భూమి ఎక్కడ?
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:15 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పునరావాస ప్రక్రియలో కీలకమైన భూసేకరణ ముందుకు సాగడం లేదు.
పోలవరం పునరావాసానికి భూసేకరణే అడ్డంకి
ఆరు నెలల్లో గుర్తించింది 2,799 ఎకరాలే..
మరో 5 వేల ఎకరాలు పెండింగ్
గిరిజన–గిరిజనేతరుల మధ్య భూవివాదాలతో ఆటంకాలు
కేవలం ముగ్గురు సర్వేయర్లతో నత్తనడకన సర్వే
వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పునరావాస ప్రక్రియలో కీలకమైన భూసేకరణ ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు ముంపులోని గిరిజనులకు భూమికి భూమి కేటాయించేందుకు అవసరమైన 7,812 ఎకరాల్లో ఆరు నెలల్లో 2,799 ఎకరాలను మాత్రమే గుర్తించారు. సుమారు మరో ఐదు వేల ఎకరాల వరకు గుర్తించాల్సి వుంది. భూవివాదాలు, గిరిజనుల అభ్యంతరాలు, సర్వేయర్ల కొరత వంటి సమస్యలు భూసేకరణ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి.
వేలేరుపాడు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా చింతూరు, వీఆర్.పురం, కూనవరం మండలాల్లో ముంపునకు గురయ్యే గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలి. అక్కడ అవసరమైన భూములను సమీకరించే అవకాశం లేకపోవడం తో ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో సేకరించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ బాధ్యతను చింతూరు యూనిట్–1, 2 భూ సేకరణ అధికారులకు అప్పగించారు. అయితే ఆరు నెలలుగా ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ 2,799 ఎకరాలను మాత్రమే గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్లు జారీచేశారు. తదుపరి భూ సేకరణ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. వేలేరుపాడు, కుక్కు నూరు మండలాల్లో సేకరించాల్సిన సుమారు 1,400 ఎకరాల భూములకు సంబంధించి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. గతంలో గిరిజనేతరులకు చెందిన కొన్ని భూముల్లో యజమానులు స్థానికంగా లేకపోవడంతో అవి గిరిజనుల ఆధీనంలోకి వెళ్లి, దశాబ్దాలుగా వారి సాగులో ఉన్నట్లు చెబుతున్నారు. భూసేకరణకు జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో పాత యాజమానుల పేర్లు ఉండటంతో ప్రస్తు తం వాటిని సాగు చేస్తున్న గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూముల యాజమాన్యం, అనుభవ హక్కు లపై వివాదాలు తలెత్తుతున్నాయి. జీలుగుమిల్లి, బుట్టాయి గూడెం మండలాల్లోనూ ఇదే తరహా సమస్యలు ఉన్నాయి. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, తిరువూరు ప్రాంతాల్లో భూము లు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, అక్కడ భూములు తీసుకునేందుకు గిరిజనులు అంగీకరించడం లేదని సమాచారం. తమకు గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోనే భూములు కేటా యించాలని వారు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా సేకరించాల్సిన ఐదు వేల ఎకరాలను ప్రధానంగా ఈ రెండు మండలాల్లోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముగ్గురు సర్వేయర్లతోనే సర్వే
తక్కువ సమయంలో భారీ స్థాయిలో భూమిని సేకరించా ల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో సర్వేకు అవసరమైన సిబ్బంది కొరత ఈ ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ముగ్గురు ల్యాండ్ సర్వేయర్లతోనే సర్వే కొనసాగుతోంది. ఆరు నెలల్లో 2,799 ఎకరాలను గుర్తించేందుకు ఇంత సమయం పట్టిన నేపథ్యంలో, ఇదే సిబ్బందితో మరో ఐదు వేల ఎకరాలను గుర్తించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
నష్టపరిహారం చెల్లింపునకు మరో ఆరు నెలలు!
ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసిన 2,799 ఎకరాల భూములకు సంబంధించి తదుపరి ప్రక్రియ పూర్తి కావాలి. భూముల హక్కులపై ఉన్న వివాదాలను పరిష్కరించి, భూముల విలువను నిర్ణయించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రక్రియ సక్రమంగా సాగితేనేగానీ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసిన భూములకు పరిహారం చెల్లింపు పూర్తయ్యే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు మరో ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భూముల సేకరణతోపాటు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పరిస్థితి కీలకంగా మారింది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో రైతులు, నిర్వాసితులకు చెల్లించాల్సిన సొమ్ములు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారంలో జాప్యం జరుగుతోందని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి.
పునరావాసం పూర్తి కాకుండా..
నిర్వాసితుల పునరావాస కాలనీలు నిర్మాణ దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇవి పూర్తికాకుండా ముంపు గ్రామాల నుంచి కుటుంబాలను తరలించడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ డిసెంబరు నెలాఖరుకు ముంపు గ్రామాల నుంచి 15 వేల కుటుంబాలను తరలించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశిస్తున్నారు. అయితే పునరావాస కాలనీల నిర్మాణం, భూముల కేటాయింపు, పరిహారం చెల్లింపు వంటి ప్రక్రియలు పూర్తికావాల్సి ఉండటంతో ఈ లక్ష్యాన్ని ఎలా సాధిస్తారనేది కీలకంగా మారింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,100 కోట్లు విడుదల చేసినప్పటికీ, భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం వంటి ప్రక్రియలు పూర్తికాకపోవడంతో నిధుల వినియోగం సవాలుగా మారింది.