Share News

కోటిపల్లి పరుగులు

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:53 AM

కోటిపల్లి రైల్వే లైన్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఈ రైల్వే లైన్‌ కోసం 121 ఎకరాలను సేకరించారు.

కోటిపల్లి పరుగులు

రైల్వేస్టేషన్‌ సమీపంలో స్థలం సేకరణ

మరో రెండు ఫ్లాట్‌ఫారాలకు ప్రతిపాదన

రెండు నెలల్లో పాత భవనం తొలగింపు

కొత్తస్టేషన్‌ వరకు ట్రాక్‌ల పొడిగింపు

జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.. కోటి పల్లి రైల్వే లైన్‌ కోసం రెండున్నర ఎకరాలు గుర్తించారు. దీనికోసం నరసాపురం స్టేషన్‌లో కొత్తగా రెండు ప్లాట్‌ఫారాలను నిర్మిస్తున్నారు..

నరసాపురం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి రైల్వే లైన్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఈ రైల్వే లైన్‌ కోసం 121 ఎకరాలను సేకరించారు. తాజాగా మరో రెండున్నర ఎకరాలను స్టేషన్‌ సమీపంలో గుర్తిం చారు. ఈ రైల్వే లైన్‌ కోసం స్టేషన్‌లో కొత్తగా రెండు ప్లాట్‌ ఫారాలను నిర్మిస్తున్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని స్టేషన్‌ సమీపంలో ఎంపిక చేశారు. అక్కడ ఉన్న నివాసాలకు ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. రాష్ట్ర విభజన తరువాత పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసింది. ఒప్పందంలో భాగంగా నిర్మాణ వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో పనులు పెండింగ్‌ పడ్డాయి. ఇటు కోనసీమలో భూ సేకరణలో కొంత మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా కూడా ఈ పనులు ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కోర్టు రైల్వేకు అనుకూలంగా తీర్పును ఇవ్వడంతో పనులు ఊపందు కున్నాయి. జిల్లాలో 11 కిలోమీటర్ల మేర నిర్మించే కొత్త రైల్వేలైన్‌కు ఇప్పటికే భూ సేకరణ పూర్తయింది. అందులో మండలంలో 53, యలమంచిలి మండలంలో 66 ఎకరాలను సేకరించి రైతులకు పరిహారం ఇచ్చారు. రైల్వే లైన్‌కు మార్కింగ్‌ కూడా చేశారు. అయితే రైల్వేస్టేషన్‌ సమీపంలో భూ సేకరణ పెండింగ్‌ పడింది. నివాసాలు ఉండటంతో అప్పట్లో మార్కింగ్‌ వేయలేదు. తాజాగా ప్లాట్‌ఫారాలు నిర్మించాల్సి ఉండటంతో మార్కింగ్‌ వేసి అవసరమైన స్థలాలను గుర్తించారు.

కోటిపల్లి లైన్‌తో కొత్త ప్లాట్‌ఫారాలు

ప్రస్తుతం నరసాపురం స్టేషన్‌లో మూడు ప్లాట్‌ ఫారాలు ఉన్నాయి. గతంలో రెండు మాత్రమే ఉండేవి. విజయవాడ డబ్లింగ్‌తో కొత్త లైన్‌ ఏర్పడింది. దీంతో మూడో ప్లాట్‌పారం వచ్చింది. తాజాగా కోటిపల్లి పనులు కూడా వేగం అందుకోవడంతో అదనంగా మరో రెండు ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేసేందుకు రైల్వే రెడీ అవుతోంది. ఇవి ప్రస్తుతం ఉన్న పాత స్టేషన్‌ ముందుభాగంలో రానున్నాయి.

మరో రెండు నెలల్లో కొత్తస్టేషన్‌ వరకు ట్రాక్‌లు

అమృత్‌ భారత్‌ నిధులు రూ.30 కోట్లతో రైల్వే చేపట్టిన కొత్త రైల్వేస్టేషన్ల నిర్మాణం చివరి దశకు చేరింది. త్వరలో ఈ ఆధునిక స్టేషన్‌ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇది ప్రారంభం కాగానే ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని తొలగించాలని రైల్వే యోచిస్తున్నది. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ను కొత్త రైల్వే భవనం వరకు పొడిగించనున్నారు. అదే సమయంలో కోటిపల్లి రైల్వే లైన్‌ కోసం నిర్మించే రెండు ట్రాక్‌లు కూడా కొత్త స్టేషన్‌లో ఏర్పడనున్నాయి. దీంతో నరసాపురం స్టేషన్‌ ప్లాట్‌ఫారంల సంఖ్య ఐదుకు పెరుగుతుంది.

Updated Date - Jun 02 , 2026 | 12:53 AM