Share News

వీడని ‘విలీన’ చిక్కుముడి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:26 AM

మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు విలీన గ్రామాల సమస్య వెంటాడుతోంది. ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. జిల్లాలోని నరసాపురం, ఆకివీడు మినహా మిగిలిన మునిసిపాలిటీల్లో విలీన గ్రామాలపై కోర్టులో కేసులు ఉన్నాయి.

వీడని ‘విలీన’ చిక్కుముడి

ఫలించని ఎమ్మెల్యేల రాయబారం

కేసులను ఉపసంహరించుకునేందుకు

అంగీకరించని విలీన గ్రామాల పెద్దలు

అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే

గ్రామాలు మినహాయించినా వార్డులు పెంచాల్సిందే

అప్పుడే ఎన్నికలు సాధ్యం

మరోవైపు మునిసిపాలిటీలకు

నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు విలీన గ్రామాల సమస్య వెంటాడుతోంది. ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. జిల్లాలోని నరసాపురం, ఆకివీడు మినహా మిగిలిన మునిసిపాలిటీల్లో విలీన గ్రామాలపై కోర్టులో కేసులు ఉన్నాయి. విలీనం వద్దంటూ ఆయా గ్రామాల పెద్దలు కోర్టులకెళ్లారు.. దీంతో ఆయా మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. మునిసిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘ నిధులు రావడం లేదు. అటు విలీన గ్రామాలకు కూడా నిధులు రాక సతమతమవుతున్నాయి. కేసులు ఉపసంహరించు కోవాలంటూ విలీన గ్రామాల్లో నాయకులను కోరినా వారు అంగీకరించడం లేదు. ప్రభుత్వం ఈసారి అన్ని మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనే కృత నిశ్చయంతో ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకోవాలి..

మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలపై హైకోర్టులో ఉన్న కేసులను తొలగించాలంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విలీన గ్రామాల్లో నాయకులు అందుకు అంగీకరించడం లేదు. మున్సిపాలిటీల నుంచి మినహాయింపుపై హామీ వస్తేనే కేసులను ఉపసంహరించుకుంటామంటూ విలీన గ్రామాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చి నట్టయితే కేసులు ఉపసంహరించుకుంటామని గతంలో ప్రకటనలు చేసిన విలీన గ్రామ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. కార్పొరేషన్‌ ప్రకటన వచ్చిన తర్వాతే ఆలోచిస్తామంటూ నాలుక మడ తేశారు. ముఖ్యంగా రాయలం, కొవ్వాడ అన్నవరం, చిన అమిరం గ్రామాల నుంచి విలీనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాయలం, చిన అమిరం గ్రామాలు పూర్తిగా భీమవరంతో కలిసే ఉన్నాయి. వాటిని అధికారికంగా విలీనం చేద్దామంటే గ్రామ పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సంబంధిత గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి ఎటువంటి సానుకూలత వ్యక్తం కాలేదు. మరోవైపు విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ భీమవరంలో తీర్మానం చేసింది. పాలకొల్లుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నిమ్మల రామా నాయుడు సైతం విలీన గ్రామాలు లేకుండానే ఎన్నికలకు వెళదామంటూ ప్రతిపాదిస్తున్నట్టు తెలు స్తోంది. తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీల్లోనూ విలీనంపై వ్యతిరేకత ఉంది. హైకోర్టులో ఉన్న కేసులను ఉపసంహ రించుకోవడానికి సుముఖంగా లేరు. ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది.

అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే

విలీన గ్రామాలపై ఉన్న కేసులు హైకోర్టులో ఉపసంహరించుకోరన్న విషయం తేలిపోయింది దీనిపై అంతిమ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. వైసీపీ హయాంలో విలీన గ్రామాలపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు.దానిని ఉపసంహరించుకుంటే పాత మున్సిపాలిటీ హద్దులతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే హైకోర్టులో కేసుపై ముందుకు వెళ్లి తేల్చుకోవాలంటూ రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇదే జరిగితే ఈసారి కూడా ఎన్నికలు జాప్యం కానున్నాయి. ప్రభుత్వం మాత్రం అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థలకు గతంలో ఎన్నికలు జరగలేదు. ఈసారి నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోనున్నాయి. అదే జరిగితే అభివృద్ధి కుంటుపడి పోనుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అమృత్‌ నిధులతో పనులు నిర్వహిస్తున్నారు. దానికోసం మున్సిపాలిటీలు 20 శాతం మేర నిధులుసమకూర్చుకోవాలి. కేంద్రం మంజూరు చేసే ఆర్థిక సంఘం నిధులు కూడా అందుకుఉపయోగపడనున్నాయి. ఎన్నికలు నిర్వహించకపోతే అటువంటి నిధులు ఆగిపోనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాలక వర్గాలు లేకపోతే పాలన కుంటుపడనుంది.

వార్డులు పెంపు తప్పనిసరి

విలీన గ్రామాలను మినహాయించి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడినా వార్డుల పెంపు తప్పనిసరి కానుంది. ఇటీవల ప్రభుత్వం పట్టణాల్లో వార్డులను పెంచేందుకు ఉత్తర్వులు జారీచేసింది విలీన సమస్య లేని మున్సిపాలిటీల్లో వార్డులను పెంచేశారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లోనూ వార్డులను పెంచాల్సి ఉంటుంది. ముందుగా విలీన సమస్యను పరిష్కరించాలి. తదనుగుణంగా వార్డులను పెంచాల్సి ఉంటుంది. జిల్లాలో నర్సాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలో పెంపు ప్రక్రియ పూర్తయింది. పాత హద్దుల ప్రకారం మున్సిపాలిటీల్లో పెరిగే వార్డుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. వార్డులను పెంచకుండా ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదు.

Updated Date - Aug 05 , 2026 | 12:27 AM