లైన్ క్లియర్!
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:28 AM
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కారణంగా 41.15 కాంటూరు లెవల్‌లో పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం.
41.15 కాంటూరు లెవల్‌లోని ముంపు గ్రామాలు ఏడాదిలోగా తరలింపు
గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో నిర్వాసితులకు తప్పని తిప్పలు
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కారణంగా 41.15 కాంటూరు లెవల్‌లో పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ప్రాజెక్టులో 2027 జూలై నాటికి కనీసం 119 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటూ సీఎం చంద్రబాబు ఇటీవల పోలవరం పర్యటనలో స్పష్టం చేశారు. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ పునరావాస పరిహారం ఇక క్లియర్ అవుతుందని నిర్వాసితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కుక్కునూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా వందలాది మంది నిర్వాసితుల బిల్లులు పెండింగులో ఉన్నాయి. సరైన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలో దాదాపు 191 కుటుంబాలకు సంబంధించి పరిహారం పెండింగులో ఉంది. నిర్వాసితులకు సంబంధించి ఆధార్, ఇంటి పన్ను, బ్యాంకుఖాతా, డెత్‌సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, నోటరీ, అఫిడవిట్, ఆధారాలు లేకపోవడంతో పరిహారం చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో సంబంధిత నిర్వాసితులకు మీ ఆధారాలు తెచ్చి ఇవ్వండి..అంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎంత త్వరగా ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే పరిహారం కూడా అంతే వేగంగా చెల్లిస్తామని చెబుతున్నారు.
జాబితాలో పేర్లు గల్లంతు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూరు లెవెల్‌లో 26 గ్రామాలు ముంపులో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో పలు గ్రామాల్లోని నిర్వాసితుల ఇళ్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. కుక్కునూరు–ఏ బ్లాక్, కివ్వాకలో 200కు పైగా ఇళ్ల పేర్లు జాబితాలో లేకుండా పోయాయి. నిర్వాసితులకు సంబంధించి వ్యక్తిగత పునరావాస పరిహారం ప్రభుత్వం చెల్లించింది. కానీ ఇళ్ల జాబితాలో పేర్లు గల్లంతు అవడంతో వారు కోల్పోతున్న ఇళ్లకు పరిహారం
చంద్రబాబుతోనే నిర్వాసితులకు న్యాయం
సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా నిర్వాసితులకు న్యాయం జరుగుతోంది. ఎకరానికి రూ.10.50 లక్షలు పరిహారం అందించి రైతాంగానికి న్యాయం చేశారు. కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసి న్యాయం చేస్తున్నారు.
– ములిశెట్టి నాగేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు, కుక్కునూరు
జాబితాలో పేరు గల్లంతు
ముంపులో కోల్పోతున్న ఇళ్లకు సంబంధించి జాబితా తయారు చేశారు. అందులో మా ఇంటి పేరు కూడా వచ్చింది. తర్వాత ఆ జాబితాలో మా ఇళ్లకు సంబంధించి పేరు గల్లంతైంది. ఇలా మా గ్రామంలో దాదాపు 108 పేర్లు జాబితాలో లేవు. ఇప్పటికైనా మాకు పరిహారం అందుతుందని ఆశిస్తున్నాం.
– రాయి కోటేశ్వరరావు, కివ్వాక
ఒకరి పరిహారం మరొకరి ఖాతాలో..
వేలేరుపాడు: అధికారులు పొరపాట్లు కారణంగా పోలవరం నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. నడిమిగొమ్ము కాలనీకి చెందిన కాపుల లాలయ్య అనే నిర్వాసితుడు తనకు పరిహారం రాలేదని పేర్కొంటూ గతేడాది జనవరి నుంచి కేఆర్.పురం ఐటీడీఏ పీవో. ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేకాధికారి కార్యాలయానికి వెళ్లి పలుసార్లు వారి దృష్టికి తీసుకెళ్లగా అధి కారులు చేసిన పొరపాటు బయటపడింది. అతనికి రావాల్సిన పరిహారం రూ.6లక్షల 86వేలను అసలు నిర్వాసితుడే కాని ఈ ప్రాంతంతో సంబంధం లేని శ్రీకాకుళానికి చెందిన అప్పల నర్సయ్య అనేక వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ అయినట్టు తేలింది. ఆ సొమ్ములు రికవరీ చేసి మీ ఖాతాలో వేస్తామని ఈ విషయం బయటకు వెళ్లడించవద్దని లాలయ్యను కోరారు. ఇది జరిగి రెండునెలలు కావొస్తున్న పరిహారం జమ కాలేదు. మరలా ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లగా పరిహారం జమ అయిన వ్యక్తి ఖాతాలో డబ్బులు డ్రా చేసినట్టు ఉందని, ఆ వ్యక్తి నుంచి రికవరీ చేస్తామని చెబుతున్నారని బాధితుడు వాపోతున్నాడు.