పరీక్షలు మీవి.. సమాధానాలు మావి!
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:57 PM
విద్యార్థుల ను పాస్ చేయించడమే లక్ష్యంగా నూజివీడులో పదో తరగతి పరీక్ష కేంద్రాలు మాస్ కాపీయింగ్‌కు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.
పదో తరగతి పరీక్షల ‘ప్రైవేటు’ ఇన్విజిలేటర్ల తీరు
విద్యార్థులపై మాస్ కాపీయింగ్ ఆరోపణలు.. ప్రతిభగల విద్యార్థులు నష్టపోతారంటూ తల్లిదండ్రుల ఆవేదన
నూజివీడు టౌన్, మార్చి 25(ఆంధ్రజ్యోతి):విద్యార్థుల ను పాస్ చేయించడమే లక్ష్యంగా నూజివీడులో పదో తరగతి పరీక్ష కేంద్రాలు మాస్ కాపీయింగ్‌కు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. సంబంధిత పరీక్ష కేంద్రాల్లో కొందరు ఇన్విజిలేటర్లే ప్రశ్న పత్రాల్లోని సమాధానాలను డిక్టేక్ట్ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈసారి పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులనూ తీసుకున్నారు. దీంతో సంబంధిత ప్రైవేటు విద్యా సంస్థలు, ఇతర పాఠశాల విద్యార్థులను పాస్ చేయించడమే లక్ష్యంగా ఇన్విజిలేటర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గణిత పరీక్షలో ఒక మార్కు సంబంధించిన ప్రశ్నలను ఇన్విజిలేటర్లే సమాధానాలు చెప్పారని, స్క్వాడ్ వచ్చి వెళ్లిన తర్వాత విద్యార్థులను మాస్ కాపీయింగ్ ప్రోత్సహించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బుధవారం నాటి పరీక్షకు సైతం ఇదే విధంగా డిక్టేట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. దీనివల్ల ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతారని, పరీక్ష విధానంపైనే నమ్మకం కోల్పోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ నూజి వీడు డీవైఈవో సుధాకర్‌ను వివరణ కోరగా పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ లేకుండా చర్య లు చేపడతామన్నారు.