Share News

లస్కర్లకు.. ఊరట!

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:31 AM

సాగునీటి కాల్వల పర్యవేక్షణలో లస్కర్ల పాత్ర ఎంతో కీలకం. ఎన్నో దశాబ్దాలుగా అరకొర వేతనాలతో రెండు పంట సీజన్‌ల్లో విధుల నిర్వహణలో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలపై స్పందించిన కూటమి ప్రభుత్వం రోజువారీ రూ.350 ఉన్న వేతనాన్ని రూ.550కు పెంపు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఉమ్మడి పశ్చిమలో 690 మందికి సత్వరం ప్రయోజనం కలగనుంది.

లస్కర్లకు.. ఊరట!
పంట కాల్వ వద్ద తూడు తొలగిస్తున్న లస్కర్లు (ఫైల్‌)

రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

ఉమ్మడి జిల్లాలో 690 మందికి లబ్ధి

తాజాగా ప్రభుత్వం జీవో జారీ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

సాగునీటి కాల్వల పర్యవేక్షణలో లస్కర్ల పాత్ర ఎంతో కీలకం. ఎన్నో దశాబ్దాలుగా అరకొర వేతనాలతో రెండు పంట సీజన్‌ల్లో విధుల నిర్వహణలో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలపై స్పందించిన కూటమి ప్రభుత్వం రోజువారీ రూ.350 ఉన్న వేతనాన్ని రూ.550కు పెంపు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఉమ్మడి పశ్చిమలో 690 మందికి సత్వరం ప్రయోజనం కలగనుంది.

గోదావరి పరివాహాక ప్రాంతంలో సాగునీటి సవ్యం గా పంపిణీ చేసే విషయంలో లస్కర్లు అమోఘమైన బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఏలూరు జలవనరుల శాఖ సర్కిల్‌ పరిధిలో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షల పైబడి హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతుంది. పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టాల కింద 690 మంది లస్కర్లు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారి వేతనాన్ని రోజుకు రూ.350 నుంచి రూ.550కు పెంచుతూ జీవో నెంబరు 124ను ఆ శాఖ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ శుక్రవారం జారీ చేశారు.

భారం కొండంత.. ఇచ్చేది అంతంతే..

దశాబ్దాల కాలంగా లస్కర్లు ఖాళీలున్న చోట్ల భర్తీ సాగకపోవడంతో ఇప్పుడున్న అరకొర అవుట్‌ సోర్సింగ్‌ లస్కర్లే కీలకమైన ప్రాజెక్టుల వద్ద భారాలను మోస్తున్నా రు. మేజర్‌ పంటకాల్వలు, మురుగునీటి కాల్వల్లో నీటి నియంత్రణ, కాల్వలకు అడ్డుపడిన తూడు తొలగింపుతో పాటు వివిధ ఆక్విడెక్టు, ప్రాజెక్టుల వద్ద నిరంతరం పహారా ఉంటూ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో వీరి సేవలు కీలకం. మరోవైపు ఐదు కిలోమీటర్ల పరిధిలో కాల్వ పరిసరాలను వీరంతా పర్య వేక్షణ చేయాల్సి ఉంది. అరకొరగా జీతాలతో, సిబ్బంది కొరతతో జిల్లాలో కీలకమైన మేజర్‌ ప్రాజెక్టులు తమ్మి లేరు, ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వ, జల్లేరు ప్రాజెక్టు (మైనర్‌)తో పాటు గోదావరి– ఏలూరు కాల్వ, వెంకయ్య వయ్యేరు, ఓల్డ్‌ వయ్యేరు తదితర చాలా కాల్వల పరిసరా ల్లో లస్కర్లు విధులు నిర్వహణలో ఉన్నారు.

గతేడాది జూన్‌ నుంచి పెంపు వర్తింపు

ఏలూరు జిల్లా పరిధిలో 210 మంది పని చేస్తున్నారు. 2025–26 ఎస్‌ఓఆర్‌ రేట్ల ప్రకారం వేత నాలు పెంపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఇటీవల అసెంబ్లీలో లస్కర్లు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం వేగంగా జీవో జారీ చేయడంపై లస్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే లస్కర్లు పోస్టులు కనీసంగా ప్రతి ప్రాజెక్టు 10 మంది అవసరం కాగా కేవలం ముగ్గురికి మించి సిబ్బంది లేరు. ఈ పోస్టులను భర్తీ చేయాలని డ్రెయినేజీ, ప్రాజెక్టుల పరిధిలో ఈఈలు కోరుతున్నారు.

జీవో జారీ హర్షణీయం

చోడగిరి శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు

జలవనరులశాఖలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న లస్కర్లుకు దశాబ్ద కాలంగా వేతనాలు పెంచా లని కోరుతున్నారు. ఎట్టకేలకు మంత్రి రామానాయుడు చొరవతో ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షణీయం. గోదావరి కృష్ణా, గోదావరి, పెన్నా తదితర ప్రాజెక్టుల్లో పనిచేసే ఎనిమిదివేల మంది లస్కర్లకు మేలు జరగ నుంది. అదేవిధంగా ఖాళీలను భర్తీ చేయాలి.

Updated Date - Mar 07 , 2026 | 12:31 AM