Share News

శ్రీవారి క్షేత్రానికి ఫస్ట్‌ ఱ్యాంక్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:28 AM

రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టిన తాజా ప్రజాభిప్రాయ సర్వేలో ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

శ్రీవారి క్షేత్రానికి ఫస్ట్‌ ఱ్యాంక్‌

భక్తులకు మెరుగైన సేవల్లో ద్వారకాతిరుమల క్షేత్రం ప్రథమం

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల సేవలపై ప్రభుత్వం సర్వే

ఆలయ పరిశుభ్రతపై ప్రజాభిప్రాయసేకరణతో ఉత్తమ ర్యాంకు

ద్వారకాతిరుమల, జనవరి29(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా చేపట్టిన తాజా ప్రజాభిప్రాయ సర్వేలో ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఆలయ పరిశుభ్రతపై వచ్చిన మంచి ర్యాంక్‌ కారణంగా మొదటి స్థానానికి ఎగబాకింది. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులకు దేవతామూర్తుల దర్శనంతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించడం తప్పనిసరి. దీనిలో భాగంగా ఆలయంలో తాగునీరు, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన రుచితో ప్రసాదం వంటివి అందించడం అక్కడి అధికారుల కనీస బాధ్యత, అటు ప్రభుత్వంతోపాటు ఇటు ఆలయ ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించారు. ఈ క్రమంలో భక్తులకు ఫోన్‌లు చేసి ఆలయాల్లో అందే సేవలపై అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్ర దేవాలయాల్లో భక్తులకు అందే సేవలపై గత ఏడాది జూన్‌ 24 నుంచి మూడు విడతలుగా ఈ ఏడాది జనవరి 26 వరకు తీసుకున్న పలువురి అభిప్రాయాల్లో సగటున భక్తులకు ఇచ్చే సేవలపై 69 నుంచి 75.6 శాతం సంతృప్తిని ప్రజలు వ్యక్తం చేశారు.

మొదటి స్థానం కైవసం ఇలా..

రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి వచ్చిన భక్తులకు మెరుగైన సేవలందించడంలో 75.6 శాతంతో మొదటి స్థానం దక్కింది. స్వామివారి దర్శనం సంతృప్తి కరంగా ఉందా ? అనే ప్రఽశ్నకు ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, శ్రీశైలం దేవస్థానాలు 69 శాతం దాటలేదు. ఈ ప్రశ్నకు మూడో స్థానంలో ఉన్న ద్వారకాతిరుమలకు 67.7 శాతం రాగా శ్రీకాళహస్తి ఒక శాతం ఎక్కువతో 68.7 శాతంతో ప్రథమంలో ఉంది.

ద్వారకాతిరుమల దేవస్థానంలో తాగునీరు సదుపాయంపై 73.5 శాతతోనూ, ప్రసాదం తాజాగా అనే అంశంపై 83.4 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంది. పారిశుధ్యం అంశంపై 71.2 శాతంతో మొదటి స్థానం రాగా అన్ని సేవల్లో సరాసరిగా 75.6 శాతంతో మొదటి స్థానం కైవసం చేసుకుంది. స్వల్ప తేడాలో శ్రీకాళహస్తి 75.6 శాతంతో ద్వితీయస్థానంలో నిలువగా, 74.1 శాతంతో మూడో స్థానంలో అన్నవరం, 73.1 శాతంతో నాలుగో స్థానంలో కాణిపాకం, 72.5 శాతంతో సింహాచలం ఐదో స్థానం, 72.5 శాతంతో విజయవాడ ఆరోస్థానం, చివరి స్థానంలో 66 శాతం సంతృప్తితో శ్రీశైలం ఆలయం నిలిచింది.

సర్వే తీరు..

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తులకు గత ఏడాదిన్నర కాలంగా అందే సేవలపై ప్రభుత్వం ఆరా తీసింది. రాష్ట్రంలోని జాయింట్‌ కమిషర్‌ హోదా కలిగిన ఏడు ప్రధాన ఆలయాలను ఒక విభాగంలోను, డిప్యూటీ కమిషనర్‌ హోదా కలిగిన 14 ముఖ్య ఆలయాలను మరో విభాగంలోను చేర్చారు. భక్తులకు ఫోన్లు చేసి వారు దర్శించిన ఆలయాల్లో సౌకర్య, అసౌకర్యాలను అడిగి తెలుసుకుని అభిప్రాయసేకరణ చేసి శాతాల రూపంలో కేటాయించారు.

గతం కంటే మెరుగైన ఫలితాలు..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుధ్య ఇతర పనుల కాంట్రాక్ట్‌ను గత అక్టోబరు ఒకటి నుంచి తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థకు నెలకు రూ.54 లక్షలకు అప్పగించిన తరువాత మెరుగైన ఫలితాలు వచ్చాయి.

నాలుగు అంశాలపై అభిప్రాయ సేకరణ ఇలా..

పారిశుధ్య నిర్వహణ అంశంపై ద్వారకా తిరుమలకు మొదటి ర్యాంక్‌, కాణిపాకం, సింహాచలంకు తర్వాత రెండు స్థానాలు.

సంతృఫ్తి దర్శనంలో శ్రీకాళహస్తికి ప్రథమ, తర్వాత అన్నవరం, ద్వారకాతిరుమల.

తాగునీటి సదుపాయం అంశంలో మొదటి ర్యాంక్‌ శ్రీకాళహస్తికి, ద్వారకాతిరుమల రెండు, అన్నవరం మూడో ర్యాంక్‌

ప్రసాదం ‘తాజా, రుచి’ అంశంలో శ్రీకాళహస్తికి మొదటి, ద్వారకాతిరుమల రెండు, అన్నవరం మూడో ర్యాంక్‌

మొత్తంగా ఎక్కువ శాతం మంది ద్వారకా తిరుమల దేవస్థానం అందిస్తున్న సేవలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో మొదటి ర్యాంక్‌ వచ్చింది. ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో మరింతగా కృషి చేయాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2026 | 12:28 AM