సార్వాకు సమాయత్తం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:21 AM
పంట కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు సార్వా సాగుకు నారుమడులను సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏడాది ముందుగానే పంటకాల్వలకు నీరు
నారుమడులు వేస్తున్న రైతులు
తణుకు రూరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పంట కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు సార్వా సాగుకు నారుమడులను సిద్ధం చేస్తున్నారు. సార్వా సాగుకు అవసరమయ్యే వరి విత్తనాలు విత్తనాభివృద్ది సంస్థతో పాటు ప్రైవేట్ విత్తన సంస్థల అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మృగశిర కార్తె ప్రారంభం నుంచే వరి నారుమడులు వేయడం రైతులకు ఆన వాయితీగా మారింది. కొన్ని సంద ర్బాలలో రోహిణి కార్తెలోనే వర్షాలు కురవడంతో ఆవర్షపు నీరు ఆధారంగా కొన్నిచోట్ల నారుమడులు వేసేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ సరైన వర్షాలు పడక పోయినప్పటికీ ముందుగానే పంట కాలువలకు నీరు చేరడంతో పాటు బోర్లు వున్న చోట ముందస్తుగా నారుమడులను ఏర్పాటు చేసుకుంటున్నారు.
అందుబాటులో 67 టన్నుల వరి విత్తనాలు
సార్వా వరి నారుకు సంబంధించి 67 టన్నుల విత్తనాభివృద్ధి సంస్థలో అందు బాటులో వున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బెంగాలీ కూలీలతో నాట్లు వేయాలంటే ఎకరానికి 15 కిలోలు, మన ప్రాంత కూలీలతో అయితే 25 కిలోల వరి విత్తనాలు అవసరమవుతాయి. సార్వాకు ఎక్కువగా ఎంటీయూ 7029, ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100 వంటి రకాలు సార్వా సాగుకు అనుకూలమని సూచిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో పఆర్ 126, ఎస్‌ఎల్ 10, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాల ధాన్యం సేకరణను ప్రభుత్వం నిలిపివేసిందని ఈ రకాలు వేయవద్దని వ్యవసా యాధికారులు సూచిస్తున్నారు.
విత్తన శుద్ధి అవసరం
నారుమడి దశలోనే విత్తనశుద్ధి చేస్తే పంటలపై చీడ, పీడలను అరకట్టవచ్చు. పొడి విత్తన శుద్ధి కేజీకి 3 గ్రాములు, లేదా తడి విత్తన శుద్ది అయితే ఒక గ్రాము కార్బండిజం మందును ఒక లీటరు నీటిలో కలిపి శుద్ధి చేసుకోవాలి. పగలు ఎండలు ఎక్కువగా వుండటం వల్ల నారుమడిలో నీరు పల్చగా వుంచి సాయంత్రం సమ యంలో నీటిని తీసేయాలి. ఎండవేడిని తట్టుకోవడానికి నారుమడిపై పొటాషియం నైట్రేట్ (13–0–45)–1 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
–కే.రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయాధికారి, తణుకు