తెల్లనివన్నీ పాలు కాదు.. !
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:37 PM
కల్తీ .. ఎటు చూసినా కల్తీ లోకమే. ప్రస్తుతం రాజమహేంద్రవరం కల్తీ పాల కల కలంతో జిల్లాలోనూ అలజడి రేగింది. కల్తీ పాల వల్ల ఏకంగా ముగ్గురు ప్రాణాలు బలికావడం 11 మంది పరిస్థితి విషమంగా మారడంతో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది.
కల్తీ పాలతో జరభద్రం..
విషతుల్యమవుతున్న పాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటం
రాజమహేంద్రవరం ఘటనతో పశ్చిమలో అలజడి
ఇప్పుడు అంతటా ఇదే చర్చ
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కల్తీ .. ఎటు చూసినా కల్తీ లోకమే. ప్రస్తుతం రాజమహేంద్రవరం కల్తీ పాల కల కలంతో జిల్లాలోనూ అలజడి రేగింది. కల్తీ పాల వల్ల ఏకంగా ముగ్గురు ప్రాణాలు బలికావడం 11 మంది పరిస్థితి విషమంగా మారడంతో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. పశ్చిమలో కూడా గతంలో పాల కత్తీపై ఎన్నో సంఘటనలు బయట పడ్డాయి. ముఖ్యంగా పాల సేకరణ కేంద్రం దగ్గరుకు వచ్చే పాల నుంచి ఇంటింటికీ పాలు విక్రయించే వ్యాపారులు వరకూ ఎన్నో రకాలుగా కల్తీకి పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. కల్తీని గుర్తించలేక చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. పరిస్థితి విషమంగా మారేంత వరకూ తెలియకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. జిల్లాలో పాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. జిల్లాలో సుమారు 46 లక్షల మంది జనాభా ఉండగా ముగ్గురు వ్యక్తులకు ఒక లీటరు పాలు అవసరం అవుతుండగా 15 లక్షల 50 వేల లీటర్ల వరకూ పాలు అవసరం అవుతుంది. ఒక్క తాడేపల్లిగూడెం పట్టణంలోనే రోజుకు 75 వేల లీటర్లు అవసరం అవుతుండగా ఉత్పత్తి మాత్రం దానికి తగినట్టుగా లేదు. దీంతో అవసరాలు తీర్చేందుకు వేర్వేరు మార్గాల్లో కల్తీ జరుగుతోంది. ఈ కల్తీని గుర్తించడానికి సరైన నిఘా లేకపోవడంతో మరింత పెరిగిపోతోంది.
చిక్కదనం కోసం యూరియా, అమ్మోనియా
గేదె పాలలో యూరియా కలపడం వల్ల పాలలో వెన్న శాతం ఎక్కువగా కనిపిస్తుం దని కొందరు పాడి రైతులు ఇలా చేస్తున్నట్టు తెలిసింది. పాలను కల్తీ చేస్తూ కేంద్రాల వద్ద పాలు పోసిన సందర్భాల్లో కొందరిని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే పాలకు మరింత డిమాండ్ పెరగడం, పశువుల నుంచి పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో కల్తీ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పాల నాణ్యత చిక్కదనాన్ని పెంచడానికి క్లోరిన్, అమ్మోనియా, సల్ఫేట్ కలుపు తున్నారు. ఈ రసాయనాలు కలిపిన పాలు తాగితే ఆరోగ్యానికి హానికరమని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్త వీరేశ్ కుమార్, సుస్మితాదాస్ ఇటీవల పరిశోధనా పత్రంలో స్పష్టం చేశారు.
కల్తీని గుర్తించడం ఇలా..
స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిదంటే అందుల్లో నీరు కలిసిందని అర్థం చేసుకోవచ్చు. సగటున లీటరు పాలకు 2 నుంచి 20 శాతం వరకు నీరు కలుపుతారు. లాక్టో మీటరు పరికరంలో పాలు పోయగానే అందులో కొవ్వు కాకుండా ఇతర ఘన పదార్థాలు ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది. పాలను వేడిచేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్పటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చే శారని కనిపెట్టవచ్చు. డిటర్జెంట్ పొడిని కలిపారేమో తెలుసుకోవడానికి ఒక గ్లాసులో 10 మీల్లీ లీటర్ల పాలు అంతే మొత్తంలో నీరు పోసి గిరాగిరా తిప్పి బాగా కల పాలి. డిటర్జెంట్ పొడి కలిపి ఉంటే పైన బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలయితే కొద్దిగా నురగ వస్తుంది. పాలలో యూరియాను గుర్తించడానికి సులభమైన పద్ధతులు ఉన్నాయి. ఔషధ దుకాణాల్లో యూరియా స్ర్పే స్ర్టిప్స్ అమ్ముతుంటారు. వాటిపై కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపిస్తే యూరియాతో తయారు చేసిన కృత్రిమ పాలని అర్థం చేసుకోవచ్చు.