Share News

నిర్దేశిత గడువులోగా పోలవరం పూర్తి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:44 AM

సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 2027 లోపలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంకణబద్ధులై పని చేస్తు న్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

నిర్దేశిత గడువులోగా పోలవరం పూర్తి
పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

సుందరీకరణకు డిజైన్లు సిద్ధం చేయండి

డెల్టా ఆధునికీకరణపై అలక్ష్యమా..

మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

ప్రాజెక్టు పనుల పరిశీలన.. సమీక్ష

ఏలూరు,జూలై 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 2027 లోపలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంకణబద్ధులై పని చేస్తు న్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం ఈనెల 13న పోలవరం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి మంగళవారం ప్రాజెక్టు పనులు పరిశీలించి అనంతరం జలవనరులశాఖ అధికారులు,కాంట్రాక్టు ఏజన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈసీఆర్‌ఎఫ్‌, జల విద్యుత్‌ కేంద్రం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజనీరింగ్‌ ప్రతి నిధులను అడిగి తెలుసుకున్నారు. 2014–19లోనే టీడీపీ హయాంలో 72 శాతం పూర్తి చేశామని, వైసీపీ ప్రభుత్వం కేవలం చేతగాక కేవలం 2 శాతం పనులే ఐదేళ్లలో చేసిందని మంత్రి తెలిపారు. రెండేళ్ల కూటమి పాలనలో 15 శాతం పోలవరం పూర్తి చేసిన ఘనత మాదేనని, వైసీపీ విధ్వంసం కారణంగా పాడైన డయాఫ్రమ్‌వాల్‌ స్థానంలో కొత్తదానిని రూ.990 కోట్ల వ్యయంతో 440 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ ప్రధాన పనుల్లో 8.75 క్యూబిక్‌ మీటర్ల పనిచేయాల్సి ఉండగా ఇప్పటికే 5.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేశామని, వర్షాకాలంలోను ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు సాగేలా నిర్మాణ సామగ్రిని సిద్ధం చేశామన్నారు. ప్రాజెక్టు గోదావరి పుష్కరాలోపే పూర్తి కానున్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాం తంలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన డిజైన్లు సిద్ధం చేస్తే సీఎం పర్యటన రోజు ఆమోదింప చేయడానికి చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టా ఆఽధునికీకరణ పనులు నిర్వహణకు ఇప్పటికే రైడార్‌ సర్వే నిర్వహించినా ఇంకా డీపీఆర్‌ సిద్ధం కాకపోవడంపై జలవనరులశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక రైతునేనని గోదావరి డెల్టా కింద ఒక పంటే పండిస్తు న్నానని, రైతుల సమస్యలు తనకు తెలుసునని డెల్టా ఆధునికీరణ పనులుకు డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌, ప్రాజెక్టుల పనుల పురోగతి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపైన మంత్రి సమీక్షించారు. జలవనరులశాఖ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, గోదా వరి డెల్టా సీఈ చిన్నబాబు, పోలవరం ఎస్‌ఈ రామ చంద్రరావు, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ తిరుమల రావు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ జీఎం గంగాధర్‌, ప్రతినిధు లు సతీష్‌బాబు, మురళీ పాల్గొన్నారు.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన మంత్రి నిమ్మలకు తొలుత ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఎన్‌.నరసింహమూర్తి, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీని వాసులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

Updated Date - Jul 08 , 2026 | 12:44 AM