మేమిస్తాం.. మాకిష్టం లేదు!
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:38 AM
పోలవరం ప్రాజె క్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవల్ పరిధిలో మొదటి దశలో భాగంగా పునరావాసం, భూసేకరణ ప్రక్రి య ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
అర్వాయిపల్లి రెవెన్యూ పరిధిలో భూసేకరణ వివాదం
భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన గిరిజనేత రులు
తమ భూములు ఇవ్వబోమని గిరిజనుల స్పష్టీకరణ
చింతూరు మండల పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వెయ్యి ఎకరాల భూసేకరణ
కుక్కునూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజె క్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవల్ పరిధిలో మొదటి దశలో భాగంగా పునరావాసం, భూసేకరణ ప్రక్రి య ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా చింతూరు మండలంలోని గిరిజనులకు భూమికి భూమి కింద ప్రభుత్వం భూసేకరణ జరుపుతోంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు వెయ్యి ఎకరాల భూమిని సేకరించడానికి సన్నద్దమైంది. కుక్కునూరు రెవె న్యూలోని 67.85 ఎకరాలు, దాచారంలో 40.59, అర్వా యిపల్లిలో 269, అమరవరంలో 34.97, తొండిపాకలో 203 ఎకరాలకు సంబంధించి ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్లు (పీఎన్) వరుసగా జారీ అయ్యాయి. 60 రోజుల్లో తమ అభ్యంతరాలను అధికారులకు విన్నవించవచ్చని గడువు విధిం చారు. అనంతరం రైతుల అంగీకారంతో తదుపరి నోటిఫికేషన్లు, అవార్డు విచారణ, పరిహారం చెల్లింపుల ప్రక్రి య జరుగుతుంది. అయితే అర్వాయిపల్లిలో జారీ అయిన నోటిఫికేషన్‌లో వివాదం నెలకొంది.
వివాదానికి కారణం ఇదే..
అర్వాయిపల్లి రెవెన్యూలో 269 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో నెమలిపేట, గొమ్ముగూడెం, ఉప్పర మధ్యగట్ల, ఇతర గ్రామాలకు చెందిన గిరిజన, గిరిజనేతర రైతాంగం ఉన్నారు. అయితే ఎక్కువ ఎకరాల భూమి గతంలో ఓ భూస్వామి కుటుంబానికి చెందినది కావడం, పట్టాదారులుగా వారే ఉండడంతో నోటిఫికేషన్‌లో వారి పేర్లే ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం ఆ భూమి సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులు అనుభవదారులుగా ఉన్నారు. కొందరు రైతుల భూములకు సంబంధించిన కొన్ని సర్వే నంబర్లు కలిసి ఉండటంతో ఆ నంబర్లు భూసేకరణ నోటిఫికేషన్‌లో వచ్చాయి. నోటిఫికేషన్ అనంతరం జరిగే సర్వేలో ఎవరి భూమి ఎంతుందో గుర్తించి భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన వారి వివరాలు నోటిఫికేషన్‌లో ఉంచి భూమి ఇవ్వడానికి ముందుకురాని వారి వివరాలు నోటిఫికేషన్ నుంచి తొలగించనున్నారు. అనంతరమే భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది.
మా భూములు ఇవ్వడానికి సిద్ధం.. గిరిజనేతరులు
45.72 కాంటూరు లెవల్‌లో మా భూములకు ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇంకా మాకు మిగులు భూములున్నాయి. వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గిరిజనేతరులు అంగీకారం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. బుధవారం అర్వాయిపల్లి రెవెన్యూలో భూములున్న గొమ్ముగూడెం, ఉప్పరమద్దిగట్ల, గిరిజనేతర రైతాంగం కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ‘మాకు ఇప్పటికే వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం ఇచ్చారు. త్వరలో మేము చల్లావారిగూడెం పునరావాస కాలనీకి తరలివెళ్లాలి. మా మిగులు భూములకూ పరిహారం చెల్లించాలి. లేదంటే మా భూములు ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. మా భూములకు పరిహారం చెల్లిస్తే మాకు న్యాయం జరుగుతుం’దని గిరిజనేతర రైతాంగం అధికారులను కోరారు.
గిరిజనుల్లో ఆందోళన
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు సంబంధించి నోటిఫికేషన్‌లో సర్వే నంబర్లు జారీ అయ్యా యని కొందరు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా భూములు భూసేకరణకు ఇవ్వడానికి సిద్ధంగా లేమని కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం, ఏలూరు లోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు జరి పారు. కొందరు భూసేకరణ విషయంలో అధికారులు కమీషన్లు అడుగుతున్నారని కొందరు గిరిజనులు ఆరోపి స్తున్నారు.
మధ్యవర్తులుగా కొందరు రంగప్రవేశం
భూసేకరణలో భాగంగా కొన్ని భూముల్లో పట్టాదారులుగా ఒకరుంటే అనుభవదారులుగా మరొకరున్నారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించేలా మధ్యవర్తిత్వం వహించడానికి కొందరు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. ఇందులో భాగంగా పట్టాదారుని, అనుభవదారునికి మధ్య ఒప్పందాలు కుదిర్చి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూసేకరణ
నాగ మల్లేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూసేకరణ జరుగుతుంది. సేకరిస్తున్న భూములు జిరాయితీ భూమి అయి ఉండాలి. భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతుల వివరాలు, భూమి సర్వే నంబర్లు, అండగళ్ పహానిలో ఉండి తీరాలి. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆ వివరాలు వచ్చిన తర్వాత తనిఖీ చేసిన అనంతరమే భూసేకరణ జరుపుతాం.