భూముల విలువల పెంపు నిలుపుదల
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:21 AM
భూముల మార్కెట్ విలువల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు జనవరి 31వ తేదీ రాత్రే స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్‌శాఖ ఐజీ అంబేడ్కర్ రిజిస్ర్టార్, సబ్ రిజిస్ర్టార్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
పాత ధరలకే రిజిస్ర్టేషన్లు
ఇది తాత్కాలికమేనంటున్న అధికారులు
ఏలూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్ విలువల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు జనవరి 31వ తేదీ రాత్రే స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్‌శాఖ ఐజీ అంబేడ్కర్ రిజిస్ర్టార్, సబ్ రిజిస్ర్టార్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి రావాల్సి ఉంది. ఆదివారం సెలవు దినం కావడం, పైనుంచి పెంపునకు గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ప్రతిపాదన కాగితాల్లోనే ఉంది. భూములు విలువల పెంపు ప్రతిపాదనపై సీఎం చంద్ర బాబు నాయుడు సంతకం పడలేదు. దీంతో తాత్కాలింగా భూములు విలువల పెంపు, పట్టణాల్లో పెంచిన వివిధ రేట్లను నిలుపుదల చేసి పాత ధరల ప్రకారమే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. ఇది కక్షిదారులకు కొంత ఊరటే. విలువల పెంపుదల నిలుపుదల ఉత్తర్వులతో.. మార్కెట్ విలువుల పెంపుపై రిజిస్ర్టార్లు చేపట్టిన డేటా, ధరలను ఇంకా వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ప్రభుత్వం ఆదేశాలు రాగానే వీటిని అప్‌లోడ్ చేయనున్నారు. మార్చి మొదటి వారం లేదా ఏప్రిల్ 1 నుంచి భూముల విలువ పెంపుదల అమలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఈ నిలుపుదల తాత్కాలికమే అని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బంగారం, వెండి ధరలు పడుతూ, లేస్తూ ఉండడం భూముల రిజిస్ర్టేషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. నిన్న మొన్నటి వరకు బంగారం, వెండి ధరలు దూకుడుగా పెరగడంతో భూముల కొనుగోలు కంటే వాటిపై పెట్టుబడికే మదుపుదారులు మొగ్గు చూపడంతో రిజిస్ర్టేషన్లపై దాని ప్రభావం పడింది. అయితే రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు అమాంతంగా పడిపోతుండడంతో వీటిని కొనుగోలు చేయాలా.. లేదా భూములపై పెట్టుబడులు పెట్టాలా.. అన్న డైలమాలో జనం ఉన్నారు.