 కోట్ల వ్యయంతో కొల్లేరు ప్రాంతంలో వసతుల కల్పనకు అటవీశాఖ నుంచి అడ్డంకులున్నాయి. స్థలాలను కేటాయించాలి. అడవికొలనులో రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలి.
రోడ్డుకు మోక్షం కల్పించండి : సొంగా రోషన్‌కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే
ఏలూరు–జంగారెడ్డిగూడెం, ఏలూరు–చింతలపూడి రోడ్లపై తాత్కాలిక మరమ్మతులతో కాలం గడుపుతున్నారు. పూర్తిస్థాయిలో చింతలపూడి రోడ్డుకు మోక్షం కల్పించాలి.
పల్లెపండుగ నిధులతో రోడ్లు : కామినేని శ్రీనివాస్, కైకలూరు ఎమ్మెల్యే
ఇటీవల పల్లె పండుగ 3.0 కింద నిధులు మంజూరుతో గ్రామాల్లో రోడ్లు పనులతో ప్రజల్లో తిరగగలుగు తున్నాం. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణ బోర్డులు కీలక నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటాయి. ప్రజలు, రైతులు అధైర్యపడొద్దు.
వైద్యుల కొరతను తీర్చండి : వంకా రవీంద్ర, ఎమ్మెల్సీ
ఉమ్మడి జిల్లాలో పేరొందిన ఏలూరు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గైనకాలజిస్టు స్పెషలిస్టు పోస్టుల ఖాళీగా ఉండటం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. పశువుల అక్రమ రవాణా నిరోధించాలి.జిల్లాల్లో క్వారీల్లో అక్రమ మైనింగ్‌ను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి చేయాలి.
గౌరవం ఇవ్వడం లేదు : జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్సీ
ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీగా నాకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. కొల్లేరుపై నిర్వహించే సమీక్షలకు నాకు సమాచారం ఉండడం లేదు. కొల్లేరు ప్రజలకు సత్వరం న్యాయం చేయాలి.