కొత్త పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:53 AM
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.
జిల్లావ్యాప్తంగా 53,846 అర్జీలు దాఖలు
16తో ముగియనున్న గడువు.. మూడు రోజుల వరుస సెలవులు
సర్వర్ సమస్యలతో దరఖాస్తుదారుల ఆందోళన
భీమవరం టౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు వివిధ కేటగిరీల్లో 53,846 దరఖాస్తులు అందాయి. జిల్లాలో ఇప్పటికే 2,20,227 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్లు అందుతుండగా, ప్రభుత్వం ఇందు కోసం ప్రతి నెలా రూ.96 కోట్ల వరకు కేటాయిస్తోంది. తాజాగా కల్పిం చిన అవకాశంతో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు తదితర వర్గాలకు చెందిన వేలాది మంది అర్హులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 16తో గడువు ముగియనుండటంతో పట్టణాలు, పల్లెల్లోని సచివాలయాలు దరఖాస్తు దారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రక్రియ ప్రారం భమైనప్పటికీ, తరచూ సర్వర్లు మొరా యిస్తుండటం ప్రజలతోపాటు సచివాల య సిబ్బందినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సర్వర్ పనిచేసిన సమ యాల్లో మాత్రమే దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని దరఖాస్తులకు పాత కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆమోదం పొందుతుండగా, మరికొందరివి తిరస్కరణకు గురవుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
గడువు పొడిగింపుపై ఎదురుచూపు
దరఖాస్తు గడువు సమీపిస్తున్న వేళ వరుస సెలవులు రావడం అర్హుల కు పెద్ద సమస్యగా మారింది. ఈ నెల 12వ తేదీ రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సెలవు కావడంతో వరుసగా మూడు రోజులపాటు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు విరామం ఏర్పడింది. ఆ తర్వాత కేవలం 15, 16 తేదీల్లో మాత్రమే అవకాశం ఉండ టంతో, మిగిలిన రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్న భయం వ్యక్తమవుతోంది. సెలవు రోజుల్లోనూ దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని అధికారులు చెప్పారు.
సచివాలయాల్లోనే ధ్రువీకరణ పత్రాల జారీ
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకపోతే, వాటిని వెంటనే పొందేలా సచివాలయాల్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడికక్కడే దరఖాస్తు చేయించి పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అర్హులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తుల స్వీకరణ, పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.