Share News

కోటిపల్లి కూత ఇటే !

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:35 AM

జిల్లాలో కోటిపల్లి రైల్వేలైన్‌ వెళ్లే మార్గం ఖరారైంది. నరసాపురం నుంచి కోటిపల్లి వరకు నిర్మించే ఈ కొత్త రైల్వేలైన్‌లో జిల్లాలో నరసాపురం రూరల్‌, యలమంచిలి మండలాల్లోని గ్రామాల గుండా రైల్వేట్రాక్‌ వెళ్లనుంది. సుమారు 11 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ట్రాక్‌ ఏర్పాటుకు అధికారులు 121 ఎకరాలను సేకరించారు.

కోటిపల్లి కూత ఇటే !

పశ్చిమలో పూర్తయిన భూసేకరణ

నరసాపురం నుంచి యలమంచిలి వరకు రైల్వే లైన్‌కు సరిహద్దులు

ట్రాక్‌ నిర్మాణం కోసం స్తంభాలు పాతిన సర్వే విభాగం

రెండు మండలాల్లో 121 ఎకరాల భూమి సేకరణ

నరసాపురం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో కోటిపల్లి రైల్వేలైన్‌ వెళ్లే మార్గం ఖరారైంది. నరసాపురం నుంచి కోటిపల్లి వరకు నిర్మించే ఈ కొత్త రైల్వేలైన్‌లో జిల్లాలో నరసాపురం రూరల్‌, యలమంచిలి మండలాల్లోని గ్రామాల గుండా రైల్వేట్రాక్‌ వెళ్లనుంది. సుమారు 11 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ట్రాక్‌ ఏర్పాటుకు అధికారులు 121 ఎకరాలను సేకరించారు.

రైల్వే ట్రాక్‌ కోసం సేకరించిన భూములకు సంబంధించి ఇప్పటికే పరిహారం చెల్లింపు పూర్తయింది. ఇందులో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన దంతా రైతుల నుంచి సేకరించినదే. దీంతో అధికారులు మార్గాన్ని ఖరారు చేసేందుకు సేకరించిన భూమిలో స్తంభాలను పాతుతూ హద్దులు వేసే పనిని పూర్తి చేశారు.నరసాపురంలో 53, యలమంచిలి మండలంలో 66 ఎకరాలు ఉంది. ఇది కాకుండా ఈ రెండు మండలాల్లో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అత్యధికంగా యలమంచిలి మండలం కలగంపూడి రైతుల నుంచి భూమి సేకరించారు. ఇక్కడ 37 ఎక రాలు సేకరించగా ఇదే మండలంలోని వైవీ లంక నుంచి నాలుగు, చించినాడ 25, నరసాపురం మండలం చినమామిడిపల్లిలో 20, గొంది 16, మాధవాయి పాలెంలో ఐదు ఎకరాలు ఉంది. సేకరించిన ఈ భూమిలో ట్రాక్‌ వేసేందుకు వీలుగా ఇటీవల రైల్వే సర్వే విభాగం స్తంభాలు పాతింది. పాలకొల్లు రోడ్‌లోని వైవీ లంక జంక్షన్‌కు 30 అడుగుల దూరంలో ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు లే అవుట్‌ గుండా ట్రాక్‌ వెళ్లనుంది. ఇటు స్టేషన్‌కు చినమామిడిపల్లి కాల్వకు అవతల వైపు నుంచి హద్దులు వేశారు. వివాదంలో ఉన్న అర కిలోమీటర్‌ మినహాయించి మిగిలిన అన్ని చోట్ల స్తంభాలు పాతుతూ హద్దులు ఖరారు చేశారు. ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా పాలకొల్లు రోడ్‌లోని కాల్వపై వంతెన రానుంది.

జంక్షన్‌గా నరసాపురం

ప్రస్తుతం నరసాపురం– విజయవాడల మధ్య మాత్రమే రైల్వే ట్రాక్‌ ఉంది. ఇది కాకుండా కోటిపల్లి– నరసాపురంల మధ్య కొత్తగా నిర్మిస్తున్న 71 కిలో మీటర్ల మేర కోటిపల్లి రైల్వేలైన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం వంతెన నిర్మాణ పనులు పూర్తిచేశారు. జిల్లాలో యలమంచిలి మండలం చించినాడ వరకు దిండిని కలుపుతూ వశిష్ఠ గోదావరిపై ఒకటిరన్న కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తున్నారు. జిల్లాలో 11 కిలోమీటర్ల మేర సాగే ఈ రైల్వేలైన్‌ వల్ల యలమంచిలి మండలంలోని చించినాడ, కలంగంపూడి, వైవీ లంక, నరసాపురం మండలం గొంది గ్రామాల్లో రైల్వేలైన్‌ ఏర్పడనుంది. అయితే ఈ మార్గాల్లో స్టేషన్లు ఎక్కడెక్కడ నిర్మిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు. రైల్వేలైన్‌ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా మారనుంది. దీనికి అనుగుణంగానే అమృత్‌ భారత్‌ పథకం కింద రూ.30 కోట్లు కొత్త స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. పనులు దాదాపు చివరి దశకు వచ్చాయి. ప్రస్తుతం కోటిపల్లి రైల్వేలైన్‌ ఏర్పాటుకు ఒక చోట మినహా మిగిలిన ఎక్కడా అడ్డంకులు లేవు. వంతెన పనులు పూర్తయితే హద్దులు ఏర్పాటు చేసిన మార్గం గుండా ట్రాక్‌ నిర్మాణం ఏర్పాటు చేసి పాలకొల్లు రోడ్‌లోని నిడదవోలు పంట కాల్వపై వంతెన నిర్మిస్తే కొత్త స్టేషన్‌కు కోటిపల్లి రైల్వేలైన్‌ కలిసిపోతుంది.

Updated Date - Mar 07 , 2026 | 12:35 AM