రాజకీయ ధీశాలి కావూరు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:25 AM
మృదుస్వభావి, నిగర్వి, రాజకీయ దిగ్గజం, ధీశాలి.. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(83) ఇకలేరు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో.. ఎన్నో ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
అనారోగ్యంతో కన్నుమూత.. నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
ఏలూరు, మచిలీపట్నం ఎంపీగా.. మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు
రాష్ట్ర విభజనపై అసంతృప్తి.. మంత్రి పదవికి రాజీనామా.. మోదీ సమక్షంలో బీజేపీలో చేరిక
ఏలూరు జిల్లా అభివృద్ధిలో కావూరు ముద్ర.. ఆర్వోబీలు.. పలు సంస్థల ఏర్పాటు
కొల్లేరు ప్రజల కోసం పార్లమెంట్‌లో గళం.. పలువురు ప్రముఖుల నివాళులు
ఏలూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మృదుస్వభావి, నిగర్వి, రాజకీయ దిగ్గజం, ధీశాలి.. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(83) ఇకలేరు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో.. ఎన్నో ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించారు. ఎంపీగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో తన ముద్ర చూపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి.. సమైక్యాంధ్ర పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు భార్య హేమలత, కుమారుడు భాస్కర్, ముగ్గురు కుమార్తెలు డాక్టర్ శ్రీనగి, శ్రీమణి, శ్రీవాణి ఉన్నారు.
కావూరు ప్రస్థానం ఇలా..
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో 1943 అక్టోబరు రెండో తేదీన జన్మించారు. తల్లి నాగరత్నమ్మ, తండ్రి రాఘవయ్యలకు ఇద్దరు కుమార్తెల తర్వాత సాంబశివరావు పుట్టారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన 1965లో ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. కాంట్రాక్టర్‌గా ప్రస్థానం మొదలు పెట్టి ఆర్థికంగా ఎదిగారు. ఆ తర్వాత సంవత్సరమే ప్రోగ్నెసివ్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టు సంస్థను స్థాపించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1984, 1989, 1998 ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా విజయదుందుబి మోగించారు. తర్వాత ఏలూరుకు మకాం మార్చారు. తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గరై తొలిసారిగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2004లో మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య (టీడీపీ)పైన, 2009లో మాగంటి బాబు(టీడీపీ)పై లక్షకు పైబడి భారీ మెజార్టీతో కావూరి ఘన విజయం సాధించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో 2013 నుంచి 2014 వరకు ఏడాది పాటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆయన సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమానికి తన వంతు మద్దతును అందించారు. అనంతరం కావూరు రాజకీయ ప్రస్థానం మారిపోయింది. 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండో కుమార్తె శ్రీమణి కుమారుడు భరత్ విశాఖ ఎంపీగా ఉన్నారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణకు భరత్ రెండో అల్లుడు కావడంతో నారా చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలతో మంచి సంబంధాలు కొనసాగాయి.
పేదలకు అందుబాటులోనే..
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ నియోజకవర్గాల పర్యటనలో ఎమ్మెల్యేలతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసేవారు. కనీసంగా రెండు రోజులు ప్రతీ శని, ఆదివారాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పేదలు, రైతుల సమస్యలపై ఆయన ఫోకస్ పెట్టేవారు. చదువుతోనే సమాజంలో ఎదుగుల సాధ్యమని పదేపదే సమావేశాల్లోను చెప్పేవారు.పేదరికం లేని సమాజం ఉండాలని ఆకాంక్షించే వారు. తెల్లని కాటన్ వస్ర్తాలను ధరించి నిరాడంబరంగా అందరిని ఆప్యాయంగా పలకరించేవారు.
జిల్లాపై తనదైన ముద్ర
కొల్లేరు ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. కొల్లేరు కాంటూరును కుదించి అక్కడ ప్రజల న్యాయం చేయాలని పార్లమెంట్‌లో తన వాణిని వినిపించారు. పామాయిల్, పొగాకు, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఏమి చేయాలో అధికారులకు దిశా నిర్దేశం చేసేవారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న గన్‌బజార్, వట్లూరులోని రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆయన హయాంలోనే పూర్తియ్యింది. ఏలూరుకు కేంద్రీయ విద్యాలయం తీసుకువచ్చిన ఘనత ఆయనదే. దీనిని తర్వాత గోపన్నపాలెంకు తరలించి నిధుల మంజూరుకు విశేషంగా కృషిచేశారు. ధర్మాజీగూడెం వద్ద వలసపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరిగా పోరాటం చేశారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఏలూరులో జనశిక్షణా సంస్థాన్ ద్వారా మహిళలకు మగ్గం, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్ కోర్సుల్లో వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. తన సొంత నిధులతో కావూరు పౌండేషన్ ఆధ్వర్యంలో వద్ద వసంతమహల్ సెంటర్ వద్ద నిరుద్యోగ యువతి డ్రైవింగ్‌లో శిక్షణ కంప్యూటర్ హార్డ్‌వేర్, ట్యాలీల్లో వేలాది మందికి శిక్షణలను కొనసాగిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
వివిధ పదవులు
కేంద్ర జౌళి శాఖ మంత్రి, ఆంధ్రా బ్యాంకు డైరెక్టర్, హైదరాబాద్ యూనివర్శిటీ సభ్యుడు, టుబాకో బోర్డు సభ్యుడు, సాలార్ జంగ్ మ్యూజియం పాలక మండలి సభ్యులు, దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యులు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ సెనేట్ మెంబర్, ఏఐసీటీయూ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) సభ్యులు, పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ, ఫైనాన్స్ కమిటీ, అంచనాల కమిటీ, పెట్రోలింగ్ అండ్ నేచురల్ గ్యాస్ కమిటీ, పార్లమెంటరీ హౌస్ రూల్స్ కమిటీ, ఉపరితల రవాణా, ఎనర్జి కమిటీ సభ్యుడు, రెండుసార్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా, పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీ, ఎన్‌జి రంగా వ్యవసాయ పరిశోధనా విశ్వ విద్యాలయం పాలకవర్గ సభ్యులుగా పనిచేశారు.
కావూరు సేవలు మరువలేం
కేంద్ర మంతి వర్మ, ఎంపీ పుట్టా
భీమవరం టౌన్/ఏలూరు టూటౌన్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘ఐదుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజా సేవకే తన జీవితాన్ని అంకి తం చేసిన ధీశాలి కావూరి సాంబశివరావు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో నిరంతరం గళం వినిపించిన గొప్ప నాయకుడు. బీజేపీ ఉమ్మడి పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా వున్న సమయంలో భీమవరం ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సాంబశివ రావు పార్టీలో చేరడం మరువలేని సంఘటన. ఆయన మృతి తెలుగు రాష్ట్రాల రాజకీయాల కు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పారిశ్రామికవేత్తగా, ప్రజా ప్రతినిధిగా కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు చేసిన సేవలు మరువలేనివని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ కొనియాడారు. కావూరు మృతికి సంతాపం వెలిబుచ్చారు. జౌళి శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టారని, కావూరు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్య రంగాల్లో పేదలకు ఎన్నో సేవలందిం చారన్నారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.