Share News

భయపెడుతున్న ఎల్‌నినో

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:26 AM

ఎల్‌నినో పరిస్థితులు ఇటు ప్రజలను, అటు రైతులను భయపెడు తున్నాయి. జూన్‌, జూలైలో వర్షాలు లేక రైతులు సార్వా సాగులో పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

భయపెడుతున్న ఎల్‌నినో
పెనుగొండ మండ లంలో నీళ్లు లేక ఎండుతున్న చేలు

భయపెడుతున్న ఎల్‌నినో

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

ఎల్‌నినో పరిస్థితులు ఇటు ప్రజలను, అటు రైతులను భయపెడు తున్నాయి. జూన్‌, జూలైలో వర్షాలు లేక రైతులు సార్వా సాగులో పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ కారణంగా వర్షాకాలంలోను ఎండల తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. సాగు, తాగు నీటికి కష్టాలు పడాల్సిన పరిస్థితులు గ్రామాలు, పట్టణాల్లో గోచరిస్తున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్‌ వినియో గం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు ఉన్నది సూపర్‌ ఎల్‌నినో అంటున్నారు. ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో కారణంగా ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపారు. ఈ నెలలో 12 రోజులు గడిచినా ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం.

17 మండలాల్లో మైనస్‌ వర్షపాతం

ఏలూరు జిల్లాలో 28 మండలాలు ఉండగా జూన్‌లో 17 మండలాల్లో మైనస్‌ వర్షపాతం నమో దైంది. ఈ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 106.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అంటే మైనస్‌ 5 శాతం వర్షపాతం నమోదైంది. మండవల్లి, కైకలూరు మండలాల్లో సాధారణం కన్నా మించి అత్యధిక వర్షపాతాలు నమోద య్యాయి. వేలేరుపాడు, కుక్కునూరు, చింతల పూడి, లింగపాలెం, టి.నరసాపురం, జీలుగు మిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, జంగారెడ్డి గూడెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, భీమడోలు, పెదవేగి, నిడమర్రు, చాట్రాయి, కలిదిండి, ఏలూరు అర్బన్‌ మండలాల్లో మైనస్‌ వర్షపాతం నమోదు కాగా పోలవరంలో అత్యధికంగా –73.7 శాతం, కుక్కునూరులో –61.1 శాతం వర్షపాతం నమోదైంది.

జూలైలో అన్ని మండలాల్లో మైనస్‌..

జూలై నెలలో ఏలూరు జిల్లాలోని అన్ని మండ లాల్లోను మైనస్‌ వర్షపాతం నమోదైంది. ఈనెల లో సాధారణ వర్షపాతం 242.1 మిల్లీమీటర్లు కాగా సరాసరి 89 మి.మీ మాత్రమే అంటే –63.2 శాతం వర్షపాతం నమోదైంది. ద్వారకాతిరుమలలో –91.1 శాతం, లింగ పాలెం –89.3 శాతం, పెదవేగి –88.4శాతం, చాట్రాయి –86.6 శాతం, నూజివీడు –84.4 శాతం, భీమడోలులో –83.5 శాతం వర్షపాతాలు నమో దయ్యాయి. జూన్‌, జూలైలో కలిపి సాధారణ వర్షపాతం 354 మి.మీ కాగా 195.3 మి.మీ మాత్రమే అంటే –44.8 శాతం వర్షపాతం నమోదైంది.

మాఘ కార్తెలో వర్షాలు కురిసే అవకాశం

శ్రావణంలో వచ్చే కార్తెలు వర్షాలకు అనుకూలిస్తాయి. మఘ, పుబ్బ కార్తెలు రెండు రాత్రి సమయాల్లో ప్రవేశిస్తున్నందున వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు 17న మాఘ కార్తె రాత్రి 11.03 గంటలకు తదుపరి ఆగస్టు 31వ తేదీ రాత్రి 7.26 గంటలకు పుబ్బకార్తె ప్రవేశిస్తుంది. మాఘకార్తెలో సువృష్టి, పుబ్బ కార్తెలో పర్వత వృష్టి ఉందని, మాఘ కార్తెలో మంచి వర్షాలు, పుబ్బ కార్తెలో తుఫాన్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

– కాశీబొట్ల పార్వతీశ్వర శర్మ , పంచాంగ కర్త, ద్వారకాతిరుమల

పెనుగొండ మండ లంలో నీళ్లు లేక ఎండుతున్న చేలు

వాసవి పెనుగొండ: ఎల్‌నినో ప్రభావం వరిసా గుపై ప్రభావం చూపడంతో వరి చేలు నెరలు తీసి ఎండు తున్నాయి. పలు చోట్ల నీరు సమృద్ధిగా ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో నీరు అందక వరి చేలు నెరలు తీసి ఎండిపోతు న్నాయి. పెనుగొండ మండ లంలో 12,341 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. కాలువ నీటిపైనే ఆధారపడకుండా మోటారు పైపులతో నీరు తోడుకుంటూ అధిక వ్యయాన్ని భరిస్తూ రైతులు సాగు ప్రారంభిం చినప్పటికి చివరకు చేలు ఎండిపోవడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. పంపు సెట్లపై ఆధారపడి సాగు చేయలేమని కాలువల నుంచి నీరు వచ్చినా శివారు ప్రాంతాలకు అందడం లేదని వాపోతున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

కొయ్యలగూడెం: మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటు తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతమైన పోలవరం, చింతలపూడి నియోజక వర్గాల్లో రైతులు వరి సాగుపై ఎక్కువ మక్కువ చూపుతుం టారు. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాలు తక్కువగా ఉండడంతో వరినాట్లు 80శాతం మాత్రమే వేశారు. మిగిలిన 20శాతం వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మెట్టప్రాంతంలో సుమారు 650 అడుగులు వెళ్తే కాని బోర్ల నుంచి నీరు రాని పరిస్థితి ఉంది. మోటార్లు కూడా 350 నుంచి 400 అడుగుల లోతులో నుంచి నీళ్లు తోడుతుంటాయి. అంతంత మాత్రం వర్షాలతో వరి నాట్లు వేశామని, ఇంకా వర్షాలు కురవకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొయ్యలగూడెం మండలం మంగపేట ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంట డంతో ఆ ప్రాంతంలో ఎప్పటినుంచో నీళ్లు పడక బోరులు వేయడం లేదు. పొంగుటూరు, కన్నాయి గూడెం, ఆరిపాటిదిబ్బలు, యర్రంపేట, కనకాద్రిపురం, పుంతలగూడెం ప్రాంతాల్లో సుమారు 650 అడుగులు లోతు వెళ్లి బోర్లు వేస్తున్నారు. ఎల్‌నినో సమస్య వల్ల ఈ ఏడాది బోరుల్లో నీరు తగ్గి మోటార్లు సరిగ్గా లాగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించాలి

భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచో ప్రచారం సాగిస్తున్నాయి. దానికి అనుగుణంగా రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఇంకుడుగుంతలపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వాటి వల్ల ఉపయోగాలు రైతులకు తెలియక వాటిని ఏర్పాటు చేసుకోవడం లేదు. అధికారులు నామమాత్రంగా ప్రచారం చేస్తున్నారే తప్పా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్షాలు కురవకపోతే నష్టమే..

నేను పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా.. ఈ ఏడాది కూడా వరినాట్లు వేశాను. వర్షాలు కురవకపోవడంతో బోర్లు మోటార్ల ఆధారంగా వరినాట్లు వేశాను. ఎల్‌నినో ప్రభావంతో మోటార్లు సక్రమంగా నీటిఇని తోడడం లేదు. వరినాట్లకు ఎకరానికి సుమారు రూ.20వేలు నుంచి రూ.25వేలు ఖర్చు అయింది. వర్షాలు కురవకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

– నిమ్మగడ్డ కిశోర్‌, కన్నాయిగూడెం

Updated Date - Aug 16 , 2026 | 01:26 AM