Share News

జనసైనికులు..చెరో దారి!

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:01 AM

పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోని వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి.

జనసైనికులు..చెరో దారి!
పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల్లో మాట్లాడుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు. చిత్రంలో పార్టీ ముఖ్య నాయకులు

రెండు వర్గాలుగా పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు

కొయ్యలగూడెం/టి.నరసాపురం,సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి):పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోని వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను బుధవారం రెండుచోట్ల వేర్వేరుగా నిర్వహించారు. నియోజక వర్గంలోని టి.నరసాపురం మండలంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో పవన్‌ జన్మదిన వే డుకలు నిర్వహించగా, కొయ్యలగూడెం మండలం లో నియోజకవర్గంలోని ఏడు మండలాల జన సేన పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనేతల ఆధ్వర్యంలో వేడుకలు జరగడం గమనార్హం.

కొయ్యలగూడెం మండలం వై జంక్షన్‌లోని దండమూడి కల్యాణ మండపంలో జరిగిన వేడు కలకు డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు, నియోజకవర్గ జనసేన ముఖ్యనేతలు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్‌, సొసైటీ అధ్య క్షుడు కరాటం ఉమతో పాటు ఏడు మండలాల జనసేన అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా తమకు తగిన గుర్తింపు ఉండడం లేదని, నాయకులు, కార్యకర్తలకు పార్టీ భరోసా ఇవ్వకపోతే తాము ఎలా పని చేయాలంటూ కరాటం ఎదుట ఏడు మండలాల జనసేన అధ్యక్షులు తమ ఆవేదనను వెల్లిబుచ్చారు. తమ మండలాలకు సంబంధించి ఏ సమాచారం ఉండడం లేదంటూ వాపోయారు. దీనిపై కరాటం మాట్లాడుతూ అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

టి.నరసాపురం ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్లో జరి గిన పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. చింతలపూడి నవతేజ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ నరేష్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చి రోగులకు మందులు పంపిణీ చేశారు. నియో జకవర్గంలోని మండలాలకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇలా రెండు చోట్ల వర్గాలుగా విడిపోయి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోగా ఈ విషయం పవన్‌ కల్యాణ్‌ దృష్టి వరకు వెళ్లింది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని నియోజకవర్గంలోని కూటమి నాయకులంతా చర్చించుకుంటున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 01:01 AM