అనాథగా ప్రభుత్వ జూనియర్ కళాశాల
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:16 AM
తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అనాఽథగా మారింది. సొంత భవనం లేక 33 ఏళ్లుగా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
33 ఏళ్లుగా జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహణ
సరిపడా తరగతి గదుల్లేవు..
సర్దుకుపోతున్న వైనం
గూడెంలో విద్యార్థుల అవస్థలు
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అనాఽథగా మారింది. సొంత భవనం లేక 33 ఏళ్లుగా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజక వర్గంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వంలో తీర్మానం చేశారు. అప్పటికే పెంటపాడులో డీఆర్ గోయింకా కళాశాల ఏర్పాటు చేసి ఇంటర్ నుంచి, డిగ్రీ వరకు తరగతులు నిర్వహించేవారు. తాడేపల్లిగూడెంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని అప్పటి ఎమ్మెల్యే యీలి ఆంజ నేయులు నిర్ణయించి ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు యీలి ఆంజనేయులు జూనియర్ కళాశాలగా నామకరణం చేశారు. ఎస్‌బీఐ రోడ్డులోని రేఖా బిల్డింగ్‌లో తరగతులను ప్రారంభించారు. ఆ భవనం శిఽథిలావస్థకు చేరడంతో 1993లో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణానికి మార్చారు. అప్పటి నుంచి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కళాశాలలో సీటు కావాలంటే మెరిట్‌తోపాటు ఎమ్మెల్యే లెటర్ అవసరమయ్యేంత గొప్పపేరు ఉండేది. ఇక్కడ సీటు రాని వారు డీఆర్ గోయింకా కళాశాలకు వెళ్లేవారు. అక్కడా రాకపోతే నారా యణపురం, గణపవరంలోని కళాశాలలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. అలాంటి చరిత్ర కలిగిన కళాశాల ఇప్పుడు భవనం లేక అనాథగా మారింది.
450 మందికి పైగా విద్యార్థులు
ఇప్పటికీ ఈ కళాశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఓకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉన్న తొమ్మిది గదుల్లో ఒకటి ఆఫీస్, ప్రిన్సిపాల్ రూమ్‌గా ఉంది. మరో రూమ్‌లో కెమిస్ర్టీ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏడు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. బోటనీ, జూవాలజీ, ఫిజిక్స్ ల్యాబ్‌లకు రూమ్స్ లేవు, పీఈటీ వున్న సామగ్రి పెట్టుకోడానికి రూమ్ లేదు. లైబ్రరీ, స్టాప్ రూమ్‌లు లేవు. అన్నింటిని సర్దుబాటు చేసుకుని కళాశాల నిర్వహణ జరుగుతుంది. ప్రభుత్వ బాలికోన్నత, పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలు ఏర్పాటు చేసినట్టే జూనియర్ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.