Share News

ఉద్యాన వనమేది?

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:30 AM

రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న వెంకట్రామన్న గూడెం ఉద్యాన విశ్వ విద్యాలయం తీవ్ర భూకొరతను ఎదుర్కొంటోంది.

ఉద్యాన వనమేది?

ఉద్యాన వర్సిటీకి భూ సంకటం

అటవీ కళాశాల విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు స్థలమెక్కడ ?

రికార్డుల్లో ఉన్న రెవెన్యూ భూమి ఆక్రమణలపాలు

కనీసం 50 ఎకరాలైనా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన

దశాబ్దంగా కొలిక్కిరాని అటవీ భూముల బదిలీ

రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న వెంకట్రామన్న గూడెం ఉద్యాన విశ్వ విద్యాలయం తీవ్ర భూకొరతను ఎదుర్కొంటోంది. గత వైసీపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. గతేడాది వర్సిటీ క్యాంపస్‌లో కొత్తగా ప్రారంభించిన అటవీ కళాశాల విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. వృక్ష జాతుల పెంపకంపై వారు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కనీసం 50 ఎకరాల అటవీ భూమినైనా కేటాయించాలని వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి పంపుతున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వర్సిటీ క్యాంపస్‌లోని ఉద్యాన పరిశోధనా స్థానంలో గత ఏడాది ఫారెస్ట్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. ఏడాదికి 65 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం రెండో బ్యాచ్‌ విద్యార్థులు కూడా చేరారు. వృక్ష జాతులను పెంచుతూ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకు భూమి అత్యవసరం. అటవీ సంపదకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేందుకు రాజమండ్రిలోని ఫారెస్ట్‌ అకాడ మీతో వర్సిటీ ఇటీవల ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ప్రస్తుతం ఫారెస్ట్‌ కాలేజీకి శాశ్వత భవన సముదాయాన్ని నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే నాబార్డు నుంచి భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. గతంలోనూ వర్సిటీ అధికారులు నాబార్డు నుంచి పెద్ద మొత్తంలో నిధులు రప్పించారు. అయితే, ఇక్కడ భవనాలు నిర్మించాలన్నా, మొక్కలు పెంచాలన్నా తక్షణమే భూమి కావా లి. వర్సిటీకి ఆనుకుని రెవెన్యూ భూమి ఉన్నట్లు రికార్డుల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అది ఆక్రమణల పాలైందని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. మరోవైపు వర్సిటీకి సమీపం లోని నల్లజర్ల, ఉంగుటూరు మండలాల పరిధిలో 3,000 ఎకరాల అటవీ భూములు అందుబాటులో ఉన్నాయి.

దశాబ్దంగా ఫలించని ప్రయత్నాలు

రాష్ట్ర విభజన తర్వాత 2014–18 మధ్య కాలాన్ని ఉద్యాన వర్సిటీకి స్వర్ణయుగంగా చెబుతారు. అప్పట్లో వర్సిటీ పరిధిలో కొత్త కళాశాలలు, పరిశోధనా స్థానాలు ఏర్పాటయ్యాయి. కానీ, భూముల కేటాయింపు మాత్రం పెండింగ్‌లోనే పడిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీని పెద్దగా పట్టించుకో లేదు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జైరామ్‌ రమేశ్‌ వర్సిటీలో పర్యటించారు. నాటి ఎంపీ కనుమూరి బాపిరాజు విజ్ఞప్తితో 1,400 ఎకరాల అటవీ భూమి ఇస్తామని జైరామ్‌ హామీ ఇచ్చా రు. చివరకు అది 800 ఎకరాలకు కుదించగా.. అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. అప్పట్లో భూమి యాజమాన్య హక్కు లు అటవీ శాఖకే ఉండేలా, పరిశోధనలు వర్సిటీ చేసుకునేలా అధికారులు ఒక ఒప్పందానికి వచ్చారు. భూములు కేటాయి స్తారనుకునే తరుణంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మార డం, ప్రాధాన్యతలు మారడంతో ఒప్పందం నీరుగారిపోయింది.

కనీసం ఆ 50 ఎకరాలైనా..

కూటమి ప్రభుత్వంలో అటవీ కళాశాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాస్తవానికి వర్సిటీకి 300 ఎకరాలు అవసరం కాగా.. కనీసం 50 ఎకరాల అటవీ భూమి నైనా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో అనుకున్నట్లుగా యాజమాన్య హక్కులు అటవీ శాఖ వద్దే ఉంచుకుని, కేవలం పరిశోధనలకు భూమిని వాడుకునేలా ఒప్పందం చేసుకున్నా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుం దని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Oct 12 , 2026 | 12:30 AM