తగ్గిన ఉల్లి.. పెరిగిన చికెన్
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:41 AM
మార్కెట్లో ఉల్లి ధర తగ్గింది. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.10 తగ్గింది. మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రావడంతో ధర కొద్దిగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన ఉల్లి.. పెరిగిన చికెన్
కర్నూలు ఉల్లి రావడంతో దిగివచ్చిన ధర
నిలకడగా కూరగాయలు..
తాడేపల్లిగూడెం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో ఉల్లి ధర తగ్గింది. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.10 తగ్గింది. మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రావడంతో ధర కొద్దిగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌గా కర్నూలు ఉల్లి క్వింటాలు రూ.3200 నుంచి రూ.3800 మధ్య విక్రయించారు. మహారాష్ట్ర ఉల్లి క్వింటాలు రూ.4000 నుంచి రూ.4800 మధ్య విక్ర యించారు. ఇక రిటైల్ వ్యాపారులు కిలో మహారాష్ట్ర రకం ఉల్లిని రూ.100కు రెండు కిలోలు, కర్నూలు ఉల్లి రూ.100కు 3 కిలోలు అమ్మారు. మహారాష్ట్ర ఉల్లి గత వారం కిలో రూ.60 అమ్మారు. కర్నూలు ఉల్లిని రూ.50కు విక్రయించారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు కర్నూలు నుంచి వచ్చే లారీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కర్నూలు నుంచి ఆదివారం మార్కెట్‌కు 5 లారీల్లో ఉల్లి వచ్చింది. గత ఏడాది ఉల్లి వేసిన కర్నూలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది అక్కడ రైతులు ఉల్లి సాగును తగ్గించారు. దీనికి బదులుగా వేరుశనగను సాగు చేశారని అక్కడి నుంచి వచ్చిన రైతులు చెబుతున్నారు. ఉల్లి సాగు చేసిన కర్నూలు రైతులు ఈ ఏడాది లాభాలు ఆర్జిస్తున్నారు. మేలు జాతి ఉల్లిని తీసుకొచ్చిన రైతులకు కాసుల వర్షం కురుస్తోంది.
పెరుగుతున్న చికెన్..
చికెన్ ధరలు తిరిగి పెరగడం ప్రారంభమయ్యాయి. గతవారం స్కిన్ లెస్ చికెన్ రూ.220కు లభించేది. ఇప్పుడు రూ.240కు చేరింది. బర్డ్ కిలో రూ.140కు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.20 పెరిగిం ది. రైతుల వద్ద కోళ్లు ఉన్నాయి. ఇటు కార్పొరేట్ సంస్థల వద్ద కోళ్లు ఉన్నా ధరలు పెరగడం పట్ల వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో హెచ్చుతగ్గులు రావడం సర్వసాధారణమని, వచ్చే వారంలో ఈ ధరలు మరింత పెరగవచ్చు లేదా తగ్గవచ్చని చిరు వ్యాపారులు చెబుతున్నారు.
నిలకడగా కూరగాయలు..
మార్కెట్లో కూరగాయల ధర లు స్థిరంగానే ఉన్నాయి. గత వారంతో పోల్చితే వ్యత్యాసం లేదు. కొత్త అల్లం కిలో రూ.90 నుంచి 100, నల్ల వంకాయలు కిలో రూ.60, తెల్లవంగ రూ.50, బీర రూ.50, బెండ రూ.30, దొండ రూ.40, దోస రూ.30, బంగాళదుంప రూ.30, టమాటా రూ.30, క్యాబేజీ రూ.40, బీట్‌రూట్ రూ.50, క్యాప్సికం రూ.80, బీన్స్ రూ.120, ఆగాకర రూ.240, పొట్ల రూ.30. ఆనప రూ.10. మునగకాడలు జత రూ.15, అరటి జత రూ.15, పచ్చిమిర్చి కిలో రూ.50 నుంచి 60 మధ్యలో విక్రయించారు.