Share News

స్థానిక సమరానికి సై

ABN , Publish Date - May 16 , 2026 | 12:19 AM

స్థానికసంస్థల ఎన్నికలపై జిల్లాలో జోష్‌ మొదలైంది. మున్సిపాలిటీ, పంచా యతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఇదే ఏడాది నిర్వహిస్తారంటూ రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అధికార యంత్రాంగాన్ని కూడా ఎన్నికల సంఘం అప్రమత్తం చేసింది. ఇప్పటికే పంచాయతీల ఓటర్లు జాబితాను ప్రకటించారు.

స్థానిక సమరానికి సై

సంకేతాలిచ్చిన ఎన్నికల సంఘం

అధికార యంత్రాంగం అప్రమత్తం

ఇప్పటికే పంచాయతీలకు ఓటర్ల జాబితా

మున్సిపాలిటీల్లో ఎలక్షన్‌ వార్డుల ఆధారంగా ఇళ్ల మ్యాపింగ్‌

పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక జడ్పీ

కూటమి నేతల్లో ఆశలు

ప్రస్తుతం ఏలూరులో ఉమ్మడిగా పాలన

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

స్థానికసంస్థల ఎన్నికలపై జిల్లాలో జోష్‌ మొదలైంది. మున్సిపాలిటీ, పంచా యతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఇదే ఏడాది నిర్వహిస్తారంటూ రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూటమి నాయకులు, శ్రేణులు జనంలో ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సమస్య వచ్చిందంటే తాము ముందుండాలంటూ ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని కూడా ఎన్నికల సంఘం అప్రమత్తం చేసింది. ఇప్పటికే పంచాయతీల ఓటర్లు జాబితాను ప్రకటించారు. జిల్లాలోని 404 పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. దీని ఆధారంగానే ఎన్నికలకు వెళ్లనున్నారు. రిజర్వేషన్‌లు కూడా ఖరారు కానున్నాయి.

మున్పిపోల్స్‌పై ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైతే మున్సిపాలిటీల్లోనూ కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్‌ వార్డుల ఆధారంగా నివాసాలకు మ్యాపింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే విలీన గ్రామాల సమస్య ఉన్న మున్సిపాలిటీలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పాత వార్డుల ఆధారంగానే మ్యాపింగ్‌ చేస్తున్నారు. విలీన సమస్య లేని మున్సిపా లిటీల్లో వార్డులను పెంచారు. కొత్త వార్డుల ఆధారంగా మ్యాపింగ్‌ జరుగుతోంది. జిల్లాలో నర్సాపురం మున్సి పాలిటీలోనే సమస్య లేదు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. పాలకవర్గం కొనసాగుతోంది. నర్సాపురం మున్సిపాలిటీ పాలకవర్గం ముగిసింది. ప్రత్యేక అధికారి పాలన నిర్వహిస్తున్నారు. విలీన గ్రామాల సమస్య ఉన్న భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో ఈ నెల 6నుంచి మరో ఆరునెలల పాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడి గించారు. ఆలోగా ఎన్నికలు నిర్వహిస్తే పాలకవర్గాలు వస్తాయి. లేదంటే ప్రత్యేక అధికారుల పాలనే ఉంటుంది. అయినా సరే పాత వార్డుల ఆధారంగానే ఇక్కడ ఇళ్లకు ఎలక్షన్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. కానీ విలీన సమస్య తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. వార్డులను పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుత మ్యాపింగ్‌ను కొత్త వార్డుల ప్రకారం విభజించి ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావిస్తున్నారు. మొత్తంపైన ఈసారి విలీన గ్రామాల మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలుంటాయని ఆశావహులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

జడ్పీ పునర్విభజనపై ఆశలు

ఈసారి ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్‌ పెరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు జిల్లా పరిషత్‌ ఎన్నికలను జిల్లాల పునర్వవస్థీకరణ ఆధా రంగానే నిర్వహిస్తారని సంకేతాలు వెలువడు తున్నాయి. కూటమి నేతలు కూడా ఆ దిశగానే ఆశలు పెట్టుకున్నారు. అదే జరిగితే పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు 20 మండలాలతో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానుంది. భీమవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయినప్పటికీ జిల్లా పరిషత్‌ మాత్రం పూర్వ పశ్చిమగోదావరి జిల్లా ఆధారంగానే నిర్వహిస్తున్నారు. ఏలూరు కేంద్రంగానే పాలన కొన సాగుతుంది. దీనివల్ల పాలనాపరమైన ఇబ్బం దులు ఎదురవుతున్నాయి.సమావేశాలకు జిల్లా అధికారు లంతా అక్కడకు వెళుతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం అక్కడికే వెళుతున్నారు. ఈసారి పునర్విభజన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నారు. అది ఎంత వరకు సాధ్యపడుతుందనేది వేచిచూడాలి. కూటమి పార్టీలో మాత్రం ప్రత్యే కంగానే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నాయి. పైగా రిజర్వేషన్‌తో పాటు, చైర్మన్‌ పదవి కేటాయించే సామాజికవర్గం పైనా ఇప్పుడు అంచనాలు మొదల య్యాయి. ఆశావహులంతా తమ సామాజిక వర్గానికే కేటాయిస్తారంటూ చర్చిం చుకుం టున్నారు. జిల్లా నేతలు కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇది వరకే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని కూడా పశ్చిమకు ప్రత్యేకంగా కేటాయించాలని ప్రతిపాదించారు. భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ సైతం ఈ విషయాన్ని ప్రతిపాదించారు.

Updated Date - May 16 , 2026 | 12:19 AM