Share News

పండుగ వేళ మద్యంపై నిఘా

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:26 AM

పండుగ వేళ జిల్లాలో అక్రమ మద్యం భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంలో జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

పండుగ వేళ మద్యంపై నిఘా

జిల్లాలో రెండు చోట్ల చెక్‌పోస్టులు

మూడు బృందాలు ఏర్పాటు

నరసాపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పండుగ వేళ జిల్లాలో అక్రమ మద్యం భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంలో జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలకు వచ్చే ప్రయాణి కులు అక్కడ నుంచి వాహనాల్లో మద్యం బాటిళ్లు తీసుకోచ్చే అవకాశం ఉండటంతో సరిహద్లులోనే తనిఖీలు చేసేందుకు రెడీ అవుతున్నారు. నరసా పురం మండలం సీతారాంపురం, యలమంచిలి మండలం చించినాడ వద్ద రెండు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించుతున్నారు.

మద్యంతో పట్టుబడితే వాహనాలు సీజ్‌

ఏటా సంక్రాంతి పండగ సమయంలో జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తుంటారు. వాహనాల్లో వచ్చే చాలామంది మద్యం బాటిళ్లను కూడా తీసుకురావడం పరిపాటి. వీటి పై గతంలో పెద్దగా తనిఖీ ఉండేది కాదు. అయితే ఈ ఏడాది ఎక్సైజ్‌ శాఖ సీరియస్‌గా తీసుకొంది. కల్తీ మద్యంతో పాటు నాన్‌ డ్యూటీ మద్యంపై నిఘా పెట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. మద్యంతో వాహనాలు పట్టుబడితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేయనున్నారు. యానాం నుంచి రోడ్డు, నదీ మార్గంలో పెద్ద ఎత్తున నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం తరలివచ్చే అవకాశం ఉండటంతో జిల్లాలోని చించినాడ, గోదావరిపై నిఘా పెట్టారు. కోడిపందాల వద్ద నిర్వహించే శిబిరాలు, గ్రామా ల్లోని బెల్ట్‌ షాపుల వద్ద ఈ తరహా మద్యం విక్రయించే అవకాశం ఉండటంతో షాపులపై నిఘా ఉంచారు. ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం విక్రయిస్తే తీసుకునే చర్యలపై పాత నేరస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఎక్కడైనా నాన్‌ డ్యూటీ మద్యంతో పట్టుబడితే నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైవేలు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేయనున్నారు.

చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా

మద్యం అక్రమంగా రాకుండా గట్టి నిఘా పెట్టాం. చించినాడ, సీతా రాంపురం గ్రామాల్లో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలు ఈ చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా కొనసాగుతుంది. వాహనాల్లో ఇతర రాష్ట్రాల మద్యం తీసుకువస్తే కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేస్తాం.

–రాంబాబు, సీఐ, నరసాపురం

Updated Date - Jan 07 , 2026 | 12:26 AM