Share News

కో..ట్లాటలో తెగిన కట్టలు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:32 AM

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పేరిట మూడు రోజులపాటు జరిగిన కోడి పందేలు, జూదంలో అక్షరాలా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

కో..ట్లాటలో తెగిన కట్టలు

మూడు రోజుల్లో రూ.500 కోట్ల పందేలు !

ఏలూరు, పశ్చిమలో వందలాది బరులు

తెలంగాణ నుంచి భారీగా రాక

కోడి పందేలు.. పేకాట, గుండాటలతో నిలువుదోపిడీ.. జనం జేబులు ఖాళీ

జోష్‌లో నిర్వాహకులు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పేరిట మూడు రోజులపాటు జరిగిన కోడి పందేలు, జూదంలో అక్షరాలా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా వాటా రూ.300 కోట్లు కాగా, ఏలూరు జిల్లా రూ.200 కోట్లు సమర్పించుకుంది. ఇందులో వేలాది మంది లక్షల్లో చేతి చమురు వదిలించుకున్నారు. గెలిచిన వారు ఆనంద తాండవం చేశారు. వేలాది కోళ్లు కత్తుల కొట్లాటలో విలవిల్లాడి ఆహారంగా మారిపోయాయి. ఇక మద్యం ఏరులై పారింది. గుండాట, పేకాట జూదంలో జనం నిలువు దోపిడీకి గురయ్యారు.

ఏలూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి):భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో బరుల్లో కోళ్లు కత్తులతో తలపడ్డాయి. ఎప్పటిలాగే భోగి ముందు రోజు వరకు హడావుడి చేసిన పోలీసులు.. ఆ తర్వాత బరి దరిదాపుల్లో కనిపించలేదు. పందేల నిర్వాహకులు శుక్రవారం రాత్రి వరకు పందేలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో కూడా మారుమూల ప్రాంతాలు, పొలాలు, మామిడి తోటల్లో పందేలకు యత్నాలు మొదలయ్యాయి. కత్తులు దూసిన కోళ్లు.. వందల నోట్ల కట్టలను పారించాయి. ఈ సారి ఏలూరు జిల్లాలో డజనుకుపైగా అతి భారీ బరుల్లోనే కోట్ల కట్లలు తెగిపడ్డాయి. పందెం రాయుళ్లలో ఎక్కువ మంది తాగి, ఊగి, గుండాట, పేకాట, కోసాటల్లో మునిగి తేలారు. బరుల వద్ద ప్లడ్‌ లైట్లు ఏర్పాటు చేసి, రాత్రి, పగలు పందేలు కాస్తూ, బెట్టింగ్‌లు కడుతూ, గుండాటలతో నష్టపోయారు. అన్నిచోట్లా అధికార పార్టీ నేతలు కోడి పందేలకు మార్గదర్శకం చేశారు. ఈ సారి ఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి, కొయ్యలగూడె ం తదితర ప్రాంతాలకు తెలంగాణ జిల్లాల నుంచి భారీ స్థాయిలో ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ప్రజలు తరలివచ్చారు.

