Share News

కిక్కెక్కలే !

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:10 AM

ప్రభుత్వ ఆదాయంలో ఎక్సయిజ్‌ శాఖ కీలకంగా ఉంటోంది. ఇటీవల జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా లక్ష్య సాధనలో జిల్లా వెనుకపడి పోయింది.

కిక్కెక్కలే !

లక్ష్యానికి దూరం.. మద్యం అమ్మకాలు

జిల్లాలో టర్నోవర్‌ రూ.1,452 కోట్లు

మార్చి 10 నాటికి రూ.1,136 కోట్ల సేల్స్‌

సమీక్షల్లో ఇతర జిల్లాలతో పోలిక..

జిల్లా ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి

ఇక్కడ పరిస్థితులు వేరంటున్న అధికారులు

తగ్గిన ఆదాయ మార్గాలు ఒక కారణం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఆదాయంలో ఎక్సయిజ్‌ శాఖ కీలకంగా ఉంటోంది. ప్రభుత్వం ఏదైనా మద్యం అమ్మకాలు ద్వారా గణనీయంగా ఆదాయం లభించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. అయినా ఇటీవల జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా లక్ష్య సాధనలో జిల్లా వెనుకపడి పోయింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో జిల్లా ఆదాయం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే నెలలో జిల్లా కలెక్టర్‌లతో రెండు రోజులు సమీక్ష చేశారు. ప్రతి శాఖ ఆదాయం, వెనుకబాటుపై చర్చించారు. ప్రధానంగా ఎక్సైజ్‌ శాఖలో మార్చి మాసాంతానికి రూ.1,452 కోట్లు టర్నోవర్‌ సాధించాలి. కానీ మార్చి తొమ్మిదో తేదీ నాటికి రూ.1,136 కోట్లు లక్ష్యం సాధించినట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంటే 82 శాతం మాత్రమే అమ్మకాలు సాగించారు. ప్రస్తుతం మరో రూ.20 కోట్లు మేర పెంచగలిగారు. అంటే తాజాగా జిల్లా టర్నోవర్‌ రూ.1,156 కోట్లకు చేరినట్టు అంచనా. మరో పదిరోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అంటూ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ప్రతీ ఏటా ఇదే పరిస్థితి ఉండడంతో ఎక్సైజ్‌ శాఖ తలలు పట్టుకుంటోంది. శాఖాపరంగా నిర్వహించిన సమీక్షలో వెనుకుబాటు గల కారణాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమీక్షకు వెళ్లాలంటేనే జిల్లా అధికారులు హడలిపోతున్నారు.

అక్రమ మద్యం కట్టడి

జిల్లాలో అక్రమ మద్యం కట్టడిలోనూ అధికారులు ముందుంటున్నారు. నకలీ మద్యాన్ని అరికట్టారు. నకిలీ మద్యం తయారీ ముఠాను అరెస్ట్‌ చేశారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్మకాలు చేయడంతో నకిలీ మద్యం జోరందుకుంది. కానీ ఆదాయమంతా ప్రభుత్వానికి వెళ్లింది. అక్రమ, పన్నేతర మద్యం అమ్మకాలు జరిపినా సరే ప్రభుత్వ ఆదాయంపై ఎటువంటి ప్రభావం పడలేదు. పైగా అప్పట్లో ధరలు అధికంగా ఉండేవి. దానివల్ల ప్రభుత్వానికి మద్యం ఆదాయమే పెద్ద అండగా నిలిచింది. జిల్లా నుంచి అమ్మకాలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేది. అయినా అప్పట్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకం ధరలను తగ్గించి ప్రైవేటు లైసెన్స్‌దారులకు అమ్మకం బాధ్యతలను అప్పగించింది. వారికి కమీషన్‌లు చెల్లిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరోవైపు అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ప్రైవేటు మద్యం షాపుల కారణంగా అక్రమ మద్యానికి చెక్‌పడింది. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ అమ్మకాలుంటే లైసెన్స్‌దారులే సమాచారం ఇచ్చే పరిస్థితి. నాటు సారాను కూడా అధికారులు నియంత్రించారు. అయినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవంటూ ఎక్సైజ్‌ శాఖ సమీక్షలో మల్లగుల్లాలు పడుతున్నారు.

ఆదాయ వనరులు మందగించడమే కారణమా...

జిల్లాలో ఆక్వా ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఆక్వా రంగం నష్టాల్లో పయనిస్తోంది. రొయ్య సాగు రోగాల బారినపడు తోంది. రైతులు పీకల్లోతు నష్టాలను చవిచూస్తు న్నారు. రొయ్య సాగును తగ్గించేశారు. మరోవైపు ట్రంప్‌ సుంకాల పోటు కొంత ప్రభావం చూపింది. తాజాగా యుద్ధ ప్రభావం పడింది. దీనివల్ల ఆక్వా సాగు ఒడిదుడుకులతో సాగుతోంది. రొయ్యి నుంచి రైతుల చేపలసాగు వైపు మళ్లుతున్నారు. ఇలా ఆక్వా రంగం దెబ్బతింది. మరోవైపు హైదరాబాద్‌లో స్థిరపడ్డవారంతా జిల్లాకు రాకపోకలు సాగించేవారు. వైసీపీ ప్రభుత్వంలో అటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌, చెన్నయ్‌, విశాఖ పట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న వారంతా జిల్లాకు రావడం మానేశారు. ఇక్కడనుంచే ఎదిగిన వ్యాపార వర్గాలు క్రమేణా జిల్లాతో అనుబఽంధాన్ని తగ్గించు కుంటున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడే అవకాశాలు తక్కువై పోతున్నాయి. వరికి సంబంధించి వలస కూలీలు వస్తున్నారు. నెలరోజులు వుంటున్నారు. మళ్లీ వెళ్లిపోతున్నారు. రొయ్య కంపెనీల్లో పనిచేసే వారు కూడా ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కొన్నాళ్లు ఉంటున్నారు. తిరిగి సొంత ప్రాంతాలకు పోతున్నారు. ఇదికూడా ఇక్కడ ఆదాయ వనరులను మంద గించేలా చేస్తోంది. అది అన్ని శాఖల ఆదాయ వనరులపై ప్రభావం చూపుతోంది. ఇన్ని రకాల కారణాలతోనే జిల్లాలో ఎక్సైజ్‌ ఆదాయం తగ్గిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కారణాలేవైనా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారంటూ సమీక్షల్లో జిల్లా ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

Updated Date - Mar 23 , 2026 | 12:10 AM