Share News

రైతును ముంచిన మినుము

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:12 AM

వాతావరణం అనుకూలించక ఈ ఏడాది మినుము సాగు చేసిన రైతులు పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

రైతును ముంచిన మినుము

తెగుళ్లతో పెరిగిన ఖర్చులు

భారీగా తగ్గిన దిగుబడులు

ముదినేపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : వాతావరణం అనుకూలించక ఈ ఏడాది మినుము సాగు చేసిన రైతులు పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండవ పంటగా కైకలూరు నియోజకవర్గంలో మినుము సాగు రైతులకు అనుకూలించలేదు. తెగుళ్లు చుట్టుముట్టడంతో మినుము దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో మినుము పైరు సాగు చేశారు. గతంలో ఎకరాకి 4 నుంచి 6 క్వింటాళ్ల మినుము దిగుబడులు వచ్చిన పొలాల్లో ఈ ఏడాది రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. మినుము ధర క్వింటాలుకు ప్రభుత్వం రూ.7800 మద్దతు ధర ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారస్తులు రూ. 8200కు కొనుగోలు చేస్తున్నా రైతులు ఖర్చులు రాబట్టుకోలేకపోయారు. ఎందుకంటే దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. మినుము పంట దిగుబడి తగ్గడంతో బయట నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారస్తులు ఎక్కువ రేటుకే ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు.

పెరిగిన ఖర్చులు

మినుము సాగుకు ఎకరాకి రూ.15 వేల నుంచి రూ.20 వేలు పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చలితీవ్రతకు మినుము పైరుకు బూడిద తెగులు వ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో వేరుకుళ్లు తెగులు వ్యాపించింది. వ్యవసాయశాఖ అధికారులు మండలంలో తరచూ పర్యటించి తగిన సస్యరక్షణ చర్యలు సూచించడం కూడా జరిగింది. తెగుళ్ల నివారణకు రైతులకు అధికంగా ఖర్చు కావడంతో పెట్టుబడి పెరిగింది. మినుము విత్తనాలు చల్లిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఈ ఏడాది ఎకరాకి రూ.20 వేల నుంచి రూ.25 వేలు పెట్టుబడి పెట్టాల్సివచ్చింది. మినుము దిగుబడులు ఎకరాకి సగటున రెండున్నర క్వింటాళ్లు రావడంతో ఆదాయం సుమారు రూ. 20 వేలు వచ్చింది. దీంతో ఎకరాకి సగటున రూ. 5 వేలు నష్టాన్ని రైతులు భరించాల్సి వచ్చింది. ఎకరాకి రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతులు రూ.10 వేలు పెట్టుబడి నష్టం ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది మినుము రైతులకు తీవ్ర నష్టాలే మిగిలాయని చెప్పవచ్చు.

ప్రభుత్వం ఆదుకోవాలి

మినుము సాగు చేసిన రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. చాలా మంది రైతులకు ఎకరాకి రెండు క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. పెట్టుబడి దక్కకపోగా నష్టం కలిగింది.

– వీరంకి చక్రపాణి, రైతు,

విశ్వనాద్రిపాలెం, ముదినేపల్లి మండలం

Updated Date - Mar 25 , 2026 | 12:12 AM