ఎంపీ ల్యాడ్స్ నిధులు.. పనుల్లో జాప్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:42 AM
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. పనులు పూర్తిచేస్తే నిధులు విడతలుగా మంజూర వుతాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవ డం విమర్శలకు తావిస్తోంది.
ఏటా రూ.5 కోట్ల పనులకు అనుమతి
రెండేళ్లుగా పూర్తి కాని పనులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు లేవు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. పనులు పూర్తిచేస్తే నిధులు విడతలుగా మంజూర వుతాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవ డం విమర్శలకు తావిస్తోంది. 2024 ఆర్థిక సంవ త్సరం నుంచి గడిచిన మార్చి వరకు రూ.10 కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నా కేవలం 3.79 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. అంత వరకే బిల్లులు విడుదల చేశారు.
పర్యవేక్షణ అంతంతే..
ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలు, కమ్యూనిటి హాళ్లు, స్కూల్స్‌కు ల్యాబరేటరీ, ఇతర పరికరాలు, కాంపౌండ్ వాల్స్, యువత శిక్షణకు పరికరాలు కొనుగోలు, గ్రంథాలయాల అభివృద్ధి, నిరాశ్రయులకు వసతి గృహాలు, పురావస్తు స్మారక చిహ్నాలు, అంగన్‌వాడీల భవనాల నిర్మాణం, ఆసుపత్రి, క్రీడా పరికరాలు, ఆటస్థలం అభివృద్ధి తదితర అంశాలకు ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. అయితే అన్ని విభాగాలకు విధులను ఇవ్వడం లేదు. రెండేళ్ల కాలంలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ నిధులతో ఆసుపత్రి పరికరాలు, సైన్స్ ల్యాబ్‌లు, ఆసుపత్రి అంబులెన్స్ సౌకర్యాలకు ఎక్కువ ఖర్చు చేయగా కింద స్థాయిలో ఇంకా పలు అవసరాలను తీర్చే విధంగా పనులు సాగడం లేదు. ప్రధానంగా క్రీడా స్థలాలు అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాలు నిర్మాణాల జోలికి వెళ్లలేదు. ఎంపీ ల్యాడ్స్ వినియోగంపై పర్యవేక్షణ, నిరంతర సమావేశాల్లేకపోవడం నిధులు ఖర్చులో జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఎన్‌ఆర్ ఈజీఎస్‌లో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు కొంత వరకు జరిగాయి.
96 పనులకు 65 పూర్తి
జిల్లాలో రెండేళ్లలో రూ.9.13 కోట్లతో 102 పనుల కు ప్రతిపాదనలు పంపించారు. 96 పనులకు రూ.8.58 కోట్లు మంజూరు కాగా 65 పనులు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేశారు. వాటికి రూ. 3.79 కోట్లు చెల్లించారు. 31 పనులు పురోగతిలో ఉండగా, వీటి అంచనా వ్యయం రూ.4.26 కోట్లు. ప్రభుత్వ స్కూల్స్‌లో లేబరేటరీలతో కలిపి 50 పనులు మంజూరు చేస్తే ఇందులో రూ.2 కోట్ల మేర 47 పనులకు వెచ్చించారు. పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ పనుల్లో 5 మంజూరు కాగా 2 పనులకు రూ.74లక్షలు ఖర్చు చేశారు. చిన్ననీటి పారుదల శాఖలో 2 పనులకు రూ.33.7 లక్షలు, ఆర్‌అండ్‌బీ లో ఒక రోడ్డుకు రూ.40 లక్షలు, వీధిలైట్లకు పంచా యతీల్లో 10 పనులకు రూ.49 లక్షలు ఖర్చు చేశారు. ఎపీఎస్‌ఐడీసీ కింద 1 పని రూ.15లక్షలు, ఇరిగేషన్ శాఖ పరిధిలో ఒక పనికి 4.90లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.5 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదనలు?
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంపీ నిధు లకు సంబంధించి ప్రతిపాదనలు రాలేదని సమా చారం. ఇప్పటివరకు ప్రతిపాదనలే లేకుంటే అనుమతి, పనులు చేపట్టడం, బిల్లుల చెల్లింపు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీతో జిల్లాలోని ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరు పుతున్నారా? లేక మిన్నకుండిపోతున్నారా? అన్న సందేహాలు లేకపోలేదు. ఇటీవల ఎంపీ సమావేశాల కు ఎమ్మెలేలు రాకపోవడంతో అంతరం పెరుగు తుందా అని సందేహాలు వస్తున్నాయి.