ఏం చేస్తున్నారు..?
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:57 PM
:కొల్లేరు సరస్సులో ఆక్రమణల నిర్మూలనపై యంత్రాంగం, అటవీ, రెవెన్యూ శాఖలు అప్రమత్తం అయ్యాయి.
కొల్లేరులో ఆక్రమణల నిర్మూలనపై దృష్టి
సీఈసీ కమిటీ అక్షింతలతో శాఖలు అప్రమత్తం
విద్యుత్ సర్వీసులు, పర్యావరణంపై కలెక్టర్‌కు ఆదేశం
ఏలూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి):కొల్లేరు సరస్సులో ఆక్రమణల నిర్మూలనపై యంత్రాంగం, అటవీ, రెవెన్యూ శాఖలు అప్రమత్తం అయ్యాయి. కొద్దిరోజుల క్రితం మంగళగిరి పీసీసీఎఫ్ కార్యా లయంలో జరిగిన సమావేశం రోజునే సుప్రీం సాధికారిత కమిటీ (సీఈసీ) ఆక్రమణలు కొనసాగడం, చెరువులకు విద్యుత్ సర్వీసుల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణలో అలక్ష్యంపై సీరియస్ అయ్యింది. దీనిపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాల్సి పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఆక్రమణలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండి, పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమా వేశం నిర్వహించారు. కొల్లేరులో జిరాయితీ, పట్టాదారుల వివరా లపై నివేదిక సిద్ధం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఆదేశించారు. మ్యాప్‌లు, సరిహద్దుల వివరాలను సిద్ధం చేయాలన్నారు.
అధికారుల అప్రమత్తతకు కారణం ఇదే..
కొల్లేరులోని ఆక్రమణలను చాలావరకు గతంలోనే తొలగించినా సుప్రీం సాధికారిత కమిటీ (సీఈసీ) దృష్టికి మరిన్ని ఆక్రమణ లున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో పర్యావరణ పరిరక్షణకు, సరస్సు మనుగడకు ప్రభుత్వం, స్థానిక అధికారులు ఏ చర్యలు తీసుకున్నారో ప్రత్యేక నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. కొల్లేరు అభయారణ్య పరిధిలో వందలాది ఎక రాలు ఆక్వా చెరువులు సాగు చేయడమే గాక కొన్నిచోట్ల నిబంధన లకు విరుద్ధంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారని, అటవీశాఖ అధికారులు చెరువులు ధ్వంసం చేస్తుంటే స్థానిక అధికారులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించింది. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పక్షుల ఆవాస కేంద్రాలు ఉన్న చెరువులో నీటి నిల్వల విషయంలో నిర్లక్ష్యంపై, పక్షులకు ముప్పు కలుగుతున్నా నీటి నిల్వలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చెరువులు ధ్వంసం చేసినా ఆక్రమణలు తొలగింపు చేపట్టినా స్థాని కంగా అధికారులు సహకరించడం లేదని అటవీ, పర్యావరణ శాఖ అధికారులు సీఈసీ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న ఆక్రమణల ను గుర్తించడమే గాక వాటిని తొలగించి నివేదికలు అందజేయాలని కోరింది. రేపో మాపో సీఈసీ కమిటీ కొల్లేరు ప్రజలకు అనుకూలంగా సుప్రీం కోర్టుకు నివేదిక అందిస్తుందన్న తరుణంలో ఇలాంటి సమస్య రావడంతో స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అర కొరగా ఉన్న ఆక్రమణలను బూతద్దంలో చూపించి సమస్య పరి ష్కారం కాకుండా అధికారులే అడ్డుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరస్సులో ఇప్పటికే ఎలాంటి అవరోధం లేకుం డా వరదలు వచ్చిన సమయంలో నీటిపారుదల జరుగుతోందని, అరకొరగా మిగిలిన నీటిలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటే వాటిని తొలగించమనడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ చెరువులపై చర్యలేవీ..?
భీమడోలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి):కొల్లేరు కాంటూ రు నిబంధనలు అతిక్రమించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాలరాస్తూ అటవీశాఖ ధ్వంసం చేసిన చెరువులను పునరుద్ధరించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నా రనే విమర్శలున్నాయి. కొల్లేరు పరిరక్షణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మండలంలో అనధికార చెరువులకు గతేడాది అటవీశాఖ అధికారులు భారీ గండ్లు పెట్టి చేపల సాగుకు చెక్ పెట్టారు. అయితే గత నెల 29న ఆగడాలలంకలో 40 ఎకరాల కొల్లేరు భూమిలో గట్లు తొలగించిన ప్రాంతంలో ఓ ప్రజాప్రతినిధి అండదండలతో గట్లు మళ్లీ పునరుద్ధరించారు. అటవీశాఖ సిబ్బంది పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ పూడ్చిన గండిని తొలగించడంపై అధికారులు మీనమేషాలు లెక్కించడంపై సర్వత్ర విమర్శలు వినవస్తున్నాయి. గ్రామస్థులను రెచ్చగొట్టిన ఆ ప్రజాప్రతినిధి పై చర్యలు తీసుకోకపోవడంపైన విమర్శలు వినవస్తున్నా యి. ఇదిలా ఉంటే కొల్లేరు పరిరక్షణ కోసం నియమించిన రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ మండల కమిటీ అధికారుల్లో సమన్వయం లోపించినట్టు అధికారుల వ్యవహారశైలిలో కనిపిస్తోంది. ఆక్రమణ వ్యవహారంలో ఎవరికి వారు మాకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రజా ప్రతినిధి ఒత్తిడితో అధికారులు నిమ్మకుండిపోయారని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా కొల్లేరు చెరువులపై అధికాయ యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోతే ఆక్రమణల పర్వం మళ్లీ మొదటి కొచ్చే ప్రమాదం పొంచివుంది. వచ్చే వేసవి నాటికి కొల్లేరు చెరువులను మళ్ళీ యథాతథంగా పునరుద్ధరించేందుకు లీజుదారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధ చేసినట్టు సమాచారం. కాగా ఆడడాలలంక చెరువు పునరుద్ధరణ ట్రయల్ ప్లాన్‌గా చర్చ జరుగుతోంది.