సమాయత్తం!
ABN , Publish Date - May 14 , 2026 | 12:30 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లే. దాదాపుగా ఈ ఏడాది సెప్టెంబరు లోనే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలు స్తోంది.
సెప్టెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం
ప్రస్తుతం ఓటర్ల జాబితాల అప్‌డేట్.. త్వరలో మిగిలిన ప్రక్రియ
పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 12.95 లక్షలు
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 48 జడ్పీటీసీలు ..
పునర్విభజన జరిగితే ఏలూరు జిల్లాలో 27 జడ్పీటీసీలు
(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లే. దాదాపుగా ఈ ఏడాది సెప్టెంబరు లోనే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలు స్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యా లయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలకు సంసిద్ధం కావా లని, ఓటర్ల జాబితాలను అప్‌డేట్ చేయాలని సూచించడం దీనికి బలం చేకూర్చు తోంది. అయితే ముందుగా పంచాయతీల ఎన్నికలా లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ లేదా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. జిల్లాల పునర్వి భజన జరిగినా ఇప్పటివరకు జిల్లా పరిషత్‌లు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఉన్నా యి. ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 48 జడ్పీటీసీలు, 937 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గం గడువు సెప్టెం బరు 23తో ముగుస్తుంది. అయితే జిల్లాల పునర్విభజన అనుసరించి జిల్లా పరిష త్‌లు జూలైలో పునర్విభజన జరిగితే ఏలూరు జిల్లాలో 27 జడ్పీటీసీలే ఉంటాయి. ఇక పంచాయతీల విషయాని కొస్తే జిల్లాలో 547 పంచాయతీలు ఉన్నాయి.
పంచాయతీల్లో ఓటర్లు 12,95,020
ఇప్పటికే గత ఏప్రిల్ 15న పంచాయతీల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాలను అయా పంచాయతీల్లో ప్రదర్శనకు వుంచారు. వాటి ప్రకారం జిల్లాలో 12లక్షల 95వేల 20 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6,59,930 మంది మహి ళలు, 6,35,047 మంది పురుషులు, 43 మంది ఇతర ఓటర్లు ఉన్నారని జిల్లా పంచాయతీ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక జిల్లాలో పంచాయతీల వారీగా పరిశీలిస్తే 5,680 వార్డులు ఉన్నాయి. ఏలూరు డివిజన్‌లో 11 మండలాల్లో 2,568 వార్డులు, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 10 మండలాల్లో 1,748 వార్డులు, నూజి వీడు డివిజన్‌లో 1,364 వార్డులు ఆయా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఓట ర్ల జాబితా ప్రక్రియ పూర్తిగా అప్‌డేట్ అయితే ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, వార్డుల విభజన వంటి ప్రక్రియలు జరిగే అవకాశాలు వున్నాయి. జనగణన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రామాల్లో ఎన్నికల వేడి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. పంచాయతీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కాకపోయినా ఎవరికి వారు తమ గ్రామాల్లో ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం దృష్టి సారించారు. ఈ ఎన్నికలను అధికార కూటమి పక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి నుంచే స్థానిక సంస్థలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి.