మావుళ్లమ్మ స్వర్ణ ప్రాజెక్టు కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - May 20 , 2026 | 12:40 AM
మావుళ్లమ్మను స్వర్ణమయంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టుకు కమిటీని నియమిస్తూ జీవోను విడుదల చేసిం ది.
27 కేజీల బంగారం సేకరణకు ప్రయత్నాలు
12 మందితో కమిటీ.. మూడేళ్లపాటు కొనసాగింపు
భీమవరంటౌన్, మే 19(ఆంధ్రజ్యోతి): మావుళ్లమ్మను స్వర్ణమయంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టుకు కమిటీని నియమిస్తూ జీవోను విడుదల చేసిం ది. పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలల ప్రాజెక్టు గా మావుళ్లమ్మను వంద కేజీల బంగారంతో స్వర్ణమయం చేయాలని ఆయన గతంలోనే శ్రీకారం చుట్టారు. కొంతకాలం తర్వాత ఆగిపోయింది. తిరిగి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అమ్మవారి స్వర్ణమయం కలను సాకారం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు. మూడేళ్లపాటు ఉండే విధంగా సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టు కమిటీని నియమించింది. ఈ కమిటీలో 12 మందిని నియమించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆభరణాల తనిఖీ అధికారి, మావుళ్లమ్మ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్దామహాలక్ష్మి నగేష్, రమేష్‌కుమార్ అగర్వాల్, ఎం.వీరవెంకటసత్యనారాయణ, జి.వెంకటరమణ, పొత్తూరి బాపిరాజు, బి.రామ్మోహన్‌రావు, కె.వెంకటరమణారావు, ప్రస్తుత పాలకవర్గ ఛైర్మన్ బి.నాగభూషణం, ఎస్.వీరవెంకటశివసత్యనారాయణతో కమి టీని ఏర్పాటు చేశారు.
27 కేజీల బంగారమే లక్ష్యం
వంద కేజీల బంగారం సేకరణలో భాగంగా ఇప్పటికే అమ్మవారి ఒంటిపై దాదాపు 51 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మరో 23 కేజీల బంగారం దేవస్థానం వద్ద భక్తులు కానుకల రూపంలో అందించారు. మరో 27 కేజీల బంగారం వస్తే కానీ స్వర్ణమయం కాదు. ఇప్పుడు ఈ కమిటీ 27 కేజీల బంగారం సేకరణకు శ్రీకారం చుట్టనుంది. దీనికోసం కౌంటర్‌ను ఏర్పాటు చేసి వసూళ్లు చేసుకునే వెసులుబాటును కల్పించారు.