Share News

ఎంతిస్తారో..?

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:25 AM

జిల్లాలో మున్సిపాలిటీలు, తొలి విడత పోలింగ్‌ జరిగే పంచాయతీలకు ప్రచార పర్వం ముగిసింది. ఆటోలు ఆగిపోయాయి.. మైక్‌లు మూగబోయాయి.

ఎంతిస్తారో..?
తణుకు కూటమి చైర్మన్‌ అభ్యర్థితో ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రచారం

ప్రచారం ముగిసింది.. తాయిలాలకు తెరలేచింది

పట్టణాల్లో లెక్కలు కడుతున్నారు!

ఓటుకు రూ.వెయ్యి ప్రతిపాదన?

పంచాయతీల్లోనూ అదే పోటీ

జిల్లాలో మున్సిపాలిటీలు, తొలి విడత పోలింగ్‌ జరిగే పంచాయతీలకు ప్రచార పర్వం ముగిసింది. ఆటోలు ఆగిపోయాయి.. మైక్‌లు మూగబోయాయి. ప్రచారంలో హోరెత్తించిన వాహనాలు మూలకు చేరాయి. ప్రతి ఇంటికి వెళుతూ అలుపెరగకుండా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు సొమ్ములు సిద్ధం చేసుకుంటున్నారు. చివరి రెండు రోజులు కూటమి, వైసీపీ శ్రేణులు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాయి. గ్రామాల్లోనూ ప్రచారం ముమ్మరం చేశారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఎన్నికలు జరిగే పట్టణాల్లో ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. పోటీల్లో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే వార్డులు, గ్రామాల ఓటర్లను గుర్తిం చారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోడానికి ప్రత్యేక టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఓటర్లను గుర్తించారు. ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేయడానికి లెక్కలు వేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను కూడా ఓటు వేయడానికి రప్పించేందుకు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తు న్నా రు. ఏసీ బస్సులను సమకూర్చి రవాణా ఖర్చులతో సహా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలో ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించా రు అక్కడ నుంచి రప్పించేలా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. హైదరాబాద్‌లో తెలిసిన కుటుంబాలు ఉంటే కార్లను బుక్‌చేసి మరీ రప్పిస్తున్నారు. నాలుగు మున్సిపా లిటీల్లోనూ కూటమి అభ్యర్థులు ఎంత మేర పంపిణీ చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతు న్నట్లు సమాచారం.

భీమవరంలో అత్యధికం!

భీమవరంలో ప్రధాన పార్టీలు పంపకాలకు సిద్ధమవు తున్నాయి. ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.వెయ్యికే పరిమితం కావాలన్న చర్చ నడుస్తోంది. వైసీపీలో మాత్రం ఎనిమిది వార్డుల్లోనే ఓటర్లకు తాయి లాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అది కూడా కౌన్సిలర్‌ అభ్యర్థులే భరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ నుంచి నామమాత్రపు పోటీ ఉంది. నగదు పంపకాలు తగ్గించా లన్న ప్రతిపాదన వచ్చింది. ఎంత మేర ఇవ్వాలనే దానిపై కూటమిలో చర్చించుకుంటున్నారు. వైసీపీలో వార్డులకే పరిమితం అవుతోంది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో కూటమి అభ్యర్థులు రూ. వెయ్యి చొప్పున వంతున అందజేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి అంతగా పోటీ లేదు. స్వతంత్ర అభ్యర్థులపైనే అక్కడ దృష్టి పెట్టారు.

తాడేపల్లిగూడెంలో ఆ ఒక్క వార్డు..!

తాడేపల్లిగూడెంలో 33వ వార్డుపైనే అందరి దృష్టి. అక్కడ తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు కౌన్సిలర్‌ పదవి కి పోటీ పడుతున్నారు, వైసీపీ అక్కడ నామమాత్రపు పోటీ ఇస్తోంది. తెలుగుదేశం తరపున ఇన్‌చార్జి వలవల బాబ్జి, జనసేన అభ్యర్థి తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని వాస్‌ మంగళవారం అదే వార్డులో ప్రచారం నిర్వహిం చారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థికి గ్లాసు గుర్తు, కౌన్సిలర్‌ అభ్యర్థు లకు తమ పార్టీ గుర్తులపైనా ఓటేయాలంటూ ఇద్దరు నేతలు ఓటర్లను కోరడంతో పట్టణంలో దీనిపై చర్చ నడుస్తోంది. మిగిలిన వార్డుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు తమకు కేటాయించిన వార్డుల్లో ప్రచారా న్ని ముగించారు. వైసీపీ కూడా చివరి రెండు రోజులు ర్యాలీలు నిర్వహించింది. మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల ఇబ్బంది ఉంది. స్వతంత్ర అభ్యర్థుల పోటీ నామమాత్రమే అయినా టీడీపీ అభ్యర్థులపై ప్రభావం చూపకూండా ఆ పార్టీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 33 వార్డు మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటర్లు కూడా తాయిలాలపై చర్చించుకుం టున్నారు. తణుకులో కూటమి పార్టీకి స్వతంత్రుల బెడద అంతగా లేదు. దాంతో తాయిలాలపై చర్చింకుంటున్నారు. పాలకొల్లులో స్వతంత్రులు అధికంగా ఉన్నారు. చైర్‌పర్సన్‌ పదవికి కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉంది. కూటమి గెలుపుపై ధీమా ఉండడంతో రెండో స్థానం ఎవరిదనేది ఇప్పుడు పాలకొల్లులో చర్చ నడుస్తోంది.

తొలివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధం

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ

80 సర్పంచ్‌.. 623 వార్డులకు రేపు పోలింగ్‌

తాడేపల్లిగూడెం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మొదటి విడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఆచంట, మొగల్తూరు, నరసాపురం రూరల్‌, పెనుగొండ, పెనమంట్ర మండలాల్లో 90 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం 7 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలు కూడా ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 1006 వార్డులకు 383 వార్డులు ఏకగ్రీవం కావడంతో 623 వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. జిల్లా, డివిజన్‌స్థాయి, మండల స్థాయి అధికారులు పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. పీవో, ఏపీవోలకు బుధవారం ఎన్నికల సామగ్రిని అందజేయనున్నారు. వీటికోసం ప్రత్యేక కేంద్రాలను ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మెటీరియల్‌, సిబ్బందిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేశారు. ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు.

Updated Date - Nov 25 , 2026 | 12:25 AM