నూజివీడుదే అగ్రస్థానం

నూజివీడు నియోజకవర్గంలో కోళ్ల వైభోగం అంతా ఇంతా కాదు. ఏకబిగిన మూడు రోజులపాటు మీర్జాపురంలో పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బరిలో తొలి రోజు 10 కోట్ల పైబడి ఉంటే.. సంక్రాంతి, కనుమల్లో మరికొన్ని బరుల్లో కలిపి మెట్టగూడెం, నూజివీడు టౌన్‌, సిద్ధార్థనగర్‌, ఆగిరిపల్లి, జనార్దనవరం, కోటపాడు, ముసునూరు, చెక్కపల్లి, కాట్రేనిపాడు కోడి పందేల్లో రూ.120 కోట్ల పైమాటే చేతులు మారినట్లు చెబుతున్నారు. ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు, ప్రముఖు రాకలతో శిబిరాలు హైటెక్‌ సొగసులతోపాటు నిర్వాహ కులు భారీగా కోట్లకు పడగలెత్తారు. కైకలూరు మండలం భుజబలపట్నంలో రెండెకరాల స్థలంలో మూడు స్ర్కీన్లు, గ్యాలరీల్లో 500 మంది తిలకించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రెండు రోజుల్లో రూ.10 కోట్లు చేతులు మారాయి. కైకలూరు మండలం శృంగవరప్పాడు, పంది రిపల్లిగూడెం, రాచపట్నంల్లో రూ.5 కోట్ల పైబడి పందేలు జరిగాయి. ముదినేపల్లి మండలం అల్లూరు, పెయ్యేరు, పెదపాలపర్రు, సింగరాయ పాలెం– కోరుకల్లు రోడ్ల వద్ద గురు, శుక్రవారాల్లో రూ.5 కోట్లు చేతులు మారాయి. ఏడు బుల్లెట్‌ లు, ఒక కారు, రెండు హోండా యాక్టివాలను ఎక్కువ పందేలను గెలుచుకున్న వారికి బహుకరించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో నాలుగెకరాల పామాయిల్‌ తోటల్లో జరిగిన కోడి పందేల్లో రూ.3.5 కోట్లు చేతులు మారాయి. లింగపాలెం మండలం లింగపాలెం, ములగలంపాడు, కలరాయన గూడెంలో రూ.15 కోట్ల పందేలు జరిగాయి. చింతలపూడి మండలం తెలంగాణ–ఆంధ్రా బోర్డర్‌లో చింతంపల్లిలో భారీగా జనం తరలించారు. తెలంగాణ ప్రజలు తిలకించారు. ఈసారి కొంత తక్కువగానే పందేలు సాగాయి. తెలంగాణ నుంచి వచ్చిన ప్రముఖులు, భీమవరం, నూజివీడు వైపు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడ సరాసరిన ఈ రెండు రోజుల్లో రూ.2 కోట్లు చేతుల మారాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం భారీగా పందేలు సాగాయి. కుక్కునూరు మండలంలో కుక్కునూరు, వేలేరు, శ్రీధర, చీరవల్లి, దాచారం రూ.2 కోట్లు చేతులు మారాయి. పోలవరంలో కొత్తపట్టిసీమ, పట్టిసీమ, గొందివరం, ఎల్‌ఎన్‌డీ పేటలో నాలుగుచోట్ల భారీగా సాగాయి. ఎనిమిది కోట్ల మేర పందేలు సాగాయి. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలె ం, జీలుగుమిల్లి, రాచన్నగూడెం, పి.అంకంపాలెం, దిబ్బగూడెంలో భారీ పందేల్లో కోటి వరకు పందేలు జరిగాయి. ఏలూరు రూరల్‌ మండలం కొల్లేరు, ఇతర ప్రాంతాల్లో జరిగిన భారీ పందెల్లో రెండుకోట్లపైనే సాగాయి. అప్పనవీడు, కలపర్రు,పెదపాడు, సత్యవోలు పందేలు ముగిశాయి. దెందులూరు నియోజకవర్గంలో రూ.10 కోట్లపైనే చేతులు మారాయి. భీమడోలు మండలంలో ఈ సారి కోడి పందేలు ఆశాజనకంగా సాగలేదు. జిల్లావ్యాప్తంగా చిన్నా, చితకా, ఓ మోస్తరు బరులు 150కు పైనే ఏర్పాటు చేశారు. కొల్లేరు లంక గ్రామాల్లోను భారీగానే పందెలు సాగాయి.

75 వేల మందికి భోజనాలు

పెదవేగి : పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల వేడుకల్లో 75 వేల మందికి ప్రతిరోజు చికెన్‌, మటన్‌, రొయ్యల బిర్యానీలతో ఉచిత భోజనం అందించారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి, అతిథి మర్యాదలతో ఆకట్టుకున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:32 AM