పెరిగిన ఉల్లి
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:17 AM
మార్కెట్లో ఉల్లి, బియ్యం, ఆయిల్ ధరలు మండుతున్నాయి. ఎన్నడూలేని విధంగా వీటి ధరలు ఈ సంవత్సరంలోనే గరిష్టస్థాయికి చేరాయి.
అదేబాటలో బియ్యం, ఆయిల్ ధరలు నిలకడగా కూరగాయలు
తాడేపల్లిగూడెం, ఆగస్టు 16(ఆంధ్ర జ్యోతి) : మార్కెట్లో ఉల్లి, బియ్యం, ఆయిల్ ధరలు మండుతున్నాయి. ఎన్నడూలేని విధంగా వీటి ధరలు ఈ సంవత్సరంలోనే గరిష్టస్థాయికి చేరాయి. మూడు నెలల వరకు నెమ్మదిగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు నాణ్యమైన ఉల్లి కిలో రూ.45కు చేరింది. మహారాష్ట్రంలో పాత ఉల్లి నిల్వలు అయిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌గా క్వింటా ఉల్లి నాణ్యత ఆధారంగా రూ.3000 నుంచి రూ.3800కు విక్రయిస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు కిలో రూ.45కు అమ్ముతున్నారు. ఆదివారం మార్కెట్‌లోపల విక్రయించే వారు రూ.100కు రెండున్న కిలోలు విక్రయిస్తున్నారు. ఇప్పుడు కర్నూలు ఉల్లి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మూడు లారీల్లో వచ్చింది. వీటిలో నాసిరకం ఉల్లి క్వింటా రూ.1700 నుంచి 1800 మధ్య విక్రయించారు. ఈ సంవత్సరం వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో కర్నూలు ఉల్లి మార్కెట్‌కు రావడం ఆలస్యమైంది. ఇప్పుడు కర్నూలులో ఉల్లి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడంతో రైతులు నేరుగా అక్కడ నుంచే కొనుగోలు చేసి బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు వ్యాపారులు తీసుకుపోతున్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈమేరకు కర్నూలు ఉల్లి ఇక్కడ మార్కెట్‌కు రావడం బాగా తగ్గిందని, దీంతో మహారాష్ట్ర రకం ఉల్లినే ఎక్కుగా వినయోగించడంతో ఈ రకం ఉల్లినే తీసుకొస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
భగ్గుమంటున్న బియ్యం ధరలు
బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. హెచ్‌ఎంటీ రకం 26కిలోల బస్తా రూ.1720కు విక్రయిస్తున్నారు. గతంతో రెండునెలల కిందట ఇదేరకం బస్తా రూ.1480 నుంచి 1500 మధ్యంలో విక్రయించే వారు. బీపీటీ రకం సోనా మసూరి 26 కిలోల బస్తా రూ.1620, ఇతర రకాల హెచ్‌ఎంటీ బియ్యం 26 కిలోల రూ.1670, బీపీటీ రూ.1580, మరోరకం సోనామసూరి రూ.1500, కార్పొరేట్ బ్రాండ్ స్వర్ణరకం బియ్యం రూ.1200, రూ.1180కు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే వీటి ధరలు 26 కిలోల బ్యాగ్‌కే రూ.200 నుంచి 400 వరకు పెరిగింది. ప్రభుత్వం బియ్యం ధరలను కౌంటర్లు పెట్టి విక్రయించిన్పటికీ ధరలు అదుపులోకి రావడం లేదు. వీటికి కారణం వినియోగదారులు అలవాటు పడిన బ్రాండ్లు అక్కడ అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
వంటనూనె సలసల..
వంట నూనె ధరలు విపరీంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటిలో బ్రాండెడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ లీటరు (910గ్రాములు) రూ.125 ఉంటే ఇప్పుడు రూ.180కు చేరింది. వేరుశెనగ నూనె మంచి బ్రాండ్ లీటరు రూ.130 ఉంటే ఇప్పుడు రూ.185కు విక్రయిస్తున్నారు. మార్కెట్లో మరికొన్ని బ్రాండ్లు లీటరు రూ.110, రూ.95 ఉండే రకాలు ఇప్పుడు రూ.160, రూ.145కు విక్రయిస్తున్నారు. ఈవిధంగా ఏడు నెలల కాలంలోనే లీటరుకు సామాన్యుడిపై రూ.45 నుంచి రూ.50 అదనపు భారంపడింది.
పంచదార ధర పైపైకి..
పంచదార బస్తా (50కిలోలు) రూ.2700కు ఇప్పుడు హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. వీటిని రిటైల్‌గా కిలో రూ.56 నుంచి 58 వరకు అమ్ము తున్నారు. రెండునెలల కిందట బస్తా రూ. 2,150 ఉంటే ఇప్పుడు అదే బస్తా రూ.2700 చేరడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చెరకు ఉత్పత్తి ఆశించిన మేరకు లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
నిలకడగా కూరగాయలు
మార్కెట్లో గతవారంతో పోల్చుకుంటే ధరల్లో వ్యత్యాసం లేదు. టమాటా కిలో రూ.20నుంచి రూ.30, ఆగాకర రూ.240, అల్లం పాతది కిలో రూ.180. కొత్త అల్లం రూ.90 నుంచి 100, వంకాయలు రూ.60 బీన్స్‌కాయలు రూ.160, బీర రూ.50, బెండకాయలు రూ.40, దొండకాయలు రూ.40, క్యాబేజీ రూ.40, కాళీప్లవర్ సైజు ఆధారంగా రూ.50 నుంచి 60 మధ్య ఉంది. దోసకాయలు రూ.30, కాకరకాయలు రూ.60, పచ్చిమిర్చి రూ.60, క్యారెట్ రూ.50, బీట్‌రూట్ రూ.60, ఆనబకాయ రూ.15, మునగ జత రూ.20, చిక్కుడు 120, క్యాప్సికం రూ.80లకు, అరటి జత రూ.20కు విక్రయించారు. ఇక చికెన్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.240, విత్‌స్కిన్ రూ.220, బర్డ్ రూ.140కు విక్రయించారు.