Share News

జాతర సందడి

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:37 AM

ఏలూరు నగరంలో ఐదు చోట్ల ‘తూర్పు వీధి, దక్షిణపు వీధి, పవరుపేట, ఆదివారపుపేట, లక్ష్మీవారపుపేట’ల్లోని గంగానమ్మ, మహాలక్ష్మి, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలు తుది అంకానికి చేరుకున్నాయి.

జాతర సందడి
అమ్మవారికి తెచ్చిన పిండివంటలకు హారతిస్తున్న మహిళలు

నేడు మహా కుంభం

రేపటితో ఐదు చోట్ల ముగింపు

ఏలూరుకార్పొరేషన్‌/ఏలూరు రూరల్‌/ఏలూరుక్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు నగరంలో ఐదు చోట్ల ‘తూర్పు వీధి, దక్షిణపు వీధి, పవరుపేట, ఆదివారపుపేట, లక్ష్మీవారపుపేట’ల్లోని గంగానమ్మ, మహాలక్ష్మి, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆదివారం జాతరల వద్ద మహా కుంభం పోసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం కొర్రల బండితో సాగనంపుతారు. పడమరవీధిలోని జాతర ఫిబ్రవరి ఒకటో తేదీన మహా కుంభం, రెండో తేదీన సాగనంపే కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆయాచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కర కాలానికి ఒకసారి జరిగే జాతరను గతంలో పెద్దలు ఏడేళ్లకు తగ్గించడంతో ఈ ఏడాది 2025లో జాతర వచ్చిందని వృద్ధులు చెప్పారు. 2018లో ఏడేళ్లకు తగ్గించడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు చేస్తున్నారు. జాతర్లలో మేడల్లో ఉన్న అమ్మవార్లను ఆయా పరిధిలోని ప్రజలు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం, పసుపు, కుంకుమలతో అర్చనలు జరపడం, భక్తి సంకీర్తనలు ఆలపించి భజనలు నిర్వహించడం, సామూహిక పూజలు, పారాయణలు, కుంకుమార్చనలు జరిపారు. ప్రజలు తమ శక్తి కొద్దీ మేళతాళాలు, బాజాభజంత్రీలతో అమ్మవార్లకు ప్రదర్శనగా వచ్చి సారెలు సమర్పించారు. సోమవారం జరిగే ముగింపు వేడుకలకు, అమ్మవార్లను సాగనంపే కార్యక్రమానికి ఉత్సవ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.

నగరం జన సంద్రం

నగరంలో ఐదుచోట్ల కుంభం పోసే కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తుండడం, సోమవారం ఉదయం కొర్రలబండి ఊరేగింపుగా ఊరుదాటనున్న నేపథ్యంలో నగరంలో ఉన్న ప్రజలు మూడున్నర లక్షల మంది కాగా అదనంగా రెండు లక్షల మంది జాతరకు వస్తున్నట్లుగా పోలీసు శాఖ అధికారులు అంచనా వేశారు. వస్తున్న వారితో ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌, పవర్‌పేట రైల్వే స్టేషన్లు ఇసుక వేస్తే రాలనంత జనసంద్రంతో నిండిపోయింది. ఇక గూడ్స్‌ షెడ్డు రోడ్డులో శనివారం సాయంత్రం వెళ్లాలంటే మూడు గంటల సమయం పడుతుంది. ఎక్కడికక్కడే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏలూరు పాతబస్టాండ్‌, కొత్త బస్టాండ్‌ ప్రయాణికులతో నిండిపోయాయి.

ఆకర్షణీయంగా ఫ్లెక్సీలు

ఏ ఇంట చూసినా బంధువులు, స్నేహితులతో ఇళ్లన్నీ నిండిపోయి కళకళలాడుతున్నాయి. ఇక నాయకులు, అనుచర వర్గం జాతర కమిటీ వారు భక్తులను ఆహ్వా నిస్తూ ఏర్పాటు చేసిన రంగురంగుల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఆకర్షణగా నగరంలో ఏ వీధికి వెళ్లినా కనిపిస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లు..

రైళ్లలో ప్రయాణానికి కనీసం నిలబడేందుకు వీలులేకుండా ఉన్నప్పటికీ జాతరకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈనెల 25, 26 తేదీలలో విశాఖపట్టణం నుంచి చర్లపల్లికి రైళ్లను నడుపుతుంది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.

మార్కెట్‌లు కిటకిట.. నాటు కోళ్లకు డిమాండ్‌

జాతర పురస్కరించుకుని బంధువులను పిలిచి నాన్‌ వెజ్‌ వంటకాలతో విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా చేపల మార్కెట్‌, కిరాణా దుకాణాలు, మహిళలకు చీరలు పెట్టేందుకు కొనుగోలుదారులతో వస్త్రదుకాణాలు కిటకిటలాడు తున్నాయి. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాలకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం నగరానికి చేరుకున్నారు. జాతరకు ఒక రోజు ముందే నగరంలో కోలాహలం మొదలవడంతో జాతర సందడితో జోష్‌ నింపుతోంది. మార్కెట్లో చికెన్‌, మటన్‌, రొయ్యలు, చేపలు ధరలు పెరిగాయి. ఇదే సమయంలో నాటు కోళ్లకు డిమాండ్‌ మరింత పెరిగింది. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌ ప్లైఓవర్‌ వద్ద నాలు కోళ్ల కొనుగోలుకు జనం ఎగబడ్డారు. నాటు కోడి మాంసానికి మటన్‌ ధర మాదిరిగానే రేటు పలుకుతోంది. కిలో కోడి ధర రూ.800 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కిలోన్నర కోడి చేస్తే కిలో చికెన్‌ వస్తుంది. ఇంత ధర ఉన్నా ఈ కోడి మాంసాన్నే అందరూ ఇష్టపడుతున్నారు.

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్‌

ఏలూరు క్రైం, జనవరి 24(ఆంధ్రజ్యోతి):ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర ఈ నెల 25, 26 తేదీలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఎస్పీ శివకిశోర్‌తో కలిసి ఏలూరు గంగానమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను క్షేత్రస్థాయిలో శనివారం ఉదయం పరిశీలించారు. అధికారులకు ఆలయ కమిటీ సభ్యులకు దిశా నిర్ధేశం చేశారు. ఆలయ పరిసరాల ను పరిశీలించిన ఆయన బందో బస్తు, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, ఎక్కడా తోపులాటలు జరగకుండా పటిష్టమైన క్యూలైన్ల ఏర్పాటు చేయాలని సూచించారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో నగరంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌ విభాగం అధికారులను ఆదేశించారు. జాతర కమిటీ సభ్యులు, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య ఆరగ్యో శాఖల అధికారులతో పోలీస్‌ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని కోరారు. భక్తుల కోసం అత్యవసర వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయం జాతర కమిటీ సభ్యులు కల్పించాలన్నారు. జాతర ముసుగులో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడేటటు వంటి వారిని ముందుగానే గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలని, డ్రోన్‌ కెమెరాల, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:37 AM