ముంపు బారిన కొల్లేరు
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:52 AM
ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల వచ్చిన వరద నీరు కొల్లేరు గ్రామాలను జలదిగ్బంధం చేస్తోంది. మూడు రోజుల నుంచి రోజు రోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టేస్తోంది.
నిడమర్రు మండలంలో గ్రామాల చుట్టూ వరదనీరు.. ఆందోళనలో గ్రామస్థులు
ఆటపాక పక్షుల కేంద్రం వద్ద గట్లు మునిగి కొల్లేరులోకి వెళ్తున్న నీరు
తుఫాన్ ఈదురుగాలులకు దెబ్బతిన్న స్వాగత ద్వారాలు.. పర్యావరణ విద్యాకేంద్రం
నిడమర్రు/కైకలూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల వచ్చిన వరద నీరు కొల్లేరు గ్రామాలను జలదిగ్బంధం చేస్తోంది. మూడు రోజుల నుంచి రోజు రోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టేస్తోంది. నిడమర్రు మండలంలో తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాల పల్లి, ఫత్తేపురం గ్రామాల చుట్టూ వరద నీరు చేరుకుంటోంది. ఫత్తేపురం శివారు ప్రాంతంతో పాటు మొయిన్ రోడ్డు మీదకు కూడా నీరు చేరడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓవైపు ప్రజలకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవు తుండగా మరోవైపు ముంపు నీరు వల్ల అనారో గ్యాల పాలవుతున్నారు. అధికారులు స్పందించి మురుగునీరు పోయేలా మార్గం ఏర్పాటు చేయాలని దానితో పాటు పారిశుధ్యం పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ముంపులో పక్షుల కేంద్రం
కొల్లేరు సరస్సులో పక్షుల ఆవాస కేంద్రాలైన కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం మురసు తుఫాన్ దెబ్బకు తీవ్రంగా దెబ్బతింది. తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలకు పర్యావరణ విద్యాకేంద్రం, స్వాగతద్వారాలు, మరబోట్లు దెబ్బతిన్నాయి. నిత్యం పర్యాటకులతో సందడి చేసే ఈ పర్యాటక కేంద్రం మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయింది. నేడు తుఫాన్ ప్రభావంతో ఎగువ నుంచి భారీగా వర్షపునీరు చేరడంతో గట్లపై నుంచి నీరు కొల్లేరులోకి ప్రవహిస్తోంది.పక్షుల కేంద్రం చెరువు సామర్థ్యానికి మించి వరదనీరు చేరడంతో ఈ దుస్థితి నెలకొంది. గట్లుపై నుంచి వెళ్తున్న నీరు క్రమేపి గండ్లు పడే అవకాశాలన్నాయి. ఈదురుగాలులకు పక్షుల కేంద్రానికి ఏర్పాటు చేసిన పెలికాన్ ప్యారడైజ్ స్వాగతం బోర్డు విరిగిపడింది. మరబోట్ల పై టాప్ గాల్లోకి ఎగిరి సరస్సులో పడింది. పర్యావరణ విద్యాకేంద్రం భవనం తీవ్రంగా దెబ్బతింది. పై రేకులు ఎగిరిపోవడంతో లోపల ఉన్న పక్షుల నమూనాలు, కొల్లేరు సరస్సు విశిష్టతను తెలిపే బొమ్మలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పర్యాటకులను లోపలకు అనుమతించకుండా అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. పర్యాటకులు వచ్చినా సమీపాన ఉన్న కోమటిలంక రోడ్డులో నుంచి పక్షులను వీక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రతి వేసవిలోనూ నీరు లేక వెలవెలబోయే పక్షుల కేంద్రం గట్లు గండ్లు పడితే చుక్క నీరు కూడా నిలబడని పరిస్థితి. ఇదే జరిగితే ఈ సంవత్సరం పక్షులకు పెనుముప్పే. పర్యాటకుల సందడి కూడా లేకుండా పోతోంది.