మళ్లీ వరదొస్తే.?
ABN , Publish Date - May 17 , 2026 | 12:24 AM
2018, ఆగస్టు 19వ తేదీని గుర్తు చేస్తేనే అప్‌ల్యాండ్ ఏరియా ప్రజలంతా హడలెత్తిపోతారు. రెండు, మూడు రోజులపాటు భారీ కుండపోత వర్షం కురవడంతో పశ్చిమ ఏజెన్సీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లి నేరుగా వరద నీరు కొంగువారిగూడెం కరాటం కృష్ణమ్తూర్తి ఎర్రకాలువ జలాశయం వైపు పరుగు పెట్టింది.
ప్రమాదం జరిగితే అంచనాలు వేయలేం
జలాశయాలను గాలికొదిలేస్తున్న ప్రభుత్వాలు
ఎర్రకాలువ జలాశయంపై భయాందోళన
ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లిన కరాటం రాంబాబు
స్పందించిన కూటమి ప్రభుత్వం
జంగారెడ్డిగూడెం రూరల్, మే 16(ఆంధ్రజ్యోతి): 2018, ఆగస్టు 19వ తేదీని గుర్తు చేస్తేనే అప్‌ల్యాండ్ ఏరియా ప్రజలంతా హడలెత్తిపోతారు. రెండు, మూడు రోజులపాటు భారీ కుండపోత వర్షం కురవడంతో పశ్చిమ ఏజెన్సీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లి నేరుగా వరద నీరు కొంగువారిగూడెం కరాటం కృష్ణమ్తూర్తి ఎర్రకాలువ జలాశయం వైపు పరుగు పెట్టింది. అప్పటికే జలాశ యంలో నీరు ఉండడంతో పాటు దాదాపు లక్ష క్యూసెక్కుల పైగా వరద నీరు జలాశయం వైపు వస్తుంటే చుట్టుపక్కల గ్రామాల వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ స్థాయిలో వచ్చిన వరదను నియంత్రించడానికి జలాశయం నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. ఆ సమయంలో ఒక గేటు మొరాయించింది. స్పిల్‌వేకు 300 మీటర్ల దూరంలో డ్రాప్‌వాల్ గండికొట్టి జలాశయం నుంచి వస్తున్న వరద నీరంతా పొలాల వైపునకు వెళ్లింది. ప్రాజెక్ట్‌కు గండిప డింది ఇక ఊర్లకు ఊళ్లనే ముంచేస్తుందని ప్రజల్లో ప్రచారాలు సాగాయి. ఇది కాస్తా రెండు రోజులకు సద్దుమణిగింది తప్ప శాశ్వత పరిష్కారం లేదు. మళ్లీ ఆస్థాయిలో వర్షాలు వస్తే జలాశయం మట్టి ఆనకట్ట చాలాచోట్ల గండి కొట్టే ప్రమాదం ఉందని చాలామంది హెచ్చరిస్తున్నారు.
ఎర్రకాలువ జలాశయం
జంగారెడ్డిగూడెం మండలం కొంగువారి గూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం ఉంది. ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ముఖ్యమైన ప్రాజెక్ట్. దీనిని 1976లో నిర్మాణ పనులు ప్రారంభించగా 1988లో పనులు పూర్తయ్యాయి. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, నల్లజర్ల వంటి ఆరు మండలాల పరిధిలో దాదాపు 40 గ్రామాల పంట పొలాలకు సాగునీరం దిస్తుంది. వీటి పరిధిలో 34,700 ఎకరాలకు ఆయుకట్టుకు సాగు నీరు అందుతుంది.
స్పందించిన కూటమి ప్రభుత్వం
ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో గేట్లకు మరమ్మతులు చేయలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025లో ప్రాజెక్ట్ మెయింటినెన్స్‌కు రూ.1.8 కోట్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే గేట్లకు మరమ్మతులు, కాలువ పూడిక పనులను చేశారు. ఈ జలాశయం ఆనకట్టను బలపర్చాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి ఒక బృందాన్ని గత నెల 28వ తేదీన ఇక్కడకు పంపింది. హైడ్రాలజీ, సీఈసీడీవో, సీఈ జీడీఎస్‌తో కూడిన బృందం క్షేత్రస్ధాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.
పొంచి ఉన్న ప్రమాదం ?
కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం పూర్తిసామర్థ్యం 83.05 మీటర్లు. ఇప్పటి మండు వేసవిలో ప్రస్తుతం 79 మీటర్లు ఉంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి అంటే దాదాపు దొరమామిడి గుబ్బల మంగమ్మ జలాశయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాగులు, వంకలు సైతం వచ్చి ఎర్రకాలువ జలాశయంలో చేరుతోంది. ఈ క్రమంలో ఇక్కడున్న సమస్యలను ఇప్పుడు గుర్తించి పరిష్కరించుకోకపోతే పెను ప్రమాదం తప్పదని పెద్దలు, రైతులు చెబుతున్నారు.
జలాశయాలపై దృష్టి పెట్టాలి
అలివేరులో గుబ్బల మంగమ్మ జలాశయం ఆ ప్రాంత సాగుకు ఎంతో ముఖ్యమైంది. ఆ జలాశయం నీరు కూడా కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయంలోనే చేరుతుంది. బండ్ బలహీన పడితే ఏ ప్రమాదం జరిగినా ఆస్తి, ప్రాణనష్టం అంచన వేయలేం. 2018 వరద సమయంలో వచ్చిన వరదలో పంట పొలాలు మునిగిపోయాయి. ఈ జలాశయాలపై దృష్టి పెట్టాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లాం.. చర్యలు తీసుకున్నారు.
– కరాటం రాంబాబు, మాజీ డీసీసీబీ చైర్మన్