Share News

మద్యం దుకాణాల లైసెన్స్‌ పొడిగిస్తారా..?

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:24 AM

మద్యం దుకాణాల లైసెన్స్‌ రెన్యువల్‌పై స్పష్టత లేకపోవడంతో విక్రయాల లక్ష్యం సాధించేదెలా ఎలా అధికారులు లెక్కలు వేస్తున్నారు.

మద్యం దుకాణాల లైసెన్స్‌ పొడిగిస్తారా..?

విక్రయాల లక్ష్యంపై అధికారుల చూపు

నిల్వ చేయలేమంటున్న వ్యాపారులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మద్యం దుకాణాల లైసెన్స్‌ రెన్యువల్‌పై స్పష్టత లేకపోవడంతో విక్రయాల లక్ష్యం సాధించేదెలా ఎలా అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ ఆగస్టు లో జిల్లా నుంచి రూ.104.50 కోట్ల లక్ష్యాన్ని ఆశించింది. లైసెన్స్‌దారులు ఆ మేరకు డిపోల నుంచి మద్యం కేసులను ఎత్తాలని ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడా ది ఇదే నెలలో రూ.94 కోట్ల టర్నోవర్‌ సాధించారు. ప్రస్తుత లైసెన్స్‌దారుల గడువు సెప్టెంబరుతో ముగియనుంది. దీనితో మద్యం నిల్వ చేయలేమంటూ వ్యాపారులు చేతులెత్తేశారు. ఉన్న నిల్వలను అమ్ముకోవాలని లైసెన్స్‌దారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రెన్యూవల్‌కే మొగ్గు చూపు తోందని, కొత్త లైసెన్స్‌లకు నోటిఫికేషన్‌ ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. జిల్లాలో 193 షాపులు, బార్‌ యజమానులు ఆదివారం సాయంత్రా నికి రూ.80 కోట్లు విలువైన మద్యం కేసులను డిపోల నుంచి కొనుగోలు చేశారు. ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. మరో 24.50 కోట్లు లక్ష్యాన్ని చేరుకోవ డానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెన్యువల్‌పై ఉత్కంఠ

మద్యం లైసెన్స్‌దారులు రెన్యూవల్‌పై ఉత్కంఠతతో ఉన్నారు. గతంలో లైసెన్స్‌ దక్కించుకోవడానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో షాపు కోసం సగటున రూ.50 లక్షలు వెచ్చించడంతో నష్టాల్లో కూరుకుపోయామంటూ లబోదిబోమన్నారు. ఎక్సైజ్‌ శాఖ నుంచి 20శాతం కమీషన్‌ ఆశించారు. తొలుత 10 శాతం, తర్వాత 14శాతం వచ్చింది. అమ్మకాలు తగ్గిపోయాయి, కమీషన్‌ సరిపోవడం లేదని గగ్గోలు పెట్టారు. ఇటీవల అమ్మకాలపై కాస్త వెసులుబాటు ఇవ్వడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ఆశతో లైసెన్స్‌దారులున్నారు. లైసెన్సు గడువు ముగిసిన తర్వాత ఇక ఎగబడకూడదని వ్యాపారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీర్ఘకాలంగా వ్యాపారం చేస్తున్నవారే ఆసక్తి చూపుతున్నారు. అది కూడా కొత్త పాలసీ చూసి దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారు. కొత్త లైసెన్స్‌ల కంటే ఉన్నవాటికే రెన్యూ వల్‌ చేసే పరిస్థితి కనిపిస్తోందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు లక్ష్యాన్ని చేరుకునేలా కుస్తీ పడుతున్నారు. రెన్యూవల్‌పై ఆశతోనే లైసెన్స్‌దారులు కూడా డిపోల నుంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:24 AM