మన్యం రోడ్లకు మోక్షమెప్పుడు..?
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:20 AM
కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని మన్యం రోడ్లకు మోక్షమెప్పుడని అధికారులను గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
మన్యం రోడ్లకు మోక్షమెప్పుడు..?
పుంత రోడ్లను తలపిస్తున్న ప్రధాన రోడ్లు
రోడ్లపైన రాళ్లు మాత్రమే దర్శనం
గత ప్రభుత్వం నిర్లక్ష్యం.. గిరిజనుల పాలిట శాపం
రోడ్లు వేయాలని వేడుకోలు
బుట్టాయగూడెం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని మన్యం రోడ్లకు మోక్షమెప్పుడని అధికారులను గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని కొండరెడ్డి చాలా గ్రామాలకు నేటికీ సరైన రహదారులు లేక అవస్థలు పడుతున్నా పాలకుల చెవికి చేరడం లేదు. తారురోడ్ల మాట దేవుడెరుగు కనీసం గ్రావెల్ రోడ్లయినా వేయమంటూ కొండరెడ్లు వేడుకుంటున్నారు. ఏనాడో రోడ్లపైన వేసిన గ్రావెల్ కొట్టుకుపోయి నేడు పెద్దపెద్ద రాళ్లు దర్శనమిస్తు న్నాయని, కనీసం కాలినడకన వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పాడైపోయాయని అడవి బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. పీఆర్ గూడెం, ముంజులూరు, గెడ్డపల్లి పంచాయతీలోని కన్నారప్పాడు, ఉర్రింక, గోగుమిల్లి, చింతపల్లి, గెడ్డపల్లి, గుమ్ములూరు, చిలకలూరు తదితర గ్రామాల రోడ్లు పూర్తిగా పాడై పోయాయి. రహదారులను బాగు చేయాలని ఐటీడీఏ అధికారులను వేడుకుని ఎన్నో సార్లు వినతులు అందించినా స్పందన లేదు. గత ప్రభు త్వంలో రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరైనా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం లోనైనా రోడ్లను పూర్తి చేయాలని న్యూడెమోక్రసీ నాయకులు పి.శ్రీనివాస్, కె.లత, జి.నిర్మల, జి.ప్రసాద్‌రెడ్డి కొండరెడ్లు కోరుతున్నారు.
అటవీ శాఖ క్లియరెన్స్ కోసం లేఖ : అక్కిరెడ్డి, పీఆర్ స్పెషల్ ఏఈ
గతంలో విడుదలైన నిధులు పనులు జరగకపోవడంతో నిలిచిపోయా యి. బిల్లులు చెల్లింపులు జరగక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారు. పీఎం జన్‌మన్ పథకంలో చింతపల్లి – ఉర్రింక, గెడ్డపల్లి – చిలకలూరు, ఎల్‌ఎన్‌డీపేట–గుమ్ములూరు ఇతర గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మా ణాలకు నిధులు విడుదలయ్యాయి. పనులు చేపట్టడానికి అటవీశాఖ క్లియ రెన్స్ కోసం లేఖ రాశాం. అనుమతులు వస్తే పనులు చేపడతాం. అటవీ శాఖ అనుమతులు రాక వీరన్నపాలెం, గొట్టాలరేవు, లంకపాకల, రేగుల పాడు, ఉడతపల్లి ప్రాంతాల్లో రోడ్లు మంజురైనా పనులు నిలిచిపోయాయి.