Share News

భయపెడుతున్న లంపిస్కిన్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:37 AM

ఇటీవల దేశాన్ని కుదిపేసిన లంపిస్కిన్‌ వ్యాధి మండలంలోని పలు గ్రామాల్లో విస్తరిస్తూ తెల్ల పశువులను పాకింది.

భయపెడుతున్న లంపిస్కిన్‌

ఏలూరు రూరల్‌ మండల గ్రామాల్లో వ్యాప్తి

ఆందోళనలో పశు పోషకులు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల దేశాన్ని కుదిపేసిన లంపిస్కిన్‌ వ్యాధి మండలంలోని పలు గ్రామాల్లో విస్తరిస్తూ తెల్ల పశువులను పాకింది. ఏలూరు రూరల్‌ మండలంలో 20కి పైగా ఆవులు ఈ వ్యాధి బారిన పడినట్టు సమాచారం. వేల రూపాయలు ఖర్చు చేసి మందులు తెచ్చి వాడినా ప్రయోజనం లేకపోగా రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నాయి. వ్యాధి బారిన పడిన పశువులకు ఒంటి మీద దద్దుర్లు, వాపులతో పెద్ద పుండ్లు ఏర్పడుతున్నాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో గొర్రెలు, మేకలలో కనబడే గౌట్‌ పాక్స్‌ వ్యాధి మాదిరిగానే ఉందని పశు సంవర్ధకశాఖ అధికారులు ఇదే వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. అయినా వ్యాధి కట్టడి అవ్వకపోగా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పశుపోషకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులు పశుపోషణతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. లంపి స్కిన్‌ వ్యాధి వల్ల తమ పశువులకు ఏమవుతుందోనని, తమ ఆర్థిక పరిస్థితి మరింత కుదేలవుతుందని పాడి రైతులు కంగారు పడుతున్నారు. దీనిపై పశు వైద్యులను సంప్రదించగా మండలంలో తక్కువ సంఖ్యలోనే లంపి స్కిన్‌ వ్యాధి సోకిన పశువులు ఉన్నాయని చెప్పారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న దూడలకు వ్యాధి తీవ్రత ఉందన్నారు.

పశువులకు సోకిన లంపిస్కిన్‌ అంటు వ్యాధి, దోమలు, ఈగలు ద్వారా వేగంగా పశువుల్లో ఈ వ్యాధి విస్తరిస్తుంది. ఇది అంటు వ్యాధి కావడంతో గ్రామంలో ఒక పశువుకి సోకితే వారం రోజుల్లోనే గ్రామంలోని అన్ని పశువులకు సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల రోగం రాని పశువులకు మందుగానే టీకాలు వేయించి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. కానీ గ్రామంలో లంపి స్కిన్‌ వ్యాధితో పశువులు యథేచ్ఛగా తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పశు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:46 AM