Share News

పోలీసుల వేషంలో కిడ్నాప్‌ యత్నం

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:17 AM

ఆక్వా సాగులో నష్టాలు... ఊరంతా అప్పులు.. వీటి నుంచి బయట పడేందుకు డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేశాడు..

పోలీసుల వేషంలో కిడ్నాప్‌ యత్నం
కైకలూరులో కిడ్నాప్‌ కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌

పట్టించిన క్యూఆర్‌కోడ్‌ స్కానర్‌

నలుగురు అరెస్టు..రిమాండ్‌

కైకలూరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగులో నష్టాలు... ఊరంతా అప్పులు.. వీటి నుంచి బయట పడేందుకు డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేశాడు.. మరో ముగ్గురి సాయం తీసుకుని పోలీసుల వేషాల్లో రంగంలోకి దిగారు. అయితే పథకం బెడిసికొట్టి అంతా కటకటల పాలయ్యారు. కైకలూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు.

కలిదిండి మండలం తాడినాడకు చెందిన ముదుండి దుర్గాశివవెంకటవర్మ ఆక్వా చెరువులను సాగు చేస్తున్నాడు. భారీగా నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. డబ్బు ఉన్న వ్యక్తిని కిడ్నాప్‌ చేసి ఈజీగా డబ్బు సంపాదించి అప్పుల ఊబి నుంచి బయట పడాలని భావించాడు. దానిని అమలు చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన వేటుకూరి జితేంద్రవర్మ, కలిదిండి మండలం కొచ్చెర్లకు చెందిన కొమరపాలెపు దుర్గామల్లేశ్వరరావు, తాడినాడకు చెందిన దాట్ల నాగరాజుల సాయం తీసున్నాడు. ఎవరిని కిడ్నాప్‌ చేయాలనే వారు ఆలోచించి గ్రామ సరిహద్దునే ఉన్న చిన్నతాడినాడకు చెందిన ఆక్వా రైతు జంపన వెంకట పెద్ది రామరాజును కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ వేశారు. ఈనెల 9వ తేదీ ఉదయం 6గంటలకు చెరువుల వద్దకు వెళుతుండగా కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం కాలనీలోని ఎన్‌హెచ్‌165 ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిపై పోలీసుల వేషంలో కారును ఆపారు. అదే బ్రిడ్జిపై ఏపీ40బీటీ2399 క్రెటా కారులో సీఐ గారు ఉన్నారని రమ్మని తీసుకువెళ్లారు. కారు దగ్గరకి వెళ్లగానే బలవంతంగా జితేంద్ర, మరో ఇద్దరు కలిసి కారులోకి ఎక్కించే ప్రయత్నం చేయగా రామరాజు వారిని ప్రతిఘటించాడు. అదే సమయంలో కొన్ని వాహనాలు రావడంతో నిందితులు కంగారుపడి వచ్చిన కారులోనే పరారయ్యారు. అనంతరం రామరాజు కైకలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్‌ సీఐ వి.రవికుమార్‌, ఎస్‌ఐ వి.రాంబా బు ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి గాలిం పు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే హోటల్‌లో నిందితులు టిఫిన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా డబ్బులు చెల్లించారు. పోలీసుల విచారణలో వారు అక్కడికి వచ్చినట్టు గుర్తించి డబ్బులు చెల్లించిన స్కాన్‌ ద్వారా నిందితులను పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి సోమవారం సాయంత్రం కైకలూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్‌ విధించగా మచిలీపట్నం జైలుకు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కైకలూరు రూరల్‌, టౌన్‌ సీఐలు వి.రవికుమార్‌, ఏవీఎస్‌ రామకృష్ణ, ఎస్‌ఐ వి.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 01:17 AM