Share News

అకాల నష్టం

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:28 AM

అకాల వర్షం.. రైతుకు నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లోని మిర్చి పంట తడిచి ముద్దయ్యింది. కోతకు వచ్చిన పొగాకును తడవకుండా పరదాలు కప్పుతున్నారు.

అకాల నష్టం
కివ్వాకలో మిర్చి కల్లాల్లోకి చేరిన వర్షపు నీరు

మొక్కజొన్న రైతుల ఆందోళన

అకాల వర్షం.. రైతుకు నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లోని మిర్చి పంట తడిచి ముద్దయ్యింది. కోతకు వచ్చిన పొగాకును తడవకుండా పరదాలు కప్పుతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు, చేపలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మిర్చి : రంగు మారే అవకాశం..

కుక్కునూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):కుక్కునూరు మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం మిర్చి రైతులను ముంచేసింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏడాది మూడు వేల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. పది రోజులుగా కోతలు జోరుగా సాగుతున్నాయి. వందల క్వింటాళ్ల మిర్చిని కల్లాల్లో రాశులుగా ఆరబోశారు. ఈ క్రమంలో అకాల వర్షానికి మిర్చి తడిచి ముద్దయ్యింది. పలుచోట్ల కల్లాల్లోకి వర్షపు నీరు వచ్చింది. వర్షంతోపాటు గాలి వీచడంతో మిర్చి మొక్కల పూత నేలరాలింది. అకాల వర్షం అన్ని విధాలుగా నష్టమేనని రైతులు చెబుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడ వడంతో తాలు కాయగా, నలుపు రంగులో మారే అవకాశం ఉంది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటా మిర్చి సన్నాలు రకం రూ.19 వేలు, లావు రకం రూ.25 వేలు పలుకుతోంది. ప్రస్తుతం తడి చిన మిర్చిని సాకుగా చూపి ధర తగ్గించే అవకాశం ఉందని వాపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే నల్లి వైరస్‌ ప్రభావంతో ఎకరానికి 15 – 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవ కాశం ఉంది. ధర ఆశాజనకంగా ఉందనుకున్న సమయంలో అకాల వర్షం రైతాంగాన్ని నిండా ముంచింది. తడిచిన మిర్చిని కల్లాల్లో ఆరబెడుతూ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ‘ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి పంట వేశా. నాలుగు రోజులుగా కోతలు ఆరంభించి కల్లాల్లో 25 క్వింటాళ్ల వరకు ఆరబోశా. ఈలోగా అకాల వర్షానికి మిర్చి మొత్తం తడి చిపోయింది. ధర బాగుందనుకున్న సమయంలో వర్షంతో దిగు బడి తగ్గి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది’ కుక్కు నూరుకు రైతు మాచర్ల వెంకటేశ్వర్లు తెలిపారు.

పొగాకు : నిలిచిన కోతలు

ముసునూరు : వాతావరణ మార్పులతో మంగళవారం తెల్లవారుజామున కురిసిన చిరుజల్లులకు పొగాకు రైతుల్లో ఆం దోళన నెలకొంది. ముసునూరు మండలంలో సాగు చేసిన 650 ఎకరాల్లో వారం రోజులుగా కోతలు సాగుతున్నాయి. చిరు జల్లు లకు కోతలు నిలిచిపోయాయి. 30 శాతం మాత్రమే కోతలు పూర్తి కాగా, పంట పందిళ్లపై ఉంది. ఇది తడవకుండా రైతులు పరదాలు కప్పారు. మరో రెండు రోజులపాటు ఆకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతాంగం దిగాలు చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిస్తే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొక్కజొన్న : నేలవాలింది

చాట్రాయి : మండలంలో సోమవారం రాత్రి ఈదురు గాలి తో కురిసిన అకాల వర్షానికి నరశింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లోని 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేలవాలిన మొక్కజొన్నను మంగళవారం ఏవో పరిశీలించారు. వర్షం కారణంగా పొలం నిలిచిన అధిక నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, కర్రలకు తేమ తగలకుండా లేపి నిలబెట్టి మొదళ్లు వద్ద మట్టి వేయాలన్నారు.

రొయ్యలు : ఉక్కిరిబిక్కిరి

కలిదిండి : వాతావరణ మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి, చేపలు, రొయ్యలు మృత్యువాతపడే ప్రమాదం ఉండ డంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో చేపలు పట్టుబడి దశలో ఉన్నాయి. రొయ్యలు వంద కౌంట్‌ దశలో ఉన్నాయి. పలు చెరువుల్లో రొయ్యల సీడ్‌ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెరవుల్లో ముమ్మరంగా రొయ్యలు సీడ్‌ వేస్తున్నారు. వేలాది రూపాయలతో చెరువుల్లో ఏరియే టర్లు ఏర్పాటు చేసి నిరంతరాయంగా తిప్పుతున్నారు. ఆకాశం మేఘామృతం కావడంతో చేపలకు గిట్టుబాటు ధర లేకపోయి నప్పటికి పలు గ్రామాల్లో హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:28 AM