హే..కృష్ణా!
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:23 AM
ఏలూరు జిల్లాలో రబీ, మంచినీటి పథకాల అవసరాలకు సంబంధించి కృష్ణా జలాలు రాకపై నీలినీడలు కమ్ముకున్నాయి. హైదరా బాద్‌లో సోమవారం జరిగిన కృష్ణానదీ యాజ మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీకి కేటాయించాల్సిన నీటి వాటా లెక్కలు తేలలేదు.
నీటి లెక్కలు తేలలేదు
రబీకి, మంచినీటి పథకాలకు నీరెలా..?
గతేడాది సాగర్ జలాలు రాలేదు
ఒత్తిడిలో జిల్లా జలవనరులశాఖ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఏలూరు జిల్లాలో రబీ, మంచినీటి పథకాల అవసరాలకు సంబంధించి కృష్ణా జలాలు రాకపై నీలినీడలు కమ్ముకున్నాయి. హైదరా బాద్‌లో సోమవారం జరిగిన కృష్ణానదీ యాజ మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీకి కేటాయించాల్సిన నీటి వాటా లెక్కలు తేలలేదు. దీంతో జల వనరుల శాఖపైన తీవ్ర ఒత్తిడి నెలకొంది. కృష్ణా జలాలు విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో నీటి లెక్కలు తేలకపోవడం తో జిల్లా సాగు, తాగు నీటి అవసరాలు ఎలా తీర్చుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 4 టీఎంసీలు ఏలూరు జిల్లాకు విడుదలయ్యేవి. ప్రకాశం బ్యారేజీ నుంచి 10 చోట్లలో వివిధ కాల్వలు, ఛానల్స్, స్లూయిజ్‌ల ద్వారా ఏలూరు అవసరాలకు సాగర్ ఎడమ కాల్వ జలాలు విడుదల చేసేవారు. గతేడాది బుడమేరు వద్ద మరమ్మతుల కారణంగా నీళ్లు అంతంత మాత్రంగా విడుదల చేశారు. తాజాగా కృష్ణా డెల్టా కింద సాగు, తాగునీటి విడుదలపై ఇంకా ఈఎన్‌సీ స్థాయిలో విజయవాడలోనే నీటిపారుదల సలహామండలి (ఐవోబీ) సమావేశం జరగనేలేదు. దీని ఆఽధారంగా డిసెంబరు మొదటి వారం నాటికే ఏలూరు జిల్లాలోను ఐవోబీ సమావేశం జరిపి సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రణాళి కను రూపొందించాల్సి ఉంది. ఈ సారి సాగు, తాగునీటి విడుదలపై అఽధికారిక ప్రకటనలో జాప్యం చోటు చేసుకోనుంది.
52 వేల ఎకరాల్లో రబీ ప్రశ్నార్థకమే?
దెందులూరు నియోజకవర్గం పరిధిలో 52 వేల ఎకరాలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగానే ఉంది. దెందులూరు మండలం కృష్ణా కాల్వకు శివారు ప్రాంతం. కృష్ణా బ్యారేజీ నుంచి దెందులూరు మండలం సీతంపేట కాల్వకు నీరు విడుదల జరగాలంటే పై స్థాయిలో ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేస్తే ఏలూరుకు రోజు వెయ్యి క్యూసెక్కులు నీటి నిల్వలు రావడం కూడా గగనమే.దీనికి తోడు దాదాపుగా 100కు పైగా మంచినీటి పథకాలకు కృష్ణా నీరే దిక్కు. ఈ నీటితోనే డిసెంబరు నుంచి జనవరిలోగా మంచినీటి పఽథకాల్లోని చెరువులను ఆర్‌డబ్ల్యుఎస్ అధి కారులు నింపుతారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పట్టిసీమ ద్వారానే కృష్ణా ఆయకట్టు, మంచినీటి పథకాలకు నీటిని తరలింపు శరణ్యంగా కనిపిస్తోంది. ఈ దిశగా కొద్ది రోజుల్లో ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది.