ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:29 AM
ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరుగులు తీయనుంది.
కృష్ణా కాలువ పూడికతీత
ఈ వారంలో పనులు పూర్తి
గట్టు పటిష్ఠం చేయాలి
ఆక్వా చెరువులకు నీరు ?
పట్టించుకోని అధికారులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరుగులు తీయనుంది. తాగు, సాగునీటి అవసరాలతో పాటు ఆక్వా రంగానికి ఉపయుక్తంగా ఉండే కృష్ణా కాల్వ పరిసరాల్లో పూడికలు అవరోధంగా మారాయి. నగర పరిధిలో రూ.30 లక్షలతో కాల్వ పూడిక పనులు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూడిక, వ్యర్థాల తొలగింపుతో పాటు స్థానికులు చెత్త వేయకుండా గట్టు పటిష్ఠం చేసి కంచె ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. మరోవైపు గోదావరి కాల్వ పూడికతీత పనులు పూర్తయ్యాయి. కాల్వకు విడుదలవుతున్న నీటిని చేపల చెరువులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శరవేగంగా పనులు..
నగర పరిధిలో కృష్ణా కాల్వ ప్రవాహానికి ఆటంకంగా మారిన పూడికల తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణా కాల్వ నగరంతో పాటు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. దశాబ్ద కాలంలో పూడికల తొలగింపు పనులపై శ్రద్ధ వహించకుండా జల వనరుల శాఖ అధికారులు కాలక్షేపం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కాల్వ పనులు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఏటా ఓఅండ్‌ఎం పనుల కింద పూడికలు జరిగేవి. 2005లో కాల్వ పరిసరాలు పటిష్టత కోసం దాదాపుగా రూ.50 లక్షలతో కాల్వ రివిట్‌మెంట్ పనులు చేశారు. తర్వాత కాల్వ ఉందనే విషయమే మరిచిపోయినట్టు వ్యవహారం ఉండేది. ఇటీవల కూటమి ప్రభుత్వం జలధార–జలహారతి పథకం నిధులతో పాటు ఓఅండ్‌ఎం పనుల కింద ఇటీవల జిల్లాకు రూ.15 కోట్ల వరకు కేటాయింపులు జరిగాయి.
ఆశ్రం సెంటర్ నుంచి..
ఏలూరు నగరంలో దాదాపు మూడు కిలోమీటర్ల పైబడి కృష్ణా కాల్వ పరిసరాలు ఉన్నాయి. పలుచోట్ల కాల్వ ప్రాంతాన్ని షాపులు, బడ్డీలతో ఆక్రమించారు. దీంతో కాల్వ పరిసరాలు చెత్తా, చెదారం, వ్యర్థాలతో కలుషితమైంది. ఇప్పటికే కృష్ణా కాల్వకు నీరు విడుదల చేసినప్పటికీ పంపుల చెరువు ప్రాంతంలో వంతెన నిర్మాణంతో కాల్వ నీటి అడ్డుకట్ట వేశారు. ఈ వారంలోనే కాల్వ పనులు పూర్తి కానున్నాయి. ఇదే తరుణంలో ఎక్స్‌వేటర్లతో కాల్వపై గట్టు పటిష్టంగా ఉండేలా పూడిక తీసిన మట్టితో పనులు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.
గోదావరి కింద... చెరువులకు గేట్లెత్తేశారు
గోదావరి కాల్వ పరీవాహక ప్రాంతంలో కాల్వ పూడికతీత పనులు పూర్తయ్యాయి. రైతులు నారుమడులు వేయడానికి సన్నద్ధమయ్యారు. గోదావరి కాల్వకు 5,500 నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు–గోదావరి కాల్వ కింద బాదంపూడి ఎస్కేపు కింద ఆరు వేల ఎకరాలున్నాయి. ఇందులో 4,500 ఎకరాలు చేపల చెరువులు కాగా, 1,500 ఎకరాలు వరి పొలాలు. ఎస్కేపు వద్ద చేపల చెరువులకు పూర్తిగా గేట్లు ఎత్తేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక అధికారి, కిందిస్థాయి సిబ్బంది ముడుపులు తీసుకుని చేపల చెరువులకు నీరు మళ్లిస్తున్నారని రైతులు, నీటి సంఘం పెద్దలు ఆరోపిస్తున్నారు.
రూ.30 లక్షలు.. 3 ప్యాకేజీలు
కాల్వలో పూడికతీతకు రూ.30 లక్షలతో ఓఅండ్‌ఎం పనులు మం జూరయ్యాయి. 3 ప్యాకేజీలు కింద రూ.10 లక్షల వ్యయం చొప్పున నీటి సంఘాల ఆధ్వర్యంలో గ్రీన్‌సిటీ నుంచి తూర్పులాకుల వరకు పను లు చేపట్టాం. పారదర్శకంగా పను లు పనులు జరుగుతున్నాయి.
– దుర్గారావు, ఏఈ