మళ్లీ కొండెక్కిన కోడి!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:32 AM
కోడి మళ్లీ కొండెక్కి కూర్చుంది. చికెన్ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత వారం కిలో స్కిన్‌లెస్ రూ.240 ఉంటే ఈ వారం ఏకంగా రూ.280కు ఎగబాకింది. కోళ్ల సప్లై తగ్గడంతో ఇదే అదనుగా కార్పొరేట్ సంస్థలు కోడి మాంసం ధరను పెంచేశాయి.
చేపల ధరలు తగ్గినా తగ్గించని రిటైలర్లు
ఎగుమతులు లేక తగ్గిన రొయ్య ధరలు
పచ్చడి మామిడి మార్కెట్ వెలవెల..
నిలకడగా కూరల ధరలు.. అదే బాటలో ఉల్లి
తాడేపల్లిగూడెం, మే 31(ఆంధ్రజ్యోతి): కోడి మళ్లీ కొండెక్కి కూర్చుంది. చికెన్ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత వారం కిలో స్కిన్‌లెస్ రూ.240 ఉంటే ఈ వారం ఏకంగా రూ.280కు ఎగబాకింది. కోళ్ల సప్లై తగ్గడంతో ఇదే అదనుగా కార్పొరేట్ సంస్థలు కోడి మాంసం ధరను పెంచేశాయి. విత్‌స్కిన్ కిలో రూ.260కు, కోడి లైవ్ కిలో రూ.150కు విక్రయిస్తున్నారు. మటన్ నాణ్యమైనది కిలో రూ.1000 నుంచి 1200 వరకు విక్రయిస్తున్నారు. ముదిరిన మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్యంలో విక్రయిస్తున్నారు. రైతుల వద్ద చేపల ధరలు తగ్గాయి. అయితే మార్కెట్లో రిటైల్ వ్యాపారులు గతంలో ఉన్న ఎక్కువ ధరకే విక్రయిస్తుంటారు. జనం చేపలవైపు మక్కువ చూపుతున్నారు. దీంతో రిటైల్ వ్యాపారులు మాత్రం కిలో చిన్నచేపైనా పెద్ద చేపైనా రూ.200పైగానే విక్రయాలు చేస్తున్నారు.
రొయ్యల ధరలు తగ్గుముఖం..
ప్రస్తుతం రొయ్యల ఎగుమతులు తగ్గడంతో వీటి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 100 కౌంట్ ఉన్న రొయ్యల ధర రూ.230, 80 కౌంట్ రూ.250, 60 కౌంట్‌కు రూ.280, 40 కౌంట్‌కు రూ. 320, 30 కౌంట్‌కు రూ.420, 25 కౌంట్‌కు రూ.450, 20 కౌంట్‌కు రూ.500లకు విక్రయాలు జరుగు తున్నాయి. ఇక 15 కౌంట్ రొయ్యలను ఎక్స్‌పోర్టుకు వినియోగిస్తుంటారు.
పచ్చడి మామిడి మార్కెట్ వెలవెల..
పచ్చడి మామిడి సీజన్ దాదాపు చివరి దశకు చేరింది. నాణ్యమైన పచ్చడి కాయలు మార్కెట్లోకి రావడం తగ్గింది. ఐజర్లు రిటైల్‌గా కాయ రూ.15 నుంచి రూ.20, పెద్ద రసాలు రూ.20, చిన్న రసాలు రూ.15, సువర్ణరేఖ రూ.15, తోతాపురి(కలెక్టర్) రూ.10 నుంచి 15 మధ్య విక్రయాలు జరిగాయి.
నిలకడగా ఉల్లి..
ఉల్లి ధర మార్కెట్లో నిలకడగానే ఉంది.. ఇప్పుడు మహారాష్ట్ర ఉల్లి క్వింటాలు రూ.1000 నుంచి 1500 మధ్య హోల్‌సేల్‌గా ధర పలుకుతోంది. రిటైల్ వ్యాపారులు నాణ్యమైన ఉల్లి రూ.100కు నాలుగు కిలోలు, మఽధ్యరకం ఉల్లి రూ.100కు 5 కిలోల వంతున విక్రయిస్తున్నారు. ఇక ఆటోల్లో తిరిగి విక్రయించే వారు ఇదే రకం ఉల్లిని రూ.100కు 6 కిలోల వంతున అమ్ముతున్నారు. ఇక మార్కెట్లో నాణ్యమైన ఉల్లి రావడం ప్రారంభమైంది. మార్కెట్‌కు నాణ్యమైన ఉల్లి రావడం ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి 16 లారీల్లో 400 టన్నుల ఉల్లి వచ్చింది.
దిగిరాని కూరల ధరలు
మార్కెట్లో కూరల ధరలు దిగిరానంటున్నాయి. ఎండల తీవ్రతతో తోటలు ఎండిపోవడం, దిగుబడి తగ్గి మార్కెట్‌కు సరుకు రావడం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వంకాయలు రకం బట్టి కిలో రూ.65 నుంచి 70, బీర రూ.45 నుంచి 55, బె ండ రూ.55, దొండ రూ.45, దోస రూ.40, కాకర రూ.60, క్యాప్సికం రూ.100, కీర రూ.60, బీట్‌రూట్ రూ.60, క్యారెట్ రూ.60, టమాటా రూ.40 నుంచి 50, మిర్చి రూ.60, పొట్ల రూ.40 ఆనప రూ.30, అరటి జత రూ.15కు విక్రయిస్తున్నారు